Revanth Reddy: ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, నువ్వు రెడీనా? కేటీఆర్‌కు రేవంత్ సవాల్!

ABP Desam Updated at: 17 Jul 2023 06:47 PM (IST)

గాంధీ భవన్‌లో నేడు (జూలై 17) రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.

కేటీఆర్, రేవంత్ రెడ్డి (ఫైల్ ఫోటోలు)

NEXT PREV

తెలంగాణలో కరెంటు సరఫరా 24 గంటలు ఉండడం లేదని తాను నిరూపిస్తానని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సవాలు చేశారు. ఈ విషయం నిరూపించడానికి మంత్రి కేటీఆర్ ఎక్కడికి రమ్మంటే అక్కడికి తాను వస్తానని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో త్రీ ఫేస్ కరెంటుపై అధికారులు నియంత్రణ పాటిస్తున్నారని, సింగిల్ ఫేజ్ కరెంటు మాత్రమే 24 గంటలు ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. గాంధీ భవన్‌లో నేడు (జూలై 17) రేవంత్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు.


24 గంటల విద్యుత్ పై చర్చ కోసం సిద్దిపేట, సిరిసిల్ల, చింతమడక, గజ్వేల్, మంత్రి జగదీశ్వర్ రెడ్డి సొంత గ్రామం అయినా సరే ఎక్కడికైనా తాను రావడానికి రెడీగా ఉన్నానని అన్నారు. విద్యుత్ కొనుగోలు పేరుతో పదే పదే ప్రజలను దోచుకుంటున్నారని ఆక్షేపించారు. దొంగ లెక్కలు చూపించి రూ.8 నుంచి రూ.9 వేల కోట్లు దోచుకుంటున్నారని ఆరోపించారు. దీని మీద విచారణ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అని నిలదీశారు. రాష్ట్రంలో కేవలం 8 నుంచి 12 గంటల త్రీ ఫేస్ విద్యుత్ సరఫరా అవుతోందని అన్నారు.


వ్యవసాయానికి ఉచిత కరెంటు అంశాన్ని ప్రజల సెంటిమెంట్‌గా మారుస్తూ స్వార్థం కోసం సీఎం కేసీఆర్ వాడుకోవద్దని తానా సభల్లో తాను చెప్పినట్లుగా రేవంత్ రెడ్డి వెల్లడించారు. అక్కడ చేసిన వ్యాఖ్యలను తప్పుడుగా ప్రచారం చేసి అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆక్షేపించారు. ఉచిత కరెంట్ అనేది పేటెంట్ కాంగ్రెస్‌ పార్టీది అయితే, అసలు కాంగ్రెస్ పార్టీనే కరెంటు ఇవ్వలేదన్నట్లుగా మాట్లాడడం కరెక్టు కాదని రేవంత్ రెడ్డి అన్నారు.



24 గంటల విద్యుత్ సరఫరా అంశంపై ప్రభుత్వాన్ని రైతులు ప్రశ్నించాలని రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు. గత తొమ్మిది ఏళ్ల ప్రభుత్వ పాలనపై రైతులు, ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలని అన్నారు. రాష్ట్రంలో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణం పేరు మీద 30 శాతం కమీషన్లు తీసుకున్నారని ఆరోపించారు.


24 గంటలు ఇవ్వట్లేదని సీఎండీనే చెప్పారు - రేవంత్


‘‘గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ను, రేవంత్ ను తిట్టకుండా బీఆరెస్ నేతలకు రోజు గడవడం లేదు. థర్మల్ పవర్ ప్రాజెక్టుల ద్వారా విద్యుత్ సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని కబుర్లు చెప్పారు. 24 గంటల విద్యుత్ సింగిల్ ఫేజ్ అని, త్రీ ఫేస్ 24 గంటలు ఇవ్వడం లేదని సీఎండీ ప్రభాకర్ రావు జనవరి 30న చెప్పారు. ఇవాళ 24గంటల కరెంటుపై జర్నలిస్టులు ప్రశ్నిస్తే ప్రెస్ మీట్ నుంచి వెళ్లిపోయారు. వ్యవసాయానికి అవసరమైనంత మాత్రమే ఇస్తున్నామన్నారు. నేను అమెరికాలో, హైదరాబాద్ లో ప్రశ్నించింది ఇదే.. 24 గంటల కరెంటు ఇవ్వకుండా ఏటా 16 వేల కోట్లతో కరెంటు కొంటున్నారు. ఏటా రూ.8వేల కోట్లు దోచుకుంటున్నారు.


చెట్లకు కట్టేసి నిలదీయండి



రైతులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిస్తున్నా.. రాహుల్ పై కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా కేటీఆర్ ను ఎక్కడికక్కడ అడ్డుకోండి. 24 గంటల విద్యుత్ ఇచ్చే వరకు రైతు వేదికలకు తాళం పెట్టి నిరసన తెలపండి. రుణమాఫీ, పోడు భూముల పట్టాలు 24 గంటల కరెంటు ఇచ్చే వరకు.. బీఆరెస్ ఎమ్మెల్యేలను చెట్లకు కట్టేసి నిలదీయండి. అవగాహన లేకే కేటీఆర్ నాపై పనికిమాలిన విమర్శలు చేస్తున్నారు.-


బీజేపీ, బీఆరెస్ చీకటి మిత్రులు.. వారిద్దరిది ఫెవికాల్ బంధం. కేసీఆర్ నాయకత్వంపై హరీష్ రావుకు విశ్వాసం ఉంటే.. కేసీఆర్ ఈసారి మళ్లీ గజ్వేల్ లో పోటీ చేయాలి. సిట్టింగులందరికీ సీట్లు ఇవ్వాలి. కేసీఆర్ పాలనకు ఇదే రెఫరెండం లాంటిది. మూడోసారి అధికారంలోకి వస్తామన్న కేసీఆర్ కు గజ్వేల్ లో పోటీ చేయడానికి భయం ఎందుకు? సిట్టింగులకు సీట్లు ఇవ్వడానికి ఎందుకు జంకుతున్నారు?’’ అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.

Published at: 17 Jul 2023 06:37 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.