ప్రముఖ ఓటీటీ యాప్ నెట్‌ఫ్లిక్స్ ఇటీవల భారతదేశంలో పాస్‌వర్డ్ షేరింగ్‌కు పరిమితులు విధించింది. ఇప్పుడు డిస్నీప్లస్ హాట్‌స్టార్ కూడా నెట్‌ఫ్లిక్స్ దారిలోనే వెళ్తుందని వార్తలు వస్తున్నాయి. త్వరలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితిని విధించే అవకాశం ఉంది. కంపెనీ తన ప్రీమియం ప్లాన్‌ను కేవలం నలుగురికి మాత్రమే పరిమితం చేయనుందని తెలుస్తోంది. ప్రస్తుతం 10 మంది వ్యక్తులు వేర్వేరు డివైస్‌ల్లో ఒకే ఖాతాకు లాగిన్ చేయవచ్చు. కానీ పరిమితి విధించిన తర్వాత ప్రీమియం అకౌంట్‌ను కూడా కేవలం నాలుగు డివైస్‌ల్లో మాత్రమే ఓపెన్ చేయగలరు.


రాయిటర్స్ నివేదికల ప్రకారం డిస్నీ‌ప్లస్ హాట్‌స్టార్ కూడా నెట్‌ఫ్లిక్స్ రూట్‌లో వెళ్లనుందని తెలుస్తోంది. మే నెలలో నెట్‌ఫ్లిక్స్ 100 కంటే ఎక్కువ దేశాలలో పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులను విధించింది. తాజాగా భారత్‌లోనూ పాస్‌వర్డ్ షేరింగ్‌పై కంపెనీ లిమిటేషన్ విధించింది.


ఇప్పుడు ప్రజలు వారి ఇంటి బయట నెట్‌ఫ్లిక్స్‌ని ఉపయోగించడానికి సభ్యత్వాన్ని కొనుగోలు చేయాలి. అదేవిధంగా అకౌంట్ షేరింగ్‌ను పరిమితం చేయడం ద్వారా డిస్నీ కూడా మెంబర్‌షిప్‌లను కొనుగోలు చేసేలా ప్రజలను ప్రోత్సహించనుంది. ఈ ఏడాది చివరి నాటికి ఖాతా షేరింగ్‌పై కంపెనీ పరిమితి విధించవచ్చు.


డిస్నీప్లస్ హాట్‌స్టార్ భారతదేశంలో అత్యధిక సంఖ్యలో సబ్‌స్క్రైబర్‌లను కలిగి ఉంది. ఈ యాప్‌కు భారతదేశంలో 49 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. కంపెనీ వెబ్, మొబైల్ రెండింటిలోనూ తన సేవలను అందిస్తుంది. మొబైల్ కోసం కంపెనీ ప్లాన్ రూ.149తో ప్రారంభం కానుంది. ఇందులో సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల పాటు అందుబాటులో ఉంటుంది.


రూ. 499కి ఒక సంవత్సరం పాటు సబ్‌స్క్రిప్షన్ లభించనుంది. అదేవిధంగా ప్రీమియం ప్లాన్ రూ.899, రూ.1,499గా ఉంది. రీసెర్చ్ సంస్థ మీడియా పార్ట్‌నర్స్ ఆసియా నుంచి వచ్చిన డేటా ప్రకారం డిస్నీ హాట్‌స్టార్ జనవరి 2022 నుంచి మార్చి 2023 మధ్య భారతదేశ స్ట్రీమింగ్ మార్కెట్‌లో 38 శాతం మంది వ్యూయర్స్‌తో అగ్రస్థానానికి చేరుకుంది. ప్రత్యర్థులు నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో ఒక్కొక్కటి ఐదు శాతం వాటాను కలిగి ఉన్నాయి.


భారతదేశంలో డిస్నీ తర్వాత రెండో ప్రసిద్ధ యాప్ అమెజాన్ ప్రైమ్. ఈ యాప్‌కు భారతదేశంలో 21 మిలియన్ల మంది సభ్యులు ఉన్నారు. దీని తర్వాత జియో సినిమా మూడో స్థానంలో నిలిచింది. జియో సినిమాకు 1.2 కోట్ల మంది సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.


మరోవైపు జియో తను గతంలో లాంచ్ చేసిన ల్యాప్‌టాప్‌కు అప్‌గ్రేడెడ్ వెర్షన్ తీసుకురావడానికి రెడీ అవుతోంది. ఆండ్రాయిడ్‌తో పని చేయనున్న ఈ సెకండ్ జనరేషన్ ల్యాప్‌టాప్ త్వరలో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన అమెజాన్ మైక్రోసైట్ కూడా లైవ్ అయింది. ఈ సైట్‌లో ఈ ల్యాప్‌టాప్ బ్లూ కలర్‌లో కనిపించింది.


దీనికి జియోబుక్ (2023) అని పేరు పెట్టనున్నారు. డిజైన్ పరంగా చాలా మార్పులు చేసినట్లు దీన్ని చూసి చెప్పవచ్చు. ఎన్నో ఇంటర్నల్ అప్‌గ్రేడ్స్ కూడా చేయనున్నారు. జియో భారత్ 4జీ ఫీచర్ ఫోన్‌ను కూడా కంపెనీ ఇటీవలే లాంచ్ చేసింది. దీని ధరను రూ.999గా నిర్ణయించారు. త్వరలో జియో 5జీ ఫోన్ కూడా లాంచ్ చేయనున్నట్లు సమాచారం.


Read Also: మీ ఫోన్ ఛార్జింగ్ త్వరగా అయిపోతుందా? అయితే, ఈ టిప్స్ పాటించండి!


ముఖ్యమైనమరిన్ని ఆసక్తికర కథనాల కోసం టెలిగ్రామ్లో ఏబీపీ దేశంలో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial