Google Account Safety: మొబైల్, టీవీ, కంప్యూటర్... ఇలా ఇంటర్నెట్‌కు కనెక్ట్ అయ్యే డివైస్‌లు పెరిగిపోయిన ప్రస్తుత ప్రపంచంలో ప్రజలకు సౌకర్యాలు ఎంత పెరిగిపోయాయో, కష్టాలు కూడా అంతే పెరిగాయి. ఆన్‌లైన్ వినియోగదారులకు అతిపెద్ద కష్టం ఏంటంటే సైబర్ నేరాల నుండి సురక్షితంగా ఉండటమే. సైబర్ నేరగాళ్లు ప్రతిరోజూ ఇంటర్నెట్ వినియోగదారుల ప్రైవసీని హ్యాక్ చేయడానికి మార్గాలను కనుగొంటూనే ఉంటారు.
సైబర్ నేరస్థులు పాస్‌వర్డ్ లేకుండా కూడా ఏ యూజర్ గూగుల్ ఖాతాను అయినా సరే యాక్సెస్ చేయగల ఒక పద్ధతిని కనుగొన్నారు. వినియోగదారులు తమ గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసినప్పటికీ, హ్యాకర్లు వారి గూగుల్ అకౌంట్‌ను యాక్సెస్ చేయగలరు.
హ్యాకర్లు మరొకరి గూగుల్ ఖాతాను ఎలా ఉపయోగిస్తున్నారు?
ఏ యూజర్‌కు అయినా ఇది పెద్ద ప్రమాదం. ఎందుకంటే నేటి ఆధునిక యుగంలో చాలా మంది వ్యక్తులు తమ వ్యక్తిగత డేటా, పాస్‌వర్డ్‌లను వారి గూగుల్ ఖాతాలో సేవ్ చేసుకుంటారు. అటువంటి పరిస్థితిలో హ్యాకర్లు పాస్‌వర్డ్ లేకుండా వ్యక్తుల గూగుల్ ఖాతాలను ఉపయోగించడం ప్రారంభిస్తే అప్పుడు జీమెయిల్ యూజర్ల అందరి ప్రైవసీ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ది ఇండిపెండెంట్ కథనం ప్రకారం భద్రతా సంస్థ CloudSEK ఈ కొత్త సైబర్ క్రైమ్ పద్ధతిని విశ్లేషించింది. 2023 అక్టోబర్‌లో టెలిగ్రామ్ ఛానెల్‌లో హ్యాకర్ దీని గురించి పోస్ట్ చేయడంతో ఈ సమస్య మొదట వెలుగులోకి వచ్చింది.
ది ఇండిపెండెంట్‌లోని ఒక నివేదికలో థర్డ్ పార్టీ కుకీలలో ఎర్రర్‌ల కారణంగా హ్యాకర్లు వినియోగదారుల గూగుల్ ఖాతాలకు ఎలా యాక్సెస్‌ను పొందగలరో చెప్పబడింది. వినియోగదారులను ట్రాక్ చేయడానికి వారి అవసరాలకు అనుగుణంగా ప్రకటనలను చూపించడానికి వెబ్‌సైట్‌లు, బ్రౌజర్‌లు థర్డ్ పార్టీ కుకీలను ఉపయోగిస్తాయి. కానీ ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ కుకీలు వినియోగదారులకు ముప్పుగా మారుతున్నాయి.
గూగుల్ ఏం చెప్పింది?
ఇది కాకుండా గూగుల్ కుకీల సహాయంతో యూజర్ల పాస్‌వర్డ్‌లను సేవ్ చేస్తుంది. తద్వారా వారు రెండో సారి లాగిన్ అయినప్పుడు మళ్లీ పాస్‌వర్డ్‌ను ఎంటర్ చేయవలసిన అవసరం లేదు. కానీ హ్యాకర్లు టూ ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను దాటేయడానికి ఒక మార్గాన్ని కనుగొన్నారు.
CloudSEK బ్లాగ్‌పోస్ట్ ప్రకారం హ్యాకర్లు గూగుల్ అకౌంట్ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేసిన తర్వాత కూడా దాన్ని ఉపయోగించగలరు. ఈ నివేదిక సైబర్ ప్రపంచంలో వస్తున్న పెను ముప్పు, గూగుల్ సాంకేతిక బలహీనతల గురించి హెచ్చరిస్తోంది.
అయితే ఇటువంటి సైబర్ ప్రమాదాల నుంచి తమను తాము రక్షించుకోవడానికి నిరంతరం భద్రతా వ్యవస్థను అప్‌గ్రేడ్ చేస్తూనే ఉన్నామని, అలాగే వినియోగదారుల పటిష్ట భద్రత కోసం కొత్త టెక్నాలజీని కూడా ఉపయోగిస్తున్నామని గూగుల్ తన ప్రకటనలో తెలిపింది. క్రోమ్ బ్రౌజర్ కోసం థర్డ్ పార్టీ కుకీలను బ్లాక్ చేస్తున్నట్లు గూగుల్ కూడా ప్రకటించింది. దీని వల్ల రాబోయే కొద్ది రోజుల్లో వినియోగదారులందరికీ ప్రయోజనం చేకూరుస్తుంది.
Also Read: రూ.15 వేలలోపు ది బెస్ట్ 5జీ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ టాప్ మొబైల్స్ లిస్ట్ మీకోసమే!