మీరు స్మార్ట్‌ఫోన్ లేదా మొబైల్ ఫోన్ కొనుగోలు చేస్తే దానిలో ఉండే ఐఎంఈఐ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. ఐఎంఈఐ అంటే ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ (International Mobile Equipment Identity).


కానీ దాని అర్థం ఏమిటో, అది ఎందుకు అంత ముఖ్యమైనదో మీరు తెలుసుకున్నారా? లేకపోతే వెంటనే అర్థం చేసుకోండి. ఐఎంఈఐ అనేది ఒక ప్రత్యేకమైన 15 అంకెల సంఖ్య. ఇది మొబైల్ ఫోన్‌లు, కొన్ని శాటిలైట్ ఫోన్లను గుర్తించడానికి ఉపయోగపడుతుంది.


వ్యక్తిగత డివైస్‌లకు ఐడెంటిఫైయర్‌గా ఐఎంఈఐ నంబర్ పనిచేస్తుంది. ఇది వేర్వేరు ఫోన్లకు వేర్వేరుగా ఉంటుంది. మీ డివైస్‌లు పోయినా లేదా ఎవరైనా దొంగిలించినా వాటిని వెరిఫై చేయడానికి, ట్రాక్ చేయడానికి ఐఎంఈఐ నంబర్‌ను మొబైల్ నెట్‌వర్క్‌లు ఉపయోగిస్తాయి. మొబైల్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌ల భద్రత, సమగ్రతను కాపాడుకోవడంలో ఇది ఒక ముఖ్యమైన సాధనం.


మీ ఫోన్ కీప్యాడ్‌లో *#06# డయల్ చేస్తే మీ మొబైల్ స్క్రీన్‌పై ఐఎంఈఐ నంబర్ కనిపిస్తుంది. చాలా స్మార్ట్‌ఫోన్‌ల్లో మొబైల్ సెట్టింగ్‌లలో ఐఎంఈఐ నంబర్‌ను చూడవచ్చు. సెట్టింగ్స్‌కు వెళ్లి అక్కడ ఫోన్ గురించి కానీ లేదా ఐఎంఈఐ సమాచారం గురించి చూడండి. అలాగే కొన్ని పాత ఫోన్‌లలో ఐఎంఈఐ నంబర్ బ్యాటరీ కంపార్ట్‌మెంట్ లోపల లేదా డివైస్ వెనుక కవర్‌పై ప్రింట్ అయి ఉంటుంది.


ఇంతే కాకుండా మీ ఫోన్ బాక్స్ మీ దగ్గరే ఉన్నట్లయితే ఐఎంఈఐ నంబర్ సాధారణంగా లేబుల్ లేదా బార్‌కోడ్‌పై ప్రింట్ అయి ఉంటుంది. మీ ఐఎంఈఐ నంబర్‌ను సురక్షితంగా ఉంచుకోవడం ముఖ్యం. మీకు తెలియని వారికి అస్సలు షేర్ చేయకూడదు. ఎందుకంటే అది తప్పుడు చేతుల్లోకి పడితే అసాంఘిక కార్యకలాపాలకు ఉపయోగించే అవకాశం ఉంది.


మరోవైపు కంటెంట్ క్రియేటర్లకు చెల్లింపులు జరపడాన్ని ట్విట్టర్ ఇటీవలే ప్రారంభించింది. దీని కోసం యాడ్స్ రెవెన్యూ షేరింగ్ ప్రోగ్రామ్‌ను కూడా కంపెనీ స్టార్ట్ చేసింది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ట్విట్టర్ స్వయంగా ట్వీట్ ద్వారా తెలిపింది.


ట్విట్టర్‌లో నేరుగా డబ్బు సంపాదించడంలో వ్యక్తులకు సహాయపడే ప్రయత్నాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఈ సోషల్ మీడియా దిగ్గజ కంపెనీ తెలిపింది. ఈ కార్యక్రమాన్ని ప్రస్తుతానికి ట్విట్టర్ క్రియేటర్ల ఇనీషియల్ గ్రూపు కోసం ప్రారంభించారు. ఈ నెలాఖరు నుంచి ప్రోగ్రాంను మరింత విస్తారంగా రోల్‌అవుట్ చేయనున్నారు.


ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం అర్హులైన క్రియేటర్‌లందరికీ యాప్‌లో, ఈ-మెయిల్ ద్వారా మొదటి చెల్లింపుగా ఎంత డబ్బు లభిస్తుందో ఇప్పటికే తెలియజేశారు. కొంతమంది ట్విట్టర్ క్రియేటర్స్ ఇప్పటికే దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లను షేర్ చేస్తున్నారు. ఇది కాకుండా వారి ఖాతాలలో నగదు ఎప్పటిలోపు జమ అవుతుందో కూడా ఇందులో తెలిపారు.


మానిటైజేషన్ ద్వారా నగదు పొందాలంటే ట్విట్టర్‌లో మొదటగా బ్లూ సబ్‌స్క్రిప్షన్‌ను కచ్చితంగా పొంది ఉండాలి. గత మూడు నెలల్లో మీ పోస్టులపై ప్రతి నెలా కనీసం ఐదు మిలియన్ల (50 లక్షల) ఇంప్రెషన్లు సాధించాలి. దీంతో పాటు క్రియేటర్ మానిటైజేషన్ స్టాండర్డ్స్ కోసం చేసే హ్యూమన్ రివ్యూలో పాస్ అయి ఉండాలి.


Read Also: వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ సేవలకు అంతరాయం, ఇంతకీ ఏం జరిగింది?


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial