Google Pixel 9 Series Launched: గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లు మనదేశంలో లాంచ్ అయ్యాయి. ఇందులో గూగుల్ పిక్సెల్ 9, గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. గూగుల్ లేటెస్ట్ ప్రాసెసర్ టెన్సార్ జీ4 ప్రాసెసర్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్‌తో ఈ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. ఏకంగా ఏడు సంవత్సరాల పాటు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు, సెక్యూరిటీ ప్యాచెస్, పిక్సెల్ డ్రాప్స్‌ను ఈ ఫోన్లు పొందనున్నాయి.
గూగుల్ పిక్సెల్ 9 ధర (Google Pixel 9 Price in India)
ఇందులో కేవలం 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధరను రూ.79,999గా నిర్ణయించారు. పియోనీ, పోర్స్‌లెయిన్, ఆబ్సీడియన్, వింటర్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఇందులో 128 జీబీ మోడల్ కూడా ఉంది కానీ ఇది మనదేశంలో అందుబాటులో లేదు.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ధర (Google Pixel 9 Pro Price in India)
గూగుల్ పిక్సెల్ 9 కూడా 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లోనే అందుబాటులో ఉంది. దీని ధర రూ.1,09,999గా ఉంది. హజెల్, పోర్స్‌లెయిన్, రోజ్ క్వార్ట్జ్, ఆబ్సీడియన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ ధర (Google Pixel 9 Pro XL Price in India)
గూగుల్ పిక్సెల్ 9 ప్రోలో 16 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను కంపెనీ లాంచ్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ కొనాలంటే రూ.1,24,999 పెట్టాల్సిందే. గూగుల్ పిక్సెల్ 9 ప్రో తరహాలోనే హజెల్, పోర్స్‌లెయిన్, రోజ్ క్వార్ట్జ్, ఆబ్సీడియన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కూడా మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. మొత్తం మూడు ఫోన్లూ ఫ్లిప్‌కార్ట్, క్రోమా, రిలయన్స్ డిజిటల్ రిటైల్ అవుట్‌లెట్లలో అందుబాటులో ఉండనున్నాయి. ఆగస్టు 22వ తేదీ నుంచి దీని సేల్ ప్రారంభం కానుంది.
Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?
గూగుల్ పిక్సెల్ 9 స్పెసిఫికేషన్లు (Google Pixel 9 Specifications)
ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టంపై గూగుల్ పిక్సెల్ 9 రన్ కానుంది. దీనికి ఏకంగా ఏడు సంవత్సరాల పాటు ఆపరేటింగ్ సిస్టం అప్‌డేట్లు, సెక్యూరిటీ ప్యాచెస్, పిక్సెల్ డ్రాప్స్ అందించనున్నారు. ఈ ఫోన్‌లో 6.3 అంగుళాల యాక్చువా ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్ స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ మధ్యలో ఉండనుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ద్వారా స్క్రీన్‌కు ప్రొటెక్షన్ లభించనుంది. గూగుల్ టెన్సార్ జీ4 ప్రాసెసర్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ కో ప్రాసెసర్లపై ఈ ఫోన్ పని చేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ ఆక్టా పీడీ వైడ్ యాంగిల్ కెమెరాను అందించారు. దీంతోపాటు 48 మెగాపిక్సెల్ క్వాడ్ పీడీ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ అందుబాటులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 10.5 మెగాపిక్సెల్ డ్యూయల్ పీడీ సెల్ఫీ షూటర్ అందుబాటులో ఉంది. మ్యాజిక్ ఎరేజర్, బెస్ట్ టేక్, ఫొటో అన్‌బ్లర్, నైట్ సైట్ వంటి ఫీచర్లు కెమెరాలో అందించారు.
ఇందులో ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. ఫేస్ అన్ లాక్ ద్వారా కూడా ఫోన్‌ను ఓపెన్ చేయవచ్చు. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బారోమీటర్ గైరో స్కోప్, మ్యాగ్నెటో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి. వైఫై 6, బ్లూటూత్ వీ5.3, గూగుల్ కాస్ట్, ఎన్ఎఫ్‌సీ, జీపీఎస్, డ్యూయల్ బ్యాండ్ జీఎన్ఎస్ఎస్, బైదు, గ్లోనాస్, గెలీలియో, క్యూజెడ్ఎస్ఎస్, నావిక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు అందించారు.
ఈ ఫోన్‌లో 4700 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. ఇది 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను, వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్ట్ చేస్తుంది. ఫోన్ ఛార్జర్‌ను బాక్స్‌లో అందించడం లేదు. దీని మందం 0.85 సెంటీమీటర్లు కాగా, బరువు 198 గ్రాములుగా ఉంది.
గూగుల్ పిక్సెల్ 9 ప్రో, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ స్పెసిఫికేషన్లు
ఈ రెండు ఫోన్లకు సంబంధించిన సిమ్, ఆపరేటింగ్ సిస్టం, ప్రాసెసర్లు గూగుల్ పిక్సెల్ 9 తరహాలోనే ఉంటాయి. గూగుల్ పిక్సెల్ 9 ప్రోలో 6.3 అంగుళాల సూపర్ యాక్చువా ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్‌లో 6.8 అంగుళాల సూపర్ యాక్చువా ఎల్టీపీవో ఓఎల్ఈడీ డిస్‌ప్లే అందుబాటులో ఉంది. రెండిట్లోనూ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందుబాటులో ఉంది.
ఈ రెండు ఫోన్లలోనూ వెనకవైపు మూడు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరాగా 50 మెగాపిక్సెల్ ఎంపీ ఆక్టా పీడీ వైడ్ కెమెరా ఉంది. దీంతోపాటు 48 మెగాపిక్సెల్ క్వాడ్ పీడీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 48 మెగాపిక్సెల్ క్వాడ్ పీడీ టెలిఫొటో కెమెరా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 42 మెగాపిక్సెల్ డ్యూయల్ పీడీ సెల్ఫీ కెమెరా అందుబాటులో ఉంది.
గూగుల్ పిక్సెల్ 9 ప్రోలో 4700 ఎంఏహెచ్ బ్యాటరీని, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్‌లో 5060 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. గూగుల్ పిక్సెల్ 9 ప్రో బరువు 199 గ్రాములు కాగా, గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఎక్స్ఎల్ బరువు 221 గ్రాములుగా ఉంది.
Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే