Indian Apps: భారతదేశంలోని పది పాపులర్ యాప్‌లపై గూగుల్ కఠిన చర్యలు తీసుకుంది. గూగుల్ ఈ యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించింది. ఎందుకంటే ఈ యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్ బిల్లింగ్ విధానాన్ని అనుసరించడం లేదు. గూగుల్ ప్లే స్టోర్‌లో రెండు లక్షలకు పైగా భారతీయ యాప్ డెవలపర్‌లు తమ బిల్లింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారని, అయితే ఈ పది యాప్‌లు మాత్రమే తమ సర్వీసుల కోసం గూగుల్ ప్లే స్టోర్‌కు ఇంకా నగదు చెల్లించలేదని గూగుల్ తన బ్లాగ్ పోస్ట్‌లలో రాసింది.


గూగుల్ ఈ యాప్‌లకు సిద్ధం అవ్వడానికి మూడు సంవత్సరాల కంటే ఎక్కువ సమయం ఇచ్చిందని, అందులో సుప్రీం కోర్టు ఆదేశాల తర్వాత కూడా మూడు వారాలు గడిచిందని తన బ్లాగ్ పోస్ట్‌లో స్పష్టంగా రాసింది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌లను తీసివేయడానికి ముందు గూగుల్ ఈ బ్లాగ్ పోస్ట్‌ను విడుదల చేసింది.


ఇప్పుడు గూగుల్ ఈ నిర్ణయం కారణంగా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి 10 భారతీయ యాప్‌లను తీసివేసింది. వీటిలో Kuku FM, Bharat Matrimony, Shaadi.com , Naukri.com , 99 Acres, Truly Madly, Quack Quack, Stage, ALTT (Alt Balaji) యాప్స్ ఉన్నాయి.


యాప్‌ల యజమానులు ఏం చెప్పారు?
గూగుల్ తీసుకున్న ఈ చర్య తర్వాత కుకు ఎఫ్ఎం సీఈవో లాల్ చంద్ బిసు గూగుల్‌ని విమర్శిస్తూ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఇలా రాశాడు. "గూగుల్ వ్యాపారం విషయంలో పరమ చెత్త కంపెనీ. వారు భారతీయ స్టార్టప్ సిస్టమ్‌ను పూర్తిగా నియంత్రిస్తారు. 2019లో గూగుల్ 25 రోజుల పాటు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మమ్మల్ని ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ప్లేస్టోర్‌లో యాప్ లేకుండా మా టీమ్ ప్రతిరోజూ ఆఫీసులో పని చేసేటప్పుడు ఆ వాతావరణం ఎలా ఉంటుందో ఊహించండి." అని పేర్కొన్నాడు


"ఇప్పుడు వారు మమ్మల్ని మళ్లీ గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించారు. ఇప్పుడు వారి నిబంధనలను అంగీకరించడం మినహా మాకు వేరే మార్గం లేదు. ఇది మా వ్యాపారాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. దేశంలోని చాలా మందికి కుకు ఎఫ్ఎం వినిపించదు." అన్నాడు. నౌకరీ.కామ్, 99 యాకర్స్ వ్యవస్థాపకులు కూడా గూగుల్‌కి వ్యతిరేకంగా ఇదే విధమైన కామెంట్లు చేశారు.


కుకు ఎఫ్ఎం సీఈవో లాల్ చంద్ బిసు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, "మా ఎకో సిస్టంను వారు కంట్రోల్ చేస్తే మనం ఎప్పటికీ సురక్షితంగా పనిచేయలేమని అనిపిస్తుంది. భారత ప్రభుత్వం ముందుకు వచ్చి సేవ్ ది ఎకోసిస్టమ్‌ను ప్రారంభించాలని మేము కోరుకుంటున్నాము."  అన్నారు


భారతదేశానికి చెందిన మరొక పెద్ద యాప్, షాదీ.కామ్ వ్యవస్థాపకుడు అనుపమ్ మిట్టల్ కూడా ఎక్స్‌లో ఒక పోస్ట్ రాస్తూ "ఈ రోజు భారతీయ ఇంటర్నెట్ చరిత్రలో చీకటి రోజు. గూగుల్ తన ప్లే స్టోర్ నుంచి అనేక పెద్ద యాప్‌లను తొలగించింది." అని పేర్కొన్నారు.


గూగుల్‌కి కోర్టు మద్దతు
ఈ యాప్‌లు గూగుల్‌కి వ్యతిరేకంగా తమ స్వరాన్ని పెంచుతూ కోర్టును కూడా ఆశ్రయించాయి. కానీ ఆ కారణంగా వాటిని గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించలేదు. ఈ భారతీయ యాప్ డెవలపర్లు గూగుల్ ప్లే స్టోర్ బిల్లింగ్ విధానాన్ని సవాలు చేస్తూ గతంలో మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఆ పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత ఈ యాప్‌లు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అయితే 2024 ఫిబ్రవరి 9నన జరిగిన విచారణలో ఈ యాప్‌లను ప్లే స్టోర్‌లో సేవ్ చేయడానికి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను మార్చి 19కి వాయిదా వేసింది.


Also Read: నోకియా ఫోన్లు ఇక కనిపించవా? - కంపెనీ కొత్త ప్రకటనకు అర్థం ఏంటి?



Also Read: వాట్సాప్ ఛాట్ బ్యాకప్ చేస్తున్నారా? - అయితే త్వరలో రానున్న ఈ రూల్ తెలుసా?