మన చిన్నతనంలో గ్రౌండ్‌లో గెంతులేస్తూ ఆటలాడిన రోజులు భలేగా ఉండేవి. పంటపొలాలను చదును చేసుకుని మరీ ఆటలు ఆడిన క్షణాలను తలుచుకుంటేనే భలే అనిపిస్తోంది. కానీ ఇప్పుడా పరిస్థితి ఉందా.? అంటే సమాధానం దొరకడం కష్టమే. మానసిక, శారీరక ఉల్లాసం కలిగించే ఆరోగ్యకరమైన ఆ ఆటలూ కనిపించవు. సందు దొరికితే చాలు.. స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్‌లు, పిల్లల చేతుల్లోకి వచ్చేస్తున్నాయి. సోఫాకు అతుక్కుపోయి… గంటల తరబడి వీడియో గేమ్స్‌తో టైంపాస్ చేస్తున్నారు.


మొబైల్ వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో.. అన్ని అవరోధాలు కూడా ఉన్నాయి. ఉన్నచోటనే అన్ని మన వద్దకు ఈజీగా వస్తూన్నాయేమో కానీ.. రోగాలు కూడా అంతే ఈజీగా వస్తున్నాయి. స్మార్ట్ ఫోన్‌లో ఎక్కువ సమయం గడపటం వల్ల ప్రవర్తన సమస్యలు, నాడీ సంబంధిత సమస్యలు, ఒబేసిటీ, నిద్రలేమి, డిప్రెషన్ వంటి అనేక అనారోగ్య సమస్యలు కలుగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇదిలా ఉంటే.. నిత్యం స్మార్ట్‌ఫోన్‌కు అతుక్కుపోయే చిన్నపిల్లల కోసం సరికొత్త యాప్‌ అందుబాటులోకి వచ్చింది. దీన్ని ఇంట్లో ఆడలేరు. ఈ గేమింగ్‌ యాప్‌ కేవలం బయటే పనిచేస్తుంది. ఇంటి వరండాల్లో లేదా ఇంట్లోని హాల్‌లో మాత్రమే ఆడాల్సి ఉంటుంది. ఇలా ఆడటం వల్ల వాళ్లకు తెలియకుండానే, వారితో వ్యాయామం చేసేలా చేస్తుందంట ఈ గేమింగ్‌ యాప్‌. 


చిన్నపిల్లల కోసమే ఈ యాప్


అమెరికాకు చెందిన ఆండ్రూ హాల్‌ అనే గేమింగ్‌ డెవలపర్‌.. స్మార్ట్‌ ఫోకు అతుక్కుపోయిన పిల్లల కోసం ఓ అద్భుతమైన యాప్‌ను డెవలప్‌ చేశాడు. అదే జెన్‌మూవ్‌ (GenMove). స్మార్ట్‌ఫోన్‌ వ్యసనంగా మారిపోయిన ఈ కాలంలో ఇప్పటికిప్పుడు వాటి నుంచి పిల్లలను దూరం చేయలేం. ఎందుకంటే.. గతంలో కొంతమంది తల్లిదండ్రులు స్మార్ట్‌ ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించవద్దని చెప్పిన కారణానికే చాలా మంది చిన్నపిల్లలు సూసైడ్‌లు చేసుకున్నారు. మరీ ముఖ్యంగా పబ్‌జీ వంటి డేంజర్‌ గేమ్స్‌ ఆడవద్దని చెప్పిన ఒకే ఒక కారణానికి డిప్రెషన్‌లోకి వెళ్లిన వాళ్లు చాలానే ఉన్నారు.


ఇదిలా ఉంటే.. గంటల తరబడి సోఫాలో కూర్చుని, గేమ్స్‌ ఆడుతూ అనారోగ్యానికి గురి అవుతున్నారు పిల్లలు. ఇదే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆండ్రూ ఈ గేమింగ్‌ వ్యవస్థకు చెక్‌ పెడుతూ సరికొత్త గేమింగ్‌ను రెడీ చేశాడు. జెన్‌మూవ్‌ గేమింగ్‌ యాప్‌ ఓపెన్‌ చేసి, ఇంటి హాల్లో లేదా ఇంటి వరండాలో లేదా గ్రౌండ్‌లో ఆడేందుకు వీలు ఉంటుంది. జెన్‌మూవ్‌ యాప్‌ను ఓపెన్‌ చేసిన వెంటనే.. ముందుకు ఆ మొబైల్‌ కెమెరా ఓపెన్‌ అయి, సమీపంలో ఉన్న ఖాళీ స్థలంలో ఈ ఫిజికల్‌ గేమ్‌లు ఆడాల్సి ఉంటుంది.


అయితే ఇలా చేయడం వల్ల.. వాళ్లకు తెలియకుండానే వాళ్లు చిన్నపాటి వ్యాయామం చేస్తారని తెలిపాడు ఆండ్రూ. అంతేకాదు.. ఈ గేమ్‌లో తమ ఫ్రెండ్స్‌ను కూడా యాడ్‌ చేసుకుని, ఆడేందుకు వీలు ఉంటుందని తెలిపారు. ఇందులో ఉండే గేమ్స్‌ మొత్తం వ్యాయామంపై దృష్టిలో ఉంచుకునే డవలప్‌ చేసిన్నట్లు వెల్లడించారు. మొబైల్‌ స్క్రీన్‌కు, ఫోన్‌కు దూరంగా ఉండి ఈ గేమ్‌ ఆడటం వల్ల చిన్నపిల్లలపై పెద్దగా ప్రభావం చూపదని తెలిపాడు. 


జెన్‌మూవ్‌ యాప్‌ ప్రత్యేకత ఇదే


జెన్‌మూవ్‌ యాప్‌లో మొత్తం 50 రకాల ఆటలు ఉన్నాయని తెలిపాడు ఆండ్రూ. ఒక్కో గేమ్‌లో ఒక్కో రకమైన వ్యాయామం, ఫిట్‌నెస్‌కు సంబంధించిన గేమ్స్‌ ఉన్నాయని అన్నారు. అయితే ఇలా రోజుకు 10 నిమిషాల పాటు ఈ గేమ్‌ ఆడటం వల్ల పిల్లలు ఎంతో ఆరోగ్యంగా ఫిట్‌గా ఉంటారని అన్నాడు. GenMove యాప్‌ను ప్రపంచ ఆరోగ్య సంస్థ, FIFA సహకారంతో అభివృద్ధి చేశారు. ఇది ఇప్పటికే Apple App Store, Google Play Storeలో ఉంది. అంతేకాదు.. ఈ యాప్ ద్వారా FIFA ప్రపంచ కప్ మ్యాచ్‌లు సైతం ప్రత్యక్ష ప్రసారం అవుతున్నాయి. 


Also Read: ఇద్దరు వద్దు, ఒక్కరే ముద్దు అనుకుంటున్నారా? అయితే, మీరు తప్పకుండా ఇది తెలుసుకోవల్సిందే