ఫేస్ బుక్.. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది వినియోగించే సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ లలో ఒకటి. బ్యాంక్ అకౌంట్ లేని వారు ఉంటారేమో కానీ.. ఫేస్ బుక్ అకౌంట్ లేని వారు లేరంటే.. ఆశ్చర్యం కలగకమానదు.  నచ్చిన విషయాలను పోస్టు చేయడమే కాదు.. ఫోటోలను, వీడియోలను మిత్రులతో పంచుకోవచ్చు. అలాంటి ఫేస్ బుక్ వినియోగదారులకు కొత్త చిక్కు వచ్చిపడింది. సెలబ్రిటీల పోస్టులతో తమ న్యూస్ ఫీడ్ స్పామ్ అవుతున్నట్లు గుర్తించారు. సమస్యపై ఫేస్ బుక్ యాజమాన్యానికి రిపోర్టు చేస్తున్నారు. 


ఫేస్ బుక్ లో కొత్త స్పామ్ రన్ అవుతోంది. యూజర్లు తమ అకౌంట్ల నుంచి స్పామ్ మెసేజ్ లు వస్తున్నట్లు ఆందోళనపడుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ ఫామ్ ట్విట్టర్ వినియోగదారులు ఫేస్ బుక్ హ్యాక్ అయ్యిందంటూ పోస్టులు పెడుతున్నారు. #Facebookhacked అనే హ్యాష్‌ ట్యాగ్‌ తో ఈ సమస్యను ట్రెండ్ చేస్తున్నారు. ఆన్‌లైన్ ట్రాకర్ డౌన్‌డెటెక్టర్ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఫేస్ బుక్ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు అందుకున్నట్లు వెల్లడించింది. 


అమెరికాలో డౌన్‌డెటెక్టర్ దాదాపు 3 వేల మంది వినియోగదారుల నుంచి ఫిర్యాదులను అందుకున్నట్లు తెలిపింది. భారతదేశంలో మధ్యాహ్నం వరకు డౌన్‌డెటెక్టర్‌లో 300 కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఫిర్యాదు చేశారు. వినియోగదారులు ఈ స్పామ్ కు సంబంధించి  రకరకాల కామెంట్స్ చేస్తున్నారు."ఫేస్‌బుక్ ఇప్పుడు నా మెయిన్ మెనూకి డేటింగ్ ట్యాబ్‌ను జోడించింది. ఈ సమస్య నాకు మాత్రమే ఉందా? మరెవరికైనా ఉందా? దీన్నిఎలా వదిలించుకోవాలో తెలియడం లేదు” అని ఓ వినియోగదారుడు వెల్లడించాడు.   


ఫేస్‌బుక్‌లో కొత్త బగ్ కారణంగా రిహన్న, రొనాల్డోతో పాటు సెలబ్రిటీలతో ట్యాగ్ అయిన పోస్టులు కనిపిస్తున్నట్లు వినియోగదారులు చెప్తున్నారు.   చాలా మంది వినియోగదారులు ట్విట్టర్‌లో కూడా సమస్యను వెల్లడించారు.  కొంతమంది వినియోగదారులు తమ ఖాతాలు హ్యాక్ అయ్యాయని ఆందోళన చెందుతున్నారు. కానీ, సమస్య చాలా పెద్దగా కనిపిస్తున్నట్లు నిపుణులు చెప్తున్నారు. ఇది బహుశా అల్గోరిథం దెబ్బతినడం మూలంగానే జరిగి ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.  


ఈ సమస్యకు సంబంధించి ఇప్పటి వరకు ఫేస్‌బుక్ నుంచి ఎలాంటి అప్‌డేట్ రాలేదు. సమస్య చాలా వరకు బగ్‌గా కనిపిస్తున్నప్పటికీ.. అసలేం జరిగిందో తెలియాలంటే ఫేస్ బుక్ వివరణ వచ్చేవరకు వెయిట్ చేయక తప్పదు.


Also Read: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!