Facebook Blue Tick: ట్విట్టర్ లాగానే, ఇప్పుడు ఫేస్‌బుక్ కూడా తన కస్టమర్ల కోసం వెరిఫైడ్ సబ్‌స్క్రిప్షన్ సర్వీస్‌ను తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఫేస్‌బుక్ యజమాని మార్క్ జుకర్‌బర్గ్ ప్రకటించారు. త్వరలో వినియోగదారులు బ్లూ టిక్ సర్వీసుల కోసం ఫేస్‌బుక్‌కు నగదు చెల్లించాల్సి ఉంటుంది.
మార్క్ జుకర్‌బర్గ్ ఆదివారం నాడు ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ గురించి సమాచారాన్ని అందించారు. "ఈ వారం మేము మెటా వెరిఫైడ్‌ను ప్రారంభిస్తున్నాము, ఇది మీ ఖాతాను ప్రభుత్వ IDతో ధృవీకరించడానికి మిమ్మల్ని అనుమతించే సబ్‌స్క్రిప్షన్ సర్వీస్ ఇది." అని మార్క్ జుకర్‌బర్గ్ తన పోస్ట్‌లో రాశారు.
మార్క్ జుకర్‌బర్గ్ తెలిపిన వివరాల ప్రకారం ఇప్పుడు వినియోగదారులు బ్లూ బ్యాడ్జ్ (బ్లూ టిక్), బీన్ ఐస్‌తో నకిలీ ఖాతాల నుంచి రక్షణ, కస్టమర్ సపోర్ట్‌కు నేరుగా యాక్సెస్‌ను ఈ నగదు చెల్లించడం ద్వారా పొందగలుగుతారు. ఈ కొత్త ఫీచర్ ఫేస్‌బుక్ సర్వీసుల్లో అథెంటికేషన్ సెక్యూరిటీని పెంచడమేనని ఆయన అన్నారు. మెటా వెరిఫైడ్ కోసం వెబ్‌లో నెలకు 11.99 డాలర్లు (సుమారు రూ.1,000), యాపిల్ ఐవోఎస్ సిస్టమ్‌లో నెలకు 14.99 డాలర్ల (సుమారు రూ.1,200) ప్రారంభ ధరను కలిగి ఉంటుంది.
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల పేరెంట్ కంపెనీ మెటా ఇటీవలే కొత్తగా 3డీ అవతార్‌లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రాం, మెసెంజర్‌లకు ఈ 3డీ అవతార్‌లు అందుబాటులోకి వచ్చాయి. ఫీడ్ పోస్టులు, స్టోరీలు, ప్రొఫైల్ పిక్చర్లుగా వీటిని ఉంచుకోవచ్చు. దీంతోపాటు కంపెనీ తన ప్లాట్‌ఫాంలకు అప్‌డేట్స్ కూడా అందించింది.
మరిన్ని హావభావాలు, ఫేసెస్, స్కిన్ టోన్లతో మెటా అవతార్లను కంపెనీ అప్‌డేట్ చేసింది. దీంతోపాటు కంపెనీ డిజిటల్ క్లోతింగ్‌తో కూడా ప్రయోగాలు చేయడం ప్రారంభించింది. ఇందులో ఎన్ఎఫ్ఎల్ టీ షర్టులు కూడా ఉన్నాయి. సూపర్ బౌల్ కోసం వాటిని వేసుకోవచ్చు. క్వెస్ట్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, మెసెంజర్‌ల్లో దీన్ని ఉపయోగించుకోవచ్చని మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు.
అయితే ప్రస్తుతానికి ఇది అమెరికా, మెక్సికో, కెనడాల్లోని వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఇన్‌స్టాగ్రామ్ వినియోగదారులు ఈ 3డీ అవతార్‌లను స్టోరీలు, డీఎంల్లో కూడా ఉపయోగించుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ అవతార్‌ల్లో వేర్వేరు ఫేషియల్ షేపులు, ఎక్స్‌టెన్సివ్ ఫీచర్లు కూడా ఉన్నాయి. దివ్యాంగుల కోసం కూడా ప్రత్యేకమైన ఫీచర్లను ఇందులో అందించారు.
ఈ కొత్త అవతార్‌లు ప్రస్తుతం ఫేస్‌బుక్, మెసెంజర్‌ల్లో రోల్ అవుట్ అవుతున్నాయి. వినియోగదారులు అన్నిట్లో ఒకే అవతార్‌ను వాడుకోవచ్చు. లేదా ప్లాట్‌ఫాంను బట్టి వేర్వేరు అవతార్‌లను మార్చుకోవచ్చు. మెటావర్స్‌పై తమ దీర్ఘకాలిక ప్రణాళికలను తెలిపినప్పటి నుంచి, తాము సోషల్ టెక్నాలజీని తర్వాతి స్థాయికి తీసుకువెళ్లడానికి ప్రయత్నిస్తూనే ఉన్నామని అవతార్స్ అండ్ ఐడెంటిటీ జనరల్ మేనేజర్ అయిగెరిమ్ షోర్మెన్ తెలిపారు.