Kedarnath Temple Mobile Ban: కేదార్‌నాథ్ ఆలయం పరిసరాల్లో ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీపై నిషేధం విధించారు. ఈ మేరకు బద్రీనాథ్-కేదార్ నాథ్ ఆలయ కమిటీ ఈ విషయాన్ని ప్రకటించింది. కేదార్‌నాథ్ ఆలయ పరిసరాల్లో బోర్డులు కూడా ఏర్పాటు చేశారు. ఒకవేళ ఎవరైనా ఫోటోలు తీసినా, వీడియోలు రికార్డ్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డుల్లో పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లతో ఆలయ పరిసరాల్లోకి ఎవరూ ప్రవేశించరాదు అని, సీసీటీవీ కెమెరాల నిఘా ఎప్పుడూ ఉంటుందని ఆలయ కమిటీ పేర్కొంది. కేదార్‌నాథ్ ఆలయానికి వచ్చే భక్తులు సంప్రదాయ దుస్తులు మాత్రమే ధరించాలని ఆలయ కమిటీ చెప్పుకొచ్చింది. ఇటీవల ఆలయ పరిసరాల్లో జరిగిన కొన్ని సంఘటనలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్న విషయం తెలిసిందే. వాటిపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో ఆలయ కమిటీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. అందుకే కొత్త మార్గదర్శకాలు జారీ చేసినట్లు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజయ్ అజేంద్ర తెలిపారు. కేదార్‌నాథ్ ఆలయాన్ని హిందువులు అత్యంత పవిత్రమైన క్షేత్రంగా పరిగణిస్తారు. అలాంటి చోట కొన్ని రోజుల క్రితం ఓ అమ్మాయి అబ్బాయి ప్రవర్తించిన తీరు వివాదాస్పదమైంది. వారి తీరుపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
లవ్ ప్రపోజల్..
ఎంతో పవిత్రంగా భావించే ఈ ఆలయ ప్రాంగణంలో ఓ అమ్మాయి తన బాయ్‌ఫ్రెండ్‌కి ప్రపోజ్ చేసిన వీడియో వైరల్ అయింది. బాయ్ ఫ్రెండ్ ని సర్‌ప్రైజ్ చేయడం తప్పేం కాదు. కానీ.. దానికంటూ ఓ ప్లేస్, టైమ్ ఉంటుందని నెటిజన్లు మండి పడ్డారు. అయితే.. కొందరు ఇది పాత వీడియో అని.. కొందరు కావాలనే రీషేర్ చేస్తున్నారని కామెంట్లు చేశారు. బాయ్ ఫ్రెండ్ పక్కనే నిలబడ్డ అమ్మాయి.. సైలెంట్ గా తన చేతుల్లోకి రింగ్‌ని తీసుకుంది. మోకాళ్లపై నిలుచుని ప్రపోజ్ చేసింది. ఆ తరవాత రింగ్ తొడిగింది. ఆ తరవాత ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఓ వ్లాగర్ ఈ వీడియో షూట్ చేసినట్టు తెలుస్తోంది. అయితే.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఎంత క్యూట్‌గా ప్రపోజ్ చేసిందో అని కొందరు కామెంట్ చేస్తుంటే.. చాలా మంది మాత్రం ఆధ్యాత్మిక క్షేత్రాల్లో ఏంటీ పిచ్చి పనులు అని తిట్టి పోశారు.
అంతకుముందు గాల్లోకి నోట్లు విసిరేసి మహిళ
ఈ వీడియో వైరల్ అవడం వల్ల బద్రినాథ్ కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ప్రెసిడెంట్ అజేంద్ర అజయ్ స్పందించారు. పుణ్యక్షేత్రాల్లో కొన్ని నిబంధనలు ఉంటాయని, అందుకు తగ్గట్టుగానే ప్రవర్తించాలని హెచ్చరించారు. అందరి విశ్వాసాలను గౌరవించి మర్యాదగా నడుచుకుంటే మంచిదని తేల్చిచెప్పారు. ఆలయం లోపల ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడమే తమ బాధ్యత అని, ఈ ఘటన ఆలయం బయట జరిగిందని వివరించారు. ఏదేమైనా దీనిపై లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని వెల్లడించారు. అంతకు ముందు ఓ మహిళ కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరిన వీడియో వైరల్ అయింది. ఫలితంగా... అక్కడ నిఘా లేకుండా పోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.