గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కస్టోడియల్ డెత్ జరిగింది. ఆదివారం (జూలై 16) ఈ ఘటన వెలుగు చూసింది. ముందు రోజు శనివారం రాత్రి ఓ వ్యక్తిని ఓ కేసులో అరెస్టు చేసి జైలులో ఉంచారు. మర్నాటికి అతను చనిపోయి ఉండడం అనుమానాలకు తావిచ్చింది. అయితే, అతను హార్ట్ ఎటాక్ వల్ల చనిపోయాడని పోలీసులు చెబుతున్నారు. జైలులో ఉంచిన వ్యక్తికి సంబంధించి ప్రతి కదలిక తమ వద్ద ఆధారాలతో సహా ఉన్నాయని గచ్చిబౌలి ఎస్సై జేమ్స్ బాబు తెలిపారు.
జైలులో చనిపోయిన వ్యక్తిని 32 ఏళ్ల నితీశ్ కుమార్ గా గుర్తించారు. ఇతను బిహార్ కు చెందిన వ్యక్తి కాగా, హైదరాబాద్ లో సెక్యురిటీ గార్డుగా పని చేస్తున్నాడు. ఓ భవన నిర్మాణ ప్రదేశంలో వీరు పని చేస్తుండగా సహోద్యోగులతో గొడవ కావడంతో వారిపై ఐపీసీ సెక్షన్ 324 ప్రకారం కేసు నమోదు చేశామని తెలిపారు. ఆ కేసులోనే పోలీస్ స్టేషన్ లో ఉంచినట్లుగా చెప్పారు. పని చేసే చోట లిక్కర్ తాగి రావడానికి అనుమతి లేకపోవడంతో, ఈ విషయంలోనే వీరి మధ్య గొడవలు తలెత్తినట్లుగా పోలీసులు తెలిపారు.
పోలీస్ స్టేషన్ లోని జైలు గదిలో ఉంచిన నితీశ్ కు లోపలే హార్ట్ ఎటాక్ రావడం వల్ల కుప్పకూలినట్లుగా భావిస్తున్నారు. వెంటనే పోలీసులు అంబులెన్సును పిలిపించి ఈలోపు సీపీఆర్ కూడా చేశారు. ఆస్పత్రికి తరలించగా, అతని పల్స్ పడిపోవడంతో వెంటనే ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. కానీ, అతను వెంటనే ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పోలీసులు నితీశ్ శవాన్ని గాంధీ హాస్పిటల్‌లో పోస్టు మార్టం కోసం తరలించారు.
ప్రత్యేక అధికారి నియామకం
గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో కస్టోడియల్ డెత్ కేసుపై పోలీసు ఉన్నతాధికారులు ప్రత్యేక అధికారిని నియమించారు. విచారణ అధికారిగా బాలానగర్ ఏసీపీ నియామకం అయ్యారు. మరోవైపు, చనిపోయిన వ్యక్తికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ గైడ్ లైన్స్ ఆధారంగా పోస్టుమార్టం నిర్వహించారు. ప్రొసీజర్ వీడియో మొత్తం రికార్డింగ్ చేశారు. ఆర్డీవో సమక్షంలోనే పోస్టుమార్టం నిర్వహించారు.
విచారణ కోసం పోలీస్ స్టేషన్ కి తీసుకొచ్చిన వ్యక్తి రిసెప్షన్ లో ఉండగానే కుప్పకూలాడని పోలీసు అధికారులు చెబుతున్నారు. మృతదేహాన్ని ఫ్లైట్లో స్వస్థలానికి పంపించినట్లు సమాచారం.