Amazon Prime New Plan: అమెజాన్ ప్రైమ్ వీడియో మనదేశంలో సబ్‌‌స్క్రైబర్లకు యాడ్స్ చూపించనుంది. 2025 ప్రారంభం నుంచి ఈ యాడ్స్ కంటెంట్ చూసేటప్పుడు ప్లే అవుతాయని అమెజాన్ తెలిపింది. ఆస్ట్రేలియా, కెనడా, మెక్సికో, యూకే, యూఎస్‌, పలు యూరోపియన్ దేశాల్లో ప్రైమ్ వీడియోలో యాడ్స్ ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. త్వరలో మనదేశంలో కూడా ఇవి అందుబాటులోకి రానున్నాయి. యాడ్స్ అవసరం లేదు అనుకునే వారు మరింత ఖరీదైన సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవాల్సి ఉంటుంది.


ఆడియన్స్‌కు న్యూ ఇయర్ గిఫ్ట్?
అమెజాన్ ఇటీవలే ఈ విషయాన్ని తన వెబ్‌సైట్లో పోస్ట్ చేసింది. 2025 నుంచి భారతదేశంలో ప్రైమ్ వీడియో చూసేటప్పుడు లిమిటెడ్ యాడ్స్ ప్లే అవుతాయని తెలిపింది. అయితే యాడ్స్ ద్వారా వచ్చే రెవిన్యూని తిరిగి తాము కంటెంట్ మీదనే ఇన్వెస్ట్ చేస్తామని అమెజాన్ అంటోంది. ప్రైమ్ వీడియోలో షోలు, సినిమాలు చూసేటప్పుడు ఈ యాడ్స్ ప్లే కానున్నాయి.


ఇతర స్ట్రీమింగ్ ప్రొవైడర్లు, సాధారణంగా టీవీల్లో వచ్చే యాడ్స్ కంటే కాస్త తక్కువ యాడ్స్‌నే డిస్‌ప్లే చేస్తామని అమెజాన్ అంటోంది. మనదేశంలో డిస్నీప్లస్ హాట్‌స్టార్ ఇప్పటికే యాడ్ సపోర్టెడ్ ప్లాన్స్‌ను అందిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ కూడా త్వరలో మనదేశంలో యాడ్ సపోర్టెడ్ ప్లాన్స్‌ను మనదేశంలో తీసుకురానుందని సమాచారం. 720పీ రిజల్యూషన్‌తో యాడ్స్‌తో కంటెంట్‌ను చూసే ప్రైమ్ లైట్ సబ్‌స్కిప్షన్‌ను అమెజాన్ ఇప్పటికే అందుబాటులోకి తీసుకువచ్చింది.


Also Read: మంచి కెమెరా క్వాలిటీ, పెద్ద బ్యాటరీ- రూ. 20 వేల లోపు బెస్ట్ 5G మొబైల్స్ ఇవే



అమెజాన్ ప్రైమ్ వీడియోలో యాడ్స్ ప్రారంభం అయ్యాక మీరు యాడ్స్ అవసరం లేదు అనుకుంటే కొత్త యాడ్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఇది యాడ్ ఆన్‌గా రానుందని తెలుస్తోంది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ధర రూ.1,499గా ఉంది. దీని ద్వారా ప్రైమ్ వీడియోకు యాక్సెస్ కూడా లభిస్తుంది. అయితే ఈ ప్లాన్ ధరను 2025లో పెంచబోమని కంపెనీ అంటోంది. యాడ్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్ ధరను భవిష్యత్తులో వెల్లడిస్తామని ప్రకటించింది. 


ప్రైమ్ వీడియోలో యాడ్స్ ఏ టైమ్ లైన్ నుంచి ప్లే అవుతాయన్న విషయం మాత్రం ఇంకా వెల్లడి కాలేదు. కానీ అందుబాటులోకి తీసుకురానున్న కొన్ని వారాల ముందే సబ్‌స్క్రైబర్లకు దాన్ని ఎప్పుడు అందుబాటులోకి తీసుకువస్తాం? ఎలా సబ్‌స్క్రైబ్ తీసుకోవాలో వివరిస్తామని అమెజాన్ తెలిపింది. అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న వినియోగదారులు ఈ నిర్ణయం కారణంగా ఎఫెక్ట్ అవుతారు కానీ, ఇప్పటికే యాడ్స్ చూడటానికి అలవాటు పడ్డ ప్రైమ్ లైట్ సబ్‌స్క్రైబర్లకు మాత్రం ఇది పెద్ద ఎఫెక్ట్ చూపించదు.



Also Read: ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్స్ - ధరలు ఎలా ఉన్నాయో తెలుసా?