Upcoming iPhone: దిగ్గజ టెక్ కంపెనీ యాపిల్ (Apple) కొత్త తరం ఐఫోన్ ఎస్ఈని మార్చి 8వ తేదీన లాంచ్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదే రోజు కొత్త ఐప్యాడ్ ఎయిర్ కూడా లాంచ్ కానుందని సమాచారం. జీఎస్ఎం ఎరీనా కథనం ప్రకారం... యాపిల్ ఈ ఈవెంట్‌ను అధికారికంగా ప్రకటించలేదు. కానీ ప్రముఖ యాపిల్ అనలిస్ట్ జాన్ డొనోవన్ దీని ధరను కూడా లీక్ చేశారు.


ధర రూ.23 వేలలోపే?


ఈయన తెలుపుతున్న దాని ప్రకారం కొత్త ఐఫోన్ ఎస్ఈ ధర 300 డాలర్ల (సుమారు రూ.22,700) రేంజ్‌లో ఉండనుంది. దీని ముందు వెర్షన్ ఐఫోన్ ఎస్ఈ (2020) ధర కంటే ఇది 99 డాలర్లు (సుమారు రూ.7,500) తక్కువ కావడం విశేషం.


మరో యాపిల్ అనలిస్ట్ డేనియల్ ఐవ్స్ కూడా ఇదే విషయాన్ని తెలిపారు. కొత్త ఐఫోన్ ఎస్ఈకి... ఐఫోన్ ఎస్ఈ+ 5జీ అని పేరు పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇందులో 5జీ సపోర్ట్ ఉండనుంది. దీంతోపాటు మెరుగైన కెమెరా, యాపిల్ ఏ15 బయోనిక్ చిప్ కూడా ఇందులో ఉండనున్నాయి.


ఐఫోన్ ఎస్ఈ (2020) కంటే ఎన్నో మార్పులు ఇందులో చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే డిజైన్ మాత్రం 2017లో లాంచ్ అయిన ఐఫోన్ 8 తరహాలోనే ఉండే అవకాశం ఉంది. గతంలో వచ్చిన కథనాల ప్రకారం... ఐఫోన్ 8 తరహా డిజైన్‌లో ఉంటూనే కొంచెం మోడర్న్‌గా ఈ ఫొన్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.


అయితే 2024లో రానున్న ఐఫోన్ ఎస్ఈలో మాత్రం కొత్త తరహా డిజైన్‌ను అందించనున్నట్లు తెలుస్తోంది. దీని డిజైన్ ఐఫోన్ ఎక్స్ఆర్, ఐఫోన్ 11ల తరహాలో ఉండనుందని వార్తలు వస్తున్నాయి. అయితే స్క్రీన్ సైజు మాత్రం చిన్నగానే ఉండనుంది. ఇందులో కూడా ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కంపెనీ అందించబోవడం లేదు. పవర్ బటన్‌లో టచ్ ఐడీ సెన్సార్ ఉండే అవకాశం ఉంది.


Also Read: శాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ ప్రీ-ఆర్డర్లు ప్రారంభం, కేవలం రూ.1,999కే!


Also Read: రూ.13 వేలలోనే రియల్‌మీ కొత్త ఫోన్, 50 మెగాపిక్సెల్ కెమెరా వంటి ఫీచర్లు!