IND vs AUS 3rd test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో భాగంగా రేపట్నుంచి భారత్- ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్ట్ ప్రారంభం కానుంది. ఇండోర్ వేదికగా ఉదయం 9.30 గంటలకు ఈ మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే తొలి 2 టెస్టులు గెలిచిన భారత్ సిరీస్ లో 2-0 ఆధిక్యంలో ఉంది. రెట్టించిన ఉత్సాహంతో టీమిండియా సిద్ధమవుతోంది. మరోవైపు మిగతా 2 మ్యాచ్ లు గెలిచి సిరీస్ ను సమం చేయాలని ఆసీస్ అనుకుంటోంది. మరి ఈ మ్యాచ్ లోనూ గెలిచి టీమిండియా సిరీస్ సాధిస్తుందా లేక ఆసీస్ గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా ఉంచుకుంటుందా.. చూడాలి.
హై పిచ్ లో భారత్
బలమైన ఆస్ట్రేలియా జట్టును 2 టెస్టుల్లో చిత్తుగా ఓడించడం భారత జట్టు ఆత్మవిశ్వాసాన్ని పెంచేసింది. కేఎల్ రాహుల్ తప్ప మిగిలిన ఆటగాళ్లందరూ చెప్పుకోదగ్గ ఫాంలోనే ఉన్నారు. కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్ లో జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. అతను అదే జోరును కొనసాగించాలని జట్టు కోరుకుంటోంది. కోహ్లీ, పుజారా, భరత్ లు సమయానుకూలంగా ఆడుతున్నారు. లోయరార్డర్ లో అశ్విన్, జడేజా, అక్షర్ లు జట్టుకు ఉపయోగపడే పరుగులు చేస్తున్నారు. ఈ స్పిన్ త్రయం బౌలింగ్ లోనూ అదరగొడుతోంది. ముఖ్యంగా ఈ సిరీస్ తో పునరాగమనం చేసిన ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అత్యుత్తమంగా ఆడుతున్నాడు. కాబట్టి భారత్ కు పెద్దగా సమస్యలేవీ లేవనే చెప్పాలి. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. కాబట్టి ఒక స్పిన్నర్ బదులు ఇంకో పేసర్ ను అదనంగా తీసుకునే అవకాశముంది. అదే జరిగితే ఉమేష్ యాదవ్ కానీ, జైదేవ్ ఉనద్కత్ కానీ జట్టులోకి వస్తారు.
ఈ ఇద్దరిలో ఎవరు!
కేఎల్ రాహుల్ తొలి 2 టెస్టుల్లోనూ ఘోరంగా విఫలమయ్యాడు. అసలు గత కొన్నాళ్లుగా రాహుల్ ఫాంలో లేడు. పరుగులు చేయడానికి తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. జట్టులో అతని ఎంపికపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వరుసగా విఫలమవుతున్నా ఎందుకు అవకాశాలిస్తున్నారంటూ మాజీలు ప్రశ్నిస్తున్నారు. రాహుల్ స్థానంలో సూపర్ ఫాంలో ఉన్నశుభ్ మన్ గిల్ ను ఆడించాలని డిమాండ్లు వస్తున్నాయి. అయితే కోచ్, కెప్టెన్ మాత్రం రాహుల్ కు ఇప్పటికీ మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో మూడో టెస్టులో రోహిత్ కు తోడుగా ఈ ఇద్దరిలో ఎవరు ఓపెనింగో చేస్తారో చూడాలి.
ఆసీస్ నిలబడుతుందా!
సొంత గడ్డపై భారత్ ను ఓడించడం ఎంత కష్టమో ఆస్ట్రేలియాకు ఇప్పటికే అర్థమైపోయింది. స్పిన్ కు అనుకూలించిన పిచ్ లపై ఆసీస్ బ్యాటర్లను టీమిండియా స్పిన్నర్లు హడలెత్తించారు. ప్రాక్టీసులో ఎంతగా స్పిన్ ను సాధన చేసినా అసలు మ్యాచుల్లో మన స్పిన్ త్రయం ముందు కంగారూలు తలవంచక తప్పలేదు. దీంతో 2 టెస్టులు 6 రోజుల్లోనే ముగిశాయి. అయితే మూడో టెస్ట్ జరిగే ఇండోర్ పిచ్ పై బౌన్స్ ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో పిచ్ ఫాస్ట్ బౌలర్లకు సహకరిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. మరోవైపు క్రీజులో నిలబడితే బ్యాటర్లు భారీస్కోరు సాధించవచ్చని అంటున్నారు. ఆసీస్ అంటే భీకరమైన పేస్ బౌలర్లకు ప్రసిద్ధి. ఒకవేళ పిచ్ అందరూ అనుకుంటున్నట్లే పేస్ కు సహకరిస్తే ఆ జట్టుకు గెలిచే అవకాశముంటుంది. బ్యాటింగ్ లో ఖవాజా, లబూషేన్, స్మిత్ లపై ఆ జట్టు ఎక్కువ ఆధారపడుతోంది. తొలి రెండు టెస్టుల్లో ఆడని కామెరూన్ గ్రీన్, మిచెల్ స్టార్క్ లు జట్టుతో చేరడం వారికి బలాన్నిచ్చేదే. తొలి 2 టెస్టుల ఫలితం పునరావృతమవుతుందా లేక మారుతుందా అనేది చూద్దాం.
పాట్ కమిన్స్ దూరం
మూడో టెస్టుకు ఆస్ట్రేలియా రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ దూరం అయ్యాడు. అతను వ్యక్తిగత కారణాల వల్ల ఆస్ట్రేలియాకు వెళ్లాడు. కమిన్స్ స్థానంలో స్టీవెన్ స్మిత్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్
ఈ మ్యాచ్ ఫలితంతో టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. ఈ టెస్ట్ గెలిస్తే మిగతా ఎలాంటి సమీకరణాలతో సంబంధం లేకుండా అధికారికంగా భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. డ్రా చేసుకున్నా భారత్ కు ఢోకా ఉండదు. అయితే ఓడితే మాత్రం భారత్ ఫైనల్ అవకాశాలపై అది ప్రభావం చూపిస్తుంది. మరోవైపు ఆస్ట్రేలియా కనీసం డ్రా చేసుకున్నా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఆఖరి పోరుకు అర్హత సాధిస్తుంది.
భారత తుది జట్టు (అంచనా)
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (లేదా) శుభ్ మన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎస్. భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ (లేదా) జైదేవ్ ఉనద్కత్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్.
ఆస్ట్రేలియా తుది జట్టు (అంచనా)
ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబూషేన్, స్టీవెన్ స్మిత్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాట్ రెన్ షా, పీటర్ హ్యాండ్స్ కాంబ్, అలెక్స్ క్యారీ, నాథన్ లియాన్, టాడ్ మర్ఫీ, స్కాట్ బోలాండ్, మిచెల్ స్టార్క్.