నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నాలుగేళ్లు నిద్రపోయి ఇప్పుడు అభివృద్ధి లేదు, పనులు కాలేదంటూ మాట్లాడటం సరికాదన్నారాయన. నియోజకవర్గంలో అన్ని సమస్యలు పరిష్కరించడం ఎవరికీ సాధ్యం కాదని, జగన్ ని 10 అడిగితే ఏడో ఎనిమిదో పనులు జరుగుతాయని, అంత మాత్రాన అసలు ఏ పనీ చేయలేదనడం భావ్యం కాదన్నారు. జగన్ పుణ్యంతో లక్షణంగా ఉన్నామని, ఇంకా ఆయన్ను ఆడిపోసుకోవడం ఎందుకని ప్రశ్నించారు. ఓటమి అనేది తలపై రాసి ఉంది కాబట్టే.. వారు పక్క పార్టీలకు వెళ్తున్నారని, వైసీపీలో ఉంటే గెలిచేవారని.. ఇప్పుడు వారికి రాజకీయ సమాధే మిగిలుందని విమర్శించారు. 


కోటంరెడ్డి వైసీపీకి దూరం జరిగే క్రమంలో అనిల్ తో ఆయనకు మాటల యుద్ధం జరిగింది. అనిల్ మంత్రి అయిన సమయంలో ఎవరూ ఆయనకు సపోర్ట్ చేయలేదని, నెల్లూరులో ఆయనకు స్వాగత సత్కారాలు చేసింది తానే అనే విషయం గుర్తు చేశారు కోటంరెడ్డి. తమ్ముడూ అంటూనే ఆయనకు చురకలంటించారు. అనిల్ కూడా కోటంరెడ్డిపై సెటైర్లు పేల్చారు. ఆ తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. ఒకరి నియోజకవర్గంలో ఇంకొకరు జోక్యం చేసుకోవడంలేదు. ఎవరి పనుల్లో వారు బిజీ అయిపోయారు. మళ్లీ ఇటీవల కాలంలో నెల్లూరు బాహాషహీద్ దర్గాకు నిధులు మంజూరైన తర్వా కోటంరెడ్డి లైమ్ లైట్లోకి వచ్చారు. తన పోరాటం వల్లే దర్గా అభివృద్ధి నిధులు విడుదలయ్యాయంటున్న ఆయన.. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కోసం మరో ఉద్యమం మొదలు పెట్టారు. ఇటీవల నెల్లూరు రూరల్, సిటీలోని క్రిస్టియన్ నాయకులతో కలసి పోస్ట్ కార్డ్, వాట్సప్ మెసేజ్ లతో యుద్ధం మొదలు పెట్టారు. నెల్లూరులో ఫ్లెక్సీలు వేయిస్తూ హడావిడి చేస్తున్నారు. దీనిపై మాజీ మంత్రి అనిల్ కౌంటర్ ఇచ్చారు. నాలుగేళ్లు నిద్రపోయి ఇప్పుడే లేచారంటూ పరోక్షంగా కోటంరెడ్డిపై సెటైర్లు వేశారు. 


తాను కూడా సీఎం జగన్ వద్దకు వెళ్లి 200 సమస్యలను పరిష్కరించాలని అడుగుతానని. అలాగని కేవలం తన సమస్యల పరిష్కారం కోసమే జగన్ పనిచేస్తారా అని ప్రశ్నించారు అనిల్. 175 నియోజకవర్గాల్లో తనకే 2వేల కోట్ల పనులు చేసి పెడితే.. మిగతా వారి సంగతేంటన్నారు. అంత మాత్రాన జగన్ లేఖలిచ్చారు, సంతకాలు పెట్టారంటే ఎలా..? అంటూ పరోక్షంగా కోటంరెడ్డిని ప్రశ్నించారు. క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మాణం విషయంలో జగన్ మూడుసార్లు సంతకాలు పెట్టారని, కానీ పని జరగలేదని కోటంరెడ్డి చేసిన విమర్శకు అనిల్ కౌంటర్ ఇచ్చారు. 


పార్టీలో ఉన్నప్పుడు ఆయన వేరే పనుల్లో బిజీగా ఉన్నారని, ఇప్పుడొచ్చి సడన్ గా జగన్ ని తిడితే ఎలా అని ప్రశ్నించారు అనిల్. జబ్బు వస్తే అపోలోకో, హైదరాబాద్ కో వెళ్తారని, నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రులకు వారు రాకు కదా అన్నారు. జగన్ పుణ్యాన అందరం బాగానే ఉన్నాం కదా ఇంకెందుకిలా అడిపోసుకుంటారని ప్రశ్నించారు. 


దేవుడున్నాడు..
జగన్ ఆయన్ను పూర్తిగా నమ్మినందుకు ఆడిపోసుకుంటున్నారా అని ప్రశ్నించారు అనిల్. పైన దేవుడున్నాడని, లెక్క సరిచూస్తాడని చెప్పారు. ఆరు నెలల్లో మిడిసిపడేవారి చాప్టర్ పూర్తవుతుందని చెప్పారు. వారికి చరిత్ర ఇక రాజకీయ సమాధేనన్నారు. జాతకం చూపించుకోండి అంటూ సెటైర్లు పేల్చారు. వైసీపీలో ఉంటే గెలిచేవారని, కానీ ఓటమి రాత నుదుటిన రాసి ఉంది కాబట్టి, పక్క పార్టీల్లోకి వెళ్తున్నారని చెప్పారు. మంచి పనులు చేస్తున్న జగన్ కి సపోర్ట్ చేయాల్సింది పోయి విమర్శించడం సరికాదన్నారు అనిల్. ప్రతిపక్ష పార్టీలకంటే ఎక్కువగా జగన్ ని విమర్శిస్తున్నారంటూ కోటంరెడ్డిపై పరోక్ష వ్యాఖ్యలు చేశారు.