Vande Bharat Express Launch: అత్యాధునిక సదుపాయాలున్న ఐదు సెమీహైస్పీడ్ వందే భారత్ రైళ్లను ప్రధాని మోదీ ఇవాళ ప్రారంభించారు. పలు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాలను అనుసంధానించేలా అందుబాటులోకి తీసుకువచ్చిన ఈ రైలు సర్వీసులకు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ప్రధాని పచ్చ జెండా ఊపారు. మంగళవారం ఉదయం భోపాల్ లోని రాణి కమలావతి రైల్వే స్టేషన్ కు చేరుకున్న ప్రధాని.. భోపాల్ - జబల్ పుర్, ఖజురహో-భోపాల్- ఇండోర్, హతియా-పాట్నా, ధార్వాడ్-బెంగళూరు, గోవా-ముంబై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు. ఇందులో రెండు రైళ్లకు ప్రత్యక్షంగా, మిగతా మూడు రైళ్లను వర్చువల్ విధానంలో ప్రారంభించారు ప్రధాని. ఈ సందర్భంగా వందే భారత్ రైలులో చిన్నారులతో కలిసి ఆయన కాసేపు ముచ్చటించారు.
ఇవాళ ఉదయం భోపాల్ ఎయిర్ పోర్టు నుంచి రాణి కమలావతి రైల్వే స్టేషన్ కు ప్రధాని మోదీ హెలికాప్టర్ లో రావాల్సి ఉంది. అయితే వాతావరణం అనుకూలించకపోవడంతో రోడ్డు మార్గం ద్వారా ఆయన రాణి కమలావతి స్టేషన్ కు చేరుకున్నారు. అనంతరం రైళ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్, మధ్యప్రదేశ్ గవర్నర్ మంగుభాయ్ పటేల్, రాష్ట్ర సీఎం శివరాజ్ సింగ్ చౌహన్, కేంద్ర మంత్రులు జ్యోతిరాధిత్య సింధియా, నరేంద్ర సింగ్ తోమర్ ఇతర నాయకులు పాల్గొన్నారు. అయితే.. ఒకే రోజు ఒకటి కంటే ఎక్కువ వందే భారత్ రైళ్లను ప్రారంభించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా.. మధ్యప్రదేశ్ లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.
Also Read: Chingari App: చింగారి యాప్‌లో అడల్ట్ కంటెంట్, వరుస విమర్శలపై స్పందించిన కంపెనీ !
షెడ్యూల్ ప్రకారం ప్రధాని.. గిరిజనులు అధికంగా ఉండే షాదోల్ జిల్లా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. కానీ మధ్యప్రదేశ్ లో భారీ వర్షాల హెచ్చరికల దృష్ట్యా పర్యటన నిలిపి వేసినట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించడం, కుండపోత వానల వల్ల కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చే ప్రజలకు అసౌకర్యం కలుగుతుందనే ఉద్దేశంతో పర్యటనను ప్రధాని వాయిదా వేసుకున్నారని, ఎప్పుడు ఉంటుందనేది తర్వాత ప్రకటిస్తామని సీఎం వెల్లడించారు. వాతావరణ పరిస్థితుల కారణంగా భోపాల్ లో రోడ్ షో కూడా రద్దు అయినట్లు పార్టీ నాయకులు తెలిపారు.
యూనిఫాం సివిల్ కోడ్‌పై మాట్లాడిన ప్రధాని
వందేభారత్ రైళ్ల ప్రారంభం తర్వాత ప్రధాని మోదీ 'మేరా బూత్ సబ్సే మజ్‌బూత్' ప్రచారంలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా తొలిసారి యూనిఫాం సివిల్ కోడ్‌పై స్పందించారు. భారత రాజ్యాంగం అందరికీ సమానత్వం, సమాన హక్కులు ఉండాలని చెబుతోందని అలాంటి దేశంలో యూనిఫాం సివిల్ కోడ్(ఏకరూప చట్టం) అవసరమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మధ్యప్రదేశ్ లో పర్యటిస్తున్న మోదీ తొలిసారి బహిరంగంగా యూనిఫాం సివిల్ కోడ్ పై స్పందించారు. ఒకే కుటుంబంలోని వేర్వేరు సభ్యులకు వేర్వేరు నిబంధనలు ఉండటం సరికాదని వ్యాఖ్యానించారు. త్రిపుల్ తలాక్ ఇస్లాం నుంచి విడదీయరానిదే అయితే.. ఈజిప్ట్, ఇండోనేషియా, ఖతార్, జోర్డాన్ వంటి ముస్లిం మెజారిటీ ఉన్న దేశాల్లో ఎందుకు పాటించడం లేదని ప్రశ్నించారు. సిరియా, బంగ్లాదేశ్, పాకిస్థాన్ లో కూడా త్రిపుల్ తలాక్ పాటించడం లేదని తెలిపారు. 90 శాతం సున్నీ ముస్లింలు ఉన్న ఈజిప్టు.. 80- 90 ఏళ్ల క్రితం నుంచే త్రిపుల్ తలాక్ ను రద్దు చేసిందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ గుర్తు చేశారు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial