Chingari App: ముడేళ్ల క్రితం కేంద్ర సర్కారు కొన్ని చైనా యాప్స్ నిషేధించిన విషయం తెలిసిందే. 59 యాప్స్ పై నిషేధం విధించింది. ఇందులో టిక్ టాక్, హలో వంటి కంటెంట్ క్రియేషన్ యాప్స్ కూడా ఉన్నాయి. ఈ అవసరాన్ని ఉపయోగించుకుని మార్కెట్లోకి వచ్చిందే చింగారి యాప్. టిక్ టాక్ నిషేధం తర్వాత చింగారీ యాప్ కు లక్షల్లో డౌన్ లోడ్స్ వచ్చాయి. బెంగళూరుకు చెందిన బిస్వాత్మా, సిద్ధార్థ్ రూపొందించిన ఈ చింగారి యాప్ పై ఇటీవల కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఈ యాప్ క్రమంగా అడల్ట్ ఎంటర్‌ టైన్‌మెంట్ యాప్ గా మారుతోందని, సాఫ్ట్ పోర్న్ ను ప్రోత్సహిస్తోందని ఆరోపణలు వచ్చాయి. ఇటీవల చింగారి యాజమాన్యం తీసుకువచ్చిన వన్-ఆన్-వన్ పెయిడ్ వీడియో కాల్ ఫీచర్ పై ప్రముఖ న్యూస్ పోర్టల్ నివేదికతో ఈ ఆరోపణలు ఎక్కువయ్యాయి. దీంతో చింగారి యాజమాన్యం ఈ విషయంపై తాజాగా స్పందించింది. 


'అసభ్యతకు దారి తీస్తున్న చింగారి యాప్'


కంటెంట్ క్రియేటర్లకు, యూజర్లకు మధ్య వన్-ఆన్-వన్ పెయిడ్ వీడియో కాల్స్ పూర్తిగా ప్రైవేట్ గా ఉంటుండటం వల్ల గ్రాఫిక్ చిత్రాలు, భాష అసభ్యతకు దారి తీసే అవకాశాలు ఉన్నాయని ప్రముఖ స్టార్టప్ న్యూస్ పోర్టల్ Inc42 తన నివేదికలో పేర్కొంది. ఈ కొత్త ఫీచర్ చింగారి యాప్ లో 18+ కంటెంట్ పెరగడానికి దోహదం చేస్తుందని చెప్పుకొచ్చింది. ఈ ఫీచర్ పై సోషల్ మీడియా ద్వారా ప్రకటనలు ఇస్తోందని, భారీ మొత్తంలో చెల్లింపుల హామీలు కురిపిస్తోందని Inc42 నివేదిక పేర్కొంది. 


వీడియా కాల్ ఫీచర్‌ పై చింగారి ఏమంటుందంటే..


ఈ ప్రైవేట్ వీడియో కాల్ చింగారి యాప్ లో ఒక ఫీచర్ మాత్రమేనని, దీని వల్ల కంటెంట్ క్రియేటర్లు, యూజర్లు పరస్పరం మాట్లాడుకునే వీలు ఉంటుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ ప్రైవేట్ కాల్ ఫీచర్ తో యూజర్లు తాము అభిమానించే క్రియేటర్లతో నేరుగా మాట్లాడే వీలు కల్పిస్తుందని చింగారి చెప్పుకొచ్చింది. యూజర్లు వ్యాఖ్యానించడానికి, ప్రశ్నలు అడగడానికి, అలాగే వర్చువల్ గిఫ్ట్స్ పంపడానికి వీలు కల్పిస్తుందని చెప్పింది. ఈ కొత్త ఫీచర్ తో కంటెంట్ క్రియేటర్లు తమ సమయాన్ని మానిటైజ్ చేసే వీలు ఉంటుందని చెప్పుకొచ్చింది. కంటెంట్ క్రియేటర్లతో నేరుగా మాట్లాడే ఫీచర్ ఏ ఇతర ప్రముఖ యాప్స్ అందించడం లేదని, కేవలం తాము మాత్రమే ఆ ఫీచర్ ను ఇస్తున్నట్లు పేర్కొంది. అలాగే తమ యాప్ కు ఏఐ ఆధారిత మోడల్ ఉందని, అది అడల్ట్ కంటెంట్ పై నిఘా ఉంచుతుందని పేర్కొంది. అలాగే అలాంటి కంటెంట్ పై మోడరేటర్‌ల టీమ్ నిత్యం పని చేస్తుందని చెప్పుకొచ్చింది.


'18+ గా చింగారి యాప్ రేటింగ్ మార్పు'


చింగారి ఈ కొత్త ఫీచర్ ను గత ఏప్రిల్ లో తీసుకువచ్చినట్లు Inc42 తన నివేదికలో పేర్కొంది. అలాగే చింగారి యాప్ యాజమాన్యం గూగుల్ ప్లే స్టోర్ లో తమ యాప్ రేటింగ్ ను 18+ కు మార్చుకున్నట్లు తెలిపింది. వీడియో కాల్ ఫీచర్ ఏప్రిల్ లో రాగా.. జూన్ 23, 2023 నాడు రేటింగ్ మార్చినట్లు Inc42 పేర్కొంది.