అమెజాన్ తన యాప్‌లో టిక్‌టాక్ తరహా ఫీడ్‌ను పరీక్షిస్తున్నట్లు తెలిసింది. వినియోగదారులను ఆకర్షించడానికి అమెజాన్ ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెజాన్ ప్రస్తుతం తన యాప్‌లో ఫీడ్‌ను పరీక్షిస్తోంది. అంటే సెల్లర్ తమ ఉత్పత్తులను టిక్‌టాక్ తరహా షార్ట్ వీడియోలతో ప్రమోట్ చేసుకోవచ్చన్న మాట.


ఈ ఫీచర్‌ను ఇన్‌స్పైర్ అని పిలవనున్నట్లు తెలుస్తోంది. కస్టమర్‌లు ఉత్పత్తుల పోస్ట్‌లను లైక్ చేయడానికి, సేవ్ చేయడానికి, షేర్ చేయడానికి, ఫీడ్ నుండి నేరుగా వస్తువులను కొనుగోలు చేయడానికి ఈ ఇన్‌స్పైర్ అనే ఫీచర్ ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని మొదట వాల్‌స్ట్రీట్ జర్నల్ తెలిపింది. 


దీనిపై అమెజాన్ ప్రతినిధి ఒకరు స్పందించారు. ఈ ఫీచర్ గురించి నేరుగా ప్రస్తావించకుండా, వినియోగదారుల కోసం కొత్త ఫీచర్లను ఎప్పుడూ పరీక్షిస్తూనే ఉంటామని అమెజాన్ ప్రతినిధి తెలిపారు. అమెజాన్ ఈ మధ్య తరచుగా కొత్త ఫీచర్లతో ప్రయోగాలు చేస్తూనే చేస్తుంది. కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలను దాని పరీక్షలకు లక్ష్యంగా చేసుకుంటుంది.


ప్రస్తుతానికి, ప్రయోగాత్మక టిక్‌టాక్ లాంటి ఫీడ్ ఎక్కువగా ఫోటోలను చూపుతుందని వాచ్‌ఫుల్ టెక్నాలజీస్ పరిశోధకుడు డేనియల్ బుచుక్ చెప్పారు. అయితే ఈ ఫీచర్‌ను రూపొందించినట్లయితే అమెజాన్ అమ్మకందారులు కస్టమర్‌లకు మరింత ఆకర్షణీయంగా ఉండేలా కంటెంట్‌ని సృష్టించడం వల్ల ఫీడ్ వీడియో హెవీగా ఉంటుందని బుచుక్ అభిప్రాయపడుతున్నారు.


టిక్‌టాక్ దారి పట్టిన ఏకైక పెద్ద టెక్ దిగ్గజం అమెజాన్ మాత్రమే కాదు. గూగుల్, ఫేస్‌బుక్ మాతృసంస్థలు అయిన ఆల్ఫాబెట్, మెటా ఇప్పటికే తమ సొంత టిక్‌టాక్ క్లోన్‌లను ప్రారంభించాయి. యూట్యూబ్ వీడియో సర్వీస్ షార్ట్స్ ఫీచర్‌ని రోల్ చేసింది. ఈ సంవత్సరం జూన్ నాటికి యూట్యూబ్ షార్ట్‌లను 1.5 బిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు చూస్తున్నారని గూగుల్ తెలిపింది.


Also Read: Samsung Galaxy Z Fold 4: 16 జీబీ ర్యామ్‌తో శాంసంగ్ కొత్త ఫోల్డబుల్ ఫోన్ - లాంచ్ త్వరలోనే!


Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!