ChatGPT: ఛాట్‌జీపీటీలో కొత్త 'ఇమేజ్ జనరేషన్ ఫీచర్' - రెస్పాన్స్ అద్భుతం
Image Generation Feature In ChatGPT: ఛాట్‌జీపీటీలో ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌ను తీసుకొస్తూ OpenAI కొత్త అప్‌గ్రేడ్‌ను విడుదల చేసింది. యూజర్లు దీనిని ఇష్టపడుతున్నారు, విభిన్న చిత్రాలు సృష్టిస్తున్నారు.

Image Generation Feature Launched In ChatGPT: ఓపెన్‌ఏఐ (OpenAI) కంపెనీ, తన కృత్రిమ మేథ చాట్‌బాట్ (AI Chatbot) ChatGPTని అప్‌డేట్ చేసింది. అధునాతన "ఇమేజ్ జనరేషన్" సామర్థ్యాలను అందించే GPT-4oని ఛాట్‌జీపీకి అనుసంధానించింది. ChatGPT, ప్రస్తుతం, DALL-E మోడల్ సాయంతో చిత్రాలు సృష్టిస్తోంది. ఇకపై, అప్‌డేటెడ్ వెర్షన్‌తో & GPT-4o సాయంతో చిత్రాలు సృష్టిస్తుంది. ఈ ఫీచర్‌ను “Images in ChatGPT” అని పిలుస్తున్నారు. యూజర్ల నుంచి దీనికి మంచి రెస్పాన్స్ వస్తోంది.
న్యూ మోడల్‌ను ఎందుకు తీసుకొచ్చింది?
చిత్రాల రూపకల్పన (Image Generation)ను మెరుగుపరచడానికి కంపెనీ DALL-E 3ని GPT-4oతో రీప్లేస్ చేసింది. మరింత మెరుగ్గా & నిజమైన ఫొటోలు అనిపించేలా చిత్రాలను రూపొందించడానికి GPT-4oను లాంచ్ చేసినట్లు ఓపెన్‌ఏఐ తెలిపింది. ఇది, చిత్రాల రూపకల్పనకు DALL-E 3 కంటే కాస్త కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటుందని & ఖచ్చితమైన, వివరణాత్మక చిత్రాలను సృష్టించగల సామర్థ్యాన్ని కలిగి ఉందని వెల్లడించింది.
నూతన అప్‌డేట్‌తో ChatGPT కొత్త చిత్రాలను సృష్టించడమే కాకుండా, పాత చిత్రాలను సవరించగలదు & మార్చగలదు. ఇది, ఫొటోల ముందు భాగం (foreground), నేపథ్యం (background)ను సవరించగలదు. ఓపెన్‌ఏఐ కంపెనీ, ఈ మోడల్‌కు షట్టర్‌స్టాక్ వంటి కంపెనీలతో భాగస్వామ్యంతో, ప్రజలకు అందుబాటులో ఉన్న డేటాతో శిక్షణ ఇచ్చింది.
ఎవరికి అందుబాటులో ఉంది?
ఇమేజ్ జనరేషన్ ఫీచర్ తీసుకొచ్చామని OpenAI CEO శామ్‌ఆల్ట్‌మన్ (Sam Altman) ‘ఎక్స్’లో ప్రకటించారు. ఈ ఫీచర్‌ను త్వరలో చాట్‌జీపీటీ ప్లస్ (ChatGPT Plus), చాట్‌జీపీటీ ప్రో (ChatGPT Pro), చాట్‌జీపీటీ టీమ్ (ChatGPT Team)తో పాటు సాధారణ వినియోగదార్లకు కూడా "ఉచితం"గా అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. డెవలపర్లు API ద్వారా ఈ సేవలు వినియోగించుకోవచ్చని కంపెనీ పేర్కొంది. ఇమేజ్ జనరేషన్ ఫీచర్ కోసం ఫ్రీ యూజర్లు కాస్త ఎక్కువ కాలం ఎదురుచూడాల్సి రావచ్చు.
ఇమేజ్ జనరేషన్ ఫీచర్‌తో సృష్టించిన & సవరించబడిన ఫోటోలను కొందరు యూజర్లు Xలో పంచుకున్నారు.
రెస్పాన్స్ అద్భుతం
తాము ఊహించినదాని కంటే ఎక్కువగా యూజర్లు ఈ అప్‌డేటెడ్ మోడల్‌ను ఇష్టపడుతున్నారని OpenAI ప్రకటించింది. ఉచిత వినియోగదారుల కోసం దీనిని అందుబాటులోకి తీసుకురావడానికి కొంత సమయం పట్టవచ్చని కూడా చెప్పారు. అయితే, ఎప్పటిలోగా అందరికీ అందుబాటులోకి తెస్తారన్న విషయాన్ని వెల్లడించలేదు. దీనిలో ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయని, ఆ సవాళ్లను త్వరగా పరిష్కరిస్తామని తెలిపారు.