ఒక్కోసారి మనం తీసుకునే ఫోటోల్లో ఇతర వ్యక్తులు కూడా కనిపిస్తుంటారు. వారిని ఈ ఫోటోలో నుంచి తొలగిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలాంటి వారి కోసమే టెక్ దిగ్గజం గూగుల్ సరికొత్త టూల్ ను అందుబాటులోకి తెచ్చింది. తన యూజర్ల కోసం ‘మ్యాజిక్ ఎరేజర్’ పేరుతో కొత్త ఫీచర్లను పరిచయం చేసింది. దీనిని ఉపయోగించి ఫోటోల్లో ఉన్న అనవసరమైన వ్యక్తులు లేదంటే అబ్జెక్టులను తొలగించుకునే అవకాశం ఉంటుంది.
iOS, Android ఫోన్లలోనూ అందుబాటులోకి మ్యాజిక్ ఎరేజర్
నిజానికి ఈ ఫీచర్ గతంలో లేటెస్ట్ ఫిక్సెల్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు ఓల్డ్ ఫిక్సెల్ ఫోన్లలోనూ అందుబాటులోకి వచ్చింది. అటు iOS, Android ఫోన్లలోనూ Google One సబ్ స్క్రిప్షన్ ఉన్న వారు కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఈ విషయాన్ని తాజాగా గూగుల్ సంస్థ వెల్లడించింది. మ్యాజిక్ ఎరేజర్‌తో మీ ఫొటోల మీద సర్కిల్ చేయడం లేదంటే బ్రష్ చేయడం ద్వారా అనవసర వ్యక్తులు, వస్తువులను ఈజీగా తొలగించుకోవచ్చని తెలిపింది. అంతేకాదు, ఫోటోలో ఏమేమి తీసి వేయాలి అనే అంశాలకు సంబంధించి సలహాలు కూడా ఇస్తుందని వివరించింది.
మ్యాజిక్ ఎరేజర్ ఉపయోగాలు ఏంటంటే?
ఇంతకీ ఈ మ్యాజిక్ ఎరేజర్ టూల్ ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి ఈ ఫీచర్ ను ఉపయోగించడం పెద్ద కష్టమేమీ కాదు. గూగుల్ ఫోటోలు ఓపెన్ చేసి, ఎడిట్ చేయాలి అనుకుంటున్న ఫోటోపై క్లిక్ చేయాలి. మ్యాజిక్ ఎరేజర్ అనే టూల్ కనిపిస్తుంది. ఒకవేళ అది కనిపించకపోతే ఎడిట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత టూల్స్ ఓపెన్ చేయాలి. అనంతరం మ్యాజిక్ ఎరేజర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఫోటోలో ఉన్న అనవసర విషయాలను తొలగించే అవకాశం ఉంటుంది. మిగిలిన ఫోటోలోని వస్తువుల రంగును కూడా మార్చుకునే అవకాశం ఉంటుంది. మ్యాజిక్ ఎరేజర్ అనేది ఫొటోలను మరింత అందంగా మెరుగుపరచాలనుకునే వారికి మరింత ఉపయోగకరంగా ఉంటుంది. దీనితో ఫొటోలను మరింత ప్రొఫెషనల్‌గా కనిపించేలా చేసుకునే అవకాశం ఉంటుంది. గూగుల్ వన్ సబ్‌స్క్రిప్షన్ ఆల్రెడీ తీసుకున్న వారు తమ Android లేదా iOS డివైజ్‌లో ఈ ఫీచర్‌ను ఉపయోగించవచ్చు. గూగుల్ వన్ సబ్ స్క్రైబర్లు కూడా మ్యాజిక్ ఎరేజర్‌తో పాటు HDRతో తమ వీడియోల బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ ను మార్చుకునే అవకాశం ఉంటుంది.
Read Also: గూగుల్ క్రోమ్ గుడ్ న్యూస్ - ఇక మీరు ఎంత బ్రౌజ్ చేసినా మెమరీ నిండదు, పవర్ కూడా ఆదా!