Apple Watch: గతంలో స్మార్ట్‌ ఫోన్లు పేలినట్టుగానే ఇప్పుడు ఆపిల్‌ వాచ్‌ పేలుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఆపిల్ వాచ్ యూజర్ చెప్పిన వివరాల ప్రకారం, వాచ్‌ బ్యాటరీ విపరీతంగా వేడెక్కింది. ఆ తర్వాత కొద్దిసేపటికే అది పేలిపోయింది. అయితే ఈ దుర్ఘటనలో వాచ్‌ కట్టుకున్న వ్యక్తికి ఎలాంటి హాని జరగలేదు. వాచ్‌ హీటెక్కుతున్నప్పుడే ఆ వాచ్‌ను ఆయన విప్పి పక్కన పెట్టాడు. 


మీడియా అందిన సమాచారం ప్రకారం ఓవర్‌ హీట్‌ కారణంగానే ఆపిల్‌ వాచ్‌ పేలినట్టు వినియోగదారుడు చెబుతున్నారు. గతంలో కూడా స్మార్ట్‌ ఫోన్‌లు పేలిన సంఘటనలు చాలా చూశాం. ఇప్పుడు వాచ్‌ల వంతు వచ్చింది. 


ఆపిల్‌ వాచ్‌ పేలిందన్న విషయాన్ని తెలుసుకున్న ఆపిల్‌ సంస్థ సపోర్ట్‌ టీం రంగంలోకి దిగింది. వినియోగదారునితో మాట్లాడినట్టు కూడా తెలుస్తోంది. పేలిన ఆ వాచ్‌ను ముట్టుకోవద్దని హెచ్చరించింది. అందులో పాదరసం ఉంటుందని దాని వల్ల చాలా ప్రమాదమని హితవు పలికింది.  


వాచ్‌ పేలిన సంగతిని ఎవరికీ చెప్పొద్దని ఆపిల్‌ కంపెనీ సూచించింది. ఓ డాక్యుమెంట్‌ ఇచ్చి సైన్‌ చేయమని కూడా చెప్పింది. విషయాన్ని బహిరంగ పరచకుండా హామీ తీసుకునేందుకే ఆ పత్రంపై సంతకం తీసుకుంటున్నారేమో అన్న అనుమానంతో సంతకం చేసేందుకు వినియోగదారు నిరాకరించాడు. 


కంపెనీ తరఫున ఓ డాక్టర్‌ను కూడా నియమించింది. ఏదైనా సమస్య ఉంటే అతన్ని సంప్రదించాలని వినియోగదారునికి సూచించింది. కానీ వాచ్‌ కట్టుకున్న వ్యక్తి మాత్రం తనకు ఎలాంటి ఇబ్బంది లేదని డాక్టర్‌ అవసరం లేదని చెప్పేశారు. అనంతరం ఆ వాచ్‌ను టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు తీసుకెళ్లారు. కంపెనీ పికప్‌ టీం వచ్చి ఆ వాచ్‌ను తీసుకెళ్లినట్టు తెలుస్తోంది.