WhatsApp: వాట్సాప్‌ను అస్సలు నమ్మలేమని ప్రముఖ బిలీనియర్, ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ అభిప్రాయపడ్డారు. వాట్సాప్‌ ప్రైవసీ విషయంలో ఒక ట్విట్టర్ ఇంజినీర్ చేసిన ఆరోపణపై ఎలాన్ మస్క్ స్పందించారు. ఆండ్రాయిడ్ డ్యాష్ బోర్డుకు సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా ఆ ట్విట్టర్ ఇంజినీర్ షేర్ చేశారు. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ వాట్సాప్‌ను అస్సలు నమ్మలేమన్నారు.


మైక్‌ను ఉపయోగిస్తున్న వాట్సాప్
ఫోడ్ డబిరి అనే పేరున్న ఈ ట్విట్టర్ ఇంజినీర్... తాను నిద్రపోతున్న సమయంలో కూడా వాట్సాప్ తన మైక్రో ఫోన్‌ను ఉపయోగిస్తుందని ఆరోపించారు. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌ను కూడా అందులో షేర్ చేశారు. దీనిపైనే ఎలాన్ మస్క్ స్పందించారు.










స్పందించిన వాట్సాప్
అయితే దీనిపై వాట్సాప్ స్పందించింది. స్క్రీన్ షాట్ తీసిన ఫోన్ గూగుల్ పిక్సెల్ 6ఏ కాబట్టి దీనిపై మరింత విచారణ చేయాల్సిందిగా గూగుల్‌ను వాట్సాప్ కోరింది. కాల్ చేస్తున్నప్పుడు కానీ, వాయిస్ రికార్డ్ చేసేటప్పుడు కానీ, వాయిస్ నోట్ రికార్డ్ చేసేటప్పుడు కానీ మాత్రమే వాట్సాప్ మైక్రోఫోన్‌ను ఉపయోగిస్తుందని కంపెనీ తెలిపింది. దీనికి సంబంధించిన ట్విట్టర్ ఇంజినీర్‌తో కూడా తాము టచ్‌లో ఉన్నామని వాట్సాప్ తెలిపింది. వినియోగదారులు కాల్స్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ మాట్లాడుకునే విషయాలన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా సెక్యూర్డ్‌గా ఉంటాయని తెలిపింది.


వాట్సాప్ తరహా ఫీచర్లను తెస్తాం: మస్క్
వాట్సాప్ తరహా ఫీచర్లను ట్విట్టర్‌లో కూడా తీసుకొస్తామని సీఈవో ఎలాన్ మస్క్ ట్వీట్ ద్వారా పేర్కొన్నాడు. యాప్ లేటెస్ట్ వెర్షన్ ద్వారా ‘ఎన్‌క్రిప్టెడ్ డీఎమ్స్ వీ1.0’ అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు ప్రకటించారు. తన నెత్తిపై గన్ పెట్టి మెసేజ్‌లు చూడమన్నప్పటికీ తాను కూడా చూడలేనని మస్క్ తెలిపారు.


త్వరలో ట్విట్టర్‌లో వాయిస్ ఛాట్, వీడియో ఛాట్ ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచంలో ఏ మూల ఉన్న వారితో అయినా ఫోన్ నంబర్ షేర్ చేయాల్సిన అవసరం లేకుండా మాట్లాడవచ్చని ఎలాన్ మస్క్ అన్నారు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి చాలా మార్పులు జరిగాయి.