Apple Devices : మీరు ఐఫోన్, ఐపాడ్, మ్యాక్‌లు లాంటి ఆపిల్ ఉత్పత్తులు వాడుతున్నారా.. అయితే మీకోసమే ఈ అప్డేట్. ఈ పరికరాల్లో అనేక భద్రతా లోపాలను గుర్తించిన ఐటీ మంత్రిత్వశాఖ అనుబంధ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం(CERT-In).. యూజర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మీ సమగ్ర సమాచారాన్ని దొంగిలించే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఈ సందర్బంగా అధిక ముప్పు తెచ్చిపెట్టే అంశాలపై అడ్వైజరీ చేసింది. కొందరు కేటుగాళ్లు మీ అనుమతి లేకుండా పాస్‌వర్డ్‌ దొంగతనం, డేటాను మార్పు చేసి, మీ ఫోన్ హ్యాక్ చేసి, పూర్తిగా వారి నియంత్రణలోకి తెచ్చుకునే ముప్పు ఉందని తెలిపింది. ఈ భద్రతా లోపాలు ముఖ్యంగా నల్ పాయింటర్ డెరీఫరెన్స్, టైప్ కన్ఫ్యూజన్, యూజ్-ఆఫ్టర్-ఫ్రీ పొరపాట్లు, అవుట్-ఆఫ్-బౌండ్స్ యాక్సెస్, తప్పు ఫైల్ హ్యాండ్లింగ్, పార్సింగ్ వంటి సమస్యల నుండి ఉత్పన్నమవుతున్నట్టు వెల్లడించింది. 


ఏ ఆపిల్ ఉత్పత్తులు ప్రభావితమవుతాయంటే..


ఈ భద్రతా లోపాలు ముఖ్యంగా macOS, iOS, iPadOS, tvOS, visionOS, Safari వంటి ప్రసిద్ధ ఆపిల్ ప్లాట్‌ఫామ్‌లలో కనిపించనున్నాయి. ప్రమాదంలో ఉన్న పరికరాల్లో ఐఫోన్స్, ఐప్యాడ్స్, మ్యాక్స్, ఆపిల్ గడియారాలు, ఆపిల్ టీవీలు, విజన్ ప్రో హెడ్‌సెట్ ఉన్నాయి. ఈ సందర్భంగా సెర్ట్ - ఇన్ ప్రభావిత సాఫ్ట్‌వేర్ వెర్షన్‌ల జాబితాను అందించింది:



  • మ్యాక్ ఓఎస్ సుక్వోయా : 15.3 కంటే ముందు వెర్షన్లు

  • మ్యాక్ ఓఎస్ సుక్వోయా: 14.7.3 కంటే పాత వెర్షన్లు

  • మ్యాక్ ఓఎస్: 13.7.3 కి ముందు వెర్షన్లు

  • ఐవోఎస్, ఐప్యాడ్ ఓఎస్ : 17.7.4, 18.3 కి ముందు వెర్షన్లు

  • టీవీ ఓఎస్ : 18.3 కంటే పాతది

  • విజన్ ఓఎస్ : 2.3 వెర్షన్ కి ముందు

  • సఫారీ : 18.3 కంటే తక్కువ వెర్షన్లు

  • వాచ్ ఓఎస్: 11.3 కి ముందు వెర్షన్లు


భద్రతా లోపాలు తలెత్తకుండా ఏం చేయాలంటే..


తమ పరికరాలను కాపాడుకోవడానికి, ఆపిల్ యూజర్లు తక్షణమే కొన్ని నివారణ చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు:



  • సాఫ్ట్‌వేర్‌ అప్డేట్ చేయాలి: మ్యాక్ ఓఎస్, ఐవోఎస్, ఐప్యాడ్ ఓఎస్, టీవీ ఓఎస్, విజన్ ఓఎస్, సఫారీ, వాచ్ ఓఎస్ లలో అప్డేట్స్ తో సహా అన్ని ఆపిల్ పరికరాల కోసం తాజా సెక్యూరిటీ ప్యాచ్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

  • అప్రమత్తంగా ఉండండి: తెలియని లేదా అనుమానాస్పద సోర్సెస్ నుంచి అప్లికేషన్‌లను డౌన్‌లోడ్ చేయడం లేదా ఇన్‌స్టాల్ చేయడం మానుకోండి. ఎందుకంటే అవి ఈ భద్రతా లోపాలకు కారణం కావచ్చు.

  • ఆటోమేటిక్ అప్‌డేట్‌లను ప్రారంభించండి: భవిష్యత్తులో ప్యాచ్‌లలో జాప్యాలను నివారించడానికి పరికరాలు స్వయంచాలకంగా సెక్యూరిటీ అప్డేట్ ను స్వీకరించడానికి సెట్ చేసి ఉంచండి.

  • డివైజ్ యాక్టివిటీని గమనించండి: ఊహించని యాప్ క్రాష్‌లు, పనితీరులో నెమ్మది లేదా అనధికార యాక్సెస్ వంటి విషయాల్లో జాగ్రత్త వహించండి.


ఇటీవలి కాలంలో ఆపిల్ ఫోన్లు, ఇతర డివైజ్‌ లలో భద్రతపై సెర్ట్-ఇన్ తరుచుగా హెచ్చరికలు జారీ చేస్తోంది. గతేడాది ఏప్రిల్ నెలలోనూ ఈ తరహా హెచ్చరికలే జారీ చేసింది. పైన చెప్పిన విషయాలను దృష్టిలో ఉంచుకని, జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. అప్డేట్ లో జాప్యం లేదా ఫెయిల్యూర్ వంటివి ఎదురైనపుడు డేటా చోరీకి గురైనట్టు అనుమానించాలని చెప్పింది. సైబర్ భద్రతా ముప్పుల నుండి వినియోగదారులను, సంస్థలను రక్షించడానికి సెర్ట్ - ఇన్ చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా తాజాగా ఈ అడ్వైజరీ జారీ చేసింది. ఆపిల్ యూజర్లు తమ వ్యక్తిగత సమాచారం, డిజిటల్ ఆస్తులను సురక్షితంగా ఉంచడానికి అప్డేట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉత్తమ పద్ధతులను అనుసరించాలని గట్టిగా సలహా ఇచ్చింది.


Also Read : Cheapest Prepaid Plans Without Data: డేటా లేకుండా కేవలం కాల్స్, మెసేజ్‌ల కోసం Airtel, Jio, Vi, BSNL అందించే ప్లాన్‌లలో ఏది బెటర్?