YS Sharmila questions KCR over Crop Loan: తెలంగాణలో రైతు రుణమాఫీపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు. రైతు రుణమాఫీపై దొర గారిది పూటకో మాట, రోజుకో వేషం అని సీఎం కేసీఆర్ పై సెటైర్లు వేశారు. నమ్మి ఓటేస్తే రుణమాఫీ పథకానికే పంగనామాలు పెట్టి, రైతులకు ఎగనామం పెట్టిన మోసగాడు కేసీఆర్ అంటూ మండిపడ్డారు. అన్నం పెట్టే రైతన్నకు ‘డీ ఫాల్టర్’ ముద్ర వేసిన పాపం కేసీఆర్ దే అన్నారు. లక్ష మాఫీకి 4 ఏళ్లుగా లక్ష మాటలు చెప్పిండే తప్ప లక్ష్యం మాత్రం నెరవేర్చలే అని షర్మిల అన్నారు. మాట మీద నిలబడే దమ్ము కేసీఆర్ కు ఉంటే, తక్షణం 31లక్షల మంది రైతులకు లక్ష లోపు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. 


ఆరు నూరైనా సరే మాట ఇస్తే తల నరుక్కుంటం అంటూ రుణమాఫీపై చేసిన వాగ్దానాలు బూడిదలో పోసిన పన్నీరు అయ్యాయన్నారు. 4 ఏళ్లు గడిచినా దొర గడప దాటలే. రైతులకు రుణాలు మాఫీ కాలేదన్నారు. బూటకపు హామీని నమ్మి కేసీఆర్ కు ఓటేసిన పాపానికి అన్నదాతలు బ్యాంకుల దగ్గర దోషిలా నిలబడ్డారని, నోటీసుల మీద నోటీసులు అందుకుంటున్నారని ఆరోపించారు. అన్నం పెట్టే రైతన్నకు "డీ ఫాల్టర్" అనే ముద్ర వేసిన పాపం కేసీఆర్ కే దక్కిందన్నారు. రుణాలు చెల్లించాలని బ్యాంకర్లు రైతుల ఇండ్ల మీద పడుతున్నారని గుర్తుచేశారు.


6 వేల కోట్లకే 60 కష్టాలు.. కాళేశ్వరానికి లక్షకోట్లు ఎక్కడివి?
రైతులు రుణమాఫీ చేయాలని కోరితే, సీఎం కేసీఆర్ 6 వేల కోట్లకే 60 కష్టాలు చెబుతున్నారని.. అయితే కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్షకోట్లు ఎక్కడివి? అని షర్మిల ప్రశ్నించారు. రైతు బంధు పైసలను రుణాల బాకీ వడ్డీల కింద జమ చేసుకుంటున్నా, రైతుల 20 లక్షల అకౌంట్లను ఫ్రీజ్ చేసినా కేసీఆర్ కు కనీసం చీమ కుట్టినట్లైనా లేదని ఆరోపించారు. రైతుల కోసం డబ్బులుండవు కానీ కమిషన్ల కోసం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు లక్ష కోట్ల నిధులు మాత్రం సమకూరుతాయంటూ సీఎం కేసీఆర్ పై షర్మిల సెటైర్లు వేశారు.


రాష్ట్రం కోసం రూ.5 కోట్ల కోట్లు అప్పు తెచ్చినం అంటున్నారు.  అప్పు తెచ్చిన 5 లక్షల కోట్లు ఎక్కడ పోయినయ్ ?. మీ విలాసాలకు, కొత్త భవనాలకు వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ను ప్రశ్నించారు. ప్రభుత్వం 35 వేల ఎకరాలు అమ్మింది, మరి ఆ సొమ్ము ఎక్కడికి పోయింది. కరోనా కష్టకాలంలోనూ బీఆర్ఎస్ పార్టీ అకౌంట్లో 12 వందల కోట్లు ఎలా వచ్చాయని నిలదీశారు. ప్రజల కోసం డబ్బులుండవు గానీ, దేశ రాజకీయాలకు ఫండింగ్ చేసేంత సొమ్ము కేసీఆర్ దగ్గర ఉంటుందని ఎద్దేవా చేశారు. దీన్నే బంగారు తెలంగాణ అంటారని చెప్పారు. ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకోవడమే అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ అంటూ బీఆర్ఎస్ పార్టీ కొత్త నినాదంపై షర్మిల కామెంట్ చేశారు.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial