ఫేస్‌బుక్ కంపెనీ పేరును ‘మెటా’గా మార్చినట్లు కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ కంపెనీ కనెక్ట్ ఈవెంట్‌లో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ‘ప్రజలను కనెక్ట్ చేసే టెక్నాలజీని రూపొందించే కంపెనీ మాది.’ అని మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. ‘అందరం కలిసి ప్రజలను మన టెక్నాలజీ మధ్యలో ఉంచవచ్చు. అతిపెద్ద క్రియేటర్ ఎకానమీని అన్‌లాక్ చేయవచ్చు’ అని పేర్కొన్నాడు.


ప్రస్తుతానికి తమ కంపెనీ ఒక ఉత్పత్తికి లింక్ అయి ఉందని, అలా కాకుండా తమ కంపెనీని మెటావర్స్ కంపెనీగా అందరూ చూడాలని, అందుకే పేరు మార్చామని మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. @meta అనే ట్వీటర్ ఐడీ, meta.com అనే వెబ్‌సైట్లు కూడా జుకర్‌బర్గ్ దగ్గరే ఉన్నాయి.


@meta అనే యూజర్ ఐడీ అయితే 2010 నవంబర్ నుంచి యాక్టివ్‌గానే ఉంది. దీన్ని బట్టి జుకర్‌బర్గ్‌కు మెటా అని కంపెనీ పేరు మార్చాలనే ఆలోచన ఎప్పటినుంచో ఉందని తెలుస్తోంది. కేవలం సోషల్ మీడియాకు మాత్రమే పరిమితం కాకుండా.. జుకర్‌బర్గ్ ప్లాన్‌కు తగ్గట్లు మెటావర్స్ రూపొందించడంపైకి కంపెనీ ఫోకస్ షిఫ్ట్ చేసింది.


ఈ మార్పుతో కంపెనీ కార్పొరేట్ స్ట్రక్చర్ మారబోయేది లేదని, కానీ కంపెనీ ఆర్థిక ఫలితాలు ఎలా మారతాయో చూడాల్సి ఉందని మార్క్ జుకర్‌బర్గ్ తన బ్లాగ్ పోస్టులో పేర్కొన్నాడు. 2021 నాలుగో త్రైమాసికం నుంచి రెండు ఆపరేటింగ్ సెగ్మెంట్లపై దృష్టి పెట్టనున్నామని.. అవి యాప్స్ ఫ్యామిలీ, రియాలిటీ ల్యాబ్స్ అని అందులో తెలిపాడు. ఎంవీఆర్ఎస్ అనే కొత్త స్టాక్ టికర్ కూడా డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభించే ఆలోచనలో ఉన్నామన్నాడు. అయితే తాము డేటాను ఎలా ఉపయోగిస్తాం, ఎలా షేర్ చేస్తాం అనే అంశాల్లో మాత్రం ఎటువంటి తేడా ఉండదన్నాడు.