గూగుల్ ఆండ్రాయిడ్ ట్యాబ్లెట్లను సీరియస్‌గా తీసుకోనుందని తెలుస్తోంది. ప్రస్తుతం యాపిల్ ఐఫోన్లు, ఐప్యాడ్లలో అందుబాటులో ఉన్న కీలక ఫీచర్‌ను ఆండ్రాయిడ్‌లోకి కూడా తీసుకురానుంది. దీంతో వినియోగదారులు స్మార్ట్ ఫోన్‌లో కాపీ చేసిన టెక్స్ట్ కానీ, ఇమేజ్ కానీ ట్యాబ్లెట్‌లో పోస్ట్ చేయవచ్చు. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టంతో ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.


గూగుల్ ఐ/వో 2022 ఈవెంట్లో గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ లిజా మా ఈ విషయాన్ని తెలిపారు. మల్టీ డివైస్ ఎక్స్‌పీరియన్స్ ద్వారా ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. దీంతో ఆండ్రాయిడ్ ఉత్పత్తులను వాడటం మరింత సులభం కానుందని పేర్కొన్నారు. మెసేజ్, ఈ-మెయిల్‌ల అవసరం లేకుండానే ఈ టెక్స్ట్‌ను పేస్ట్ చేసుకోవచ్చన్నారు.


భవిష్యత్తులో మరిన్ని మల్టీ డివైస్ ఎక్స్‌పీరియన్స్‌లను తాము అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. దీంతో ఆండ్రాయిడ్ వినియోగదారుల జీవితం మరింత సులభం అవుతుందన్నారు. అయితే ఈ ఫీచర్ ఎలా వర్క్ అవ్వనుందో మాత్రం గూగుల్ ఇంకా తెలపలేదు.