యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో (2021) 14, 16 అంగుళాల వేరియంట్ల సేల్ మనదేశంలో ఆలస్యం కానుంది. నిజానికి వీటి సేల్ అక్టోబర్ 26వ తేదీనే జరగాల్సి ఉండగా.. ఇప్పుడు అక్టోబర్ 29వ తేదీ నుంచి జరగనుంది. కొత్త మాక్‌బుక్ ప్రో మోడళ్లతో పాటు యాపిల్ ఎయిర్ పోడ్స్ సేల్ కూడా అక్టోబర్ 29వ తేదీకి వాయిదా పడింది. గతవారం జరిగిన అన్‌లీష్డ్ వర్చువల్ ఈవెంట్‌లో ఈ కార్యక్రమం జరిగింది.
యాపిల్ ఇండియా వెబ్‌సైట్ బ్యానర్‌లో 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో(2021), 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో(2021)ల సేల్ అక్టోబర్ 29వ తేదీన జరగనుందని తెలిపారు. దీంతోపాటు మనదేశంలో యాపిల్ అధికారిక డిస్ట్రిబ్యూటర్లు అయిన ఇన్‌గ్రాం మైక్రో ,రెడింగ్టన్ ఇండియాల అధికారిక వెబ్ సైట్లో ‘కమింగ్ సూన్’ అనే బ్యానరే ఇంకా కనిపిస్తుంది.
వీటికి సంబంధించిన సేల్ అమెరికాలో ఇప్పటికే ప్రారంభం అయిపోయాయి. కానీ మనదేశంలో ఎందుకు ఆలస్యం అయిందో మాత్రం తెలియరాలేదు.
యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో (2021) ధర
14 అంగుళాల యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో(2021) ధర మనదేశంలో రూ.1,94,900గా ఉంది. విద్యార్థులు దీన్ని రూ.1,75,410కే కొనుగోలు చేయవచ్చు. 16 అంగుళాల యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో(2021) ధర మనదేశంలో రూ.2,39,900గా నిర్ణయించారు. విద్యార్థులకు ఈ మ్యాక్‌బుక్ రూ.2,15,910కే ఇది లభించనుంది.
యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో(2021) స్పెసిఫికేషన్లు
ఇందులో 14 అంగుళాలు, 16 అంగుళాల మోడళ్లు లాంచ్ అయ్యాయి. 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రోలో 14.2 అంగుళాల యాక్టివ్ ఏరియా, 59 లక్షల పిక్సెల్ ఉండనున్నాయి. 16 అంగుళాల వేరియంట్‌లో 16.2 అంగుళాల టచ్ ఏరియా, 7.7 అంగుళాల పిక్సెల్స్ అందించారు.
వీటి డిజైన్‌లో కూడా కొన్ని మార్పులు చేశారు. టచ్ బార్‌ను తీసేసి, ఎస్‌డీఎక్స్‌సీ కార్డు స్లాట్, హెచ్‌డీఎంఐ పోర్టును అందించారు. 1080పీ ఫేస్‌టైం వెబ్‌క్యామ్‌ను కూడా ఇందులో అందించారు. అయితే ఇందులో ఫేస్ ఐడీ టెక్నాలజీ లేదు. డిజైన్ లెవల్ మార్పులతో పాటు డిస్‌ప్లే అప్‌గ్రేడెడ్ టెక్నాలజీని కూడా ఇందులో అందించారు. ఎం1 ప్రో చిప్‌లో 10 కోర్ల సీపీయూని అందించారు. ప్రో నోట్‌బుక్‌కు అందుబాటులో ఉన్న ప్రాసెసర్లలో ప్రపంచంలో బెస్ట్ ప్రాసెసర్ ఎం1 మ్యాక్స్ అని యాపిల్ అంటోంది. ఇందులో కూడా 10 కోర్ల సీపీయూని అందించారు. జీపీయూలో మాత్రం 32 కోర్లు ఉండనున్నాయి.
ఇందులో లిక్విడ్ రెటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను అందించారు. మినీ ఎల్ఈడీ టెక్నాలజీని ఇవి ఉపయోగించుకోనున్నాయి. 120 హెర్ట్జ్ అడాప్టివ్ రిఫ్రెష్ రేట్ ఫీచర్‌ను కూడా ఇందులో అందించారు. ఇందులో పీ3 వైడ్ కలర్ గాముట్, హెచ్‌డీఆర్ సపోర్ట్, ఎక్స్‌డీఆర్ అవుట్‌పుట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ మోడళ్లలో మ్యాజిక్ కీబోర్డును అందించారు. ఫోర్స్ టచ్ ట్రాక్ ప్యాడ్ కూడా ఇందులో ఉంది. మ్యాక్ఓఎస్ మాంటేరే ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు.
ఈ ల్యాప్‌టాప్‌ల్లో ఆరు స్పీకర్ల సౌండ్ సిస్టం ఉంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో అందించారు. ఇక బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే.. 14 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో(2021) 17 గంటల వీడియో ప్లేబ్యాక్, 16 అంగుళాల మ్యాక్‌బుక్ ప్రో(2021) 21 గంటల వీడియో ప్లేబ్యాక్‌ను అందించనున్నాయి.
బ్లూటూత్ వీ5.0, వైఫై 6 కూడా ఇందులో ఉన్నాయి. ఇందులో మాగ్ సేఫ్ చార్జింగ్ పోర్టును అందించారు. ఎం1 మ్యాక్స్ ప్రాసెసర్ ఉన్న మ్యాక్‌బుక్ ప్రోను మూడు వరకు ప్రో డిస్‌ప్లే ఎక్స్‌డీఆర్, 4కే టీవీకి ఒకేసారి కనెక్ట్ చేసుకోవచ్చు. ఎం1 ప్రో చిప్ ఉన్న మ్యాక్‌బుక్ ప్రోని రెండు ప్రో డిస్‌ప్లే ఎక్స్‌డీఆర్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు.
Also Read: Hardik Pandya Health: హార్దిక్ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసింది.. న్యూజిలాండ్ మ్యాచ్ ఆడగలడా? లేదా?
Also Read: IPL New Teams: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఇవే.. చేజిక్కించుకున్న కంపెనీలు ఏవంటే?
Also Read: Ind Vs Pak: పాక్ పైచేయి సాధించింది అక్కడే.. కాస్త జాగ్రత్త పడి ఉంటే?