Latest WTC Points Table: ఢిల్లీ వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ సిరీస్ రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. ఈ విజయం తర్వాత నాలుగు టెస్టుల సిరీస్‌లో టీమ్‌ఇండియా 2-0తో ఆధిక్యంలోకి వెళ్లగలిగింది. అంతకుముందు నాగ్‌పూర్ టెస్టులో భారత్ ఏకంగా ఇన్నింగ్స్ 132 పరుగుల తేడాతో కంగారూలను ఓడించింది.


వరుసగా రెండో టెస్టులోనూ విజయం సాధించిన భారత్ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు దాదాపు దూసుకెళ్లినట్లే. ప్రస్తుత డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికను పరిశీలిస్తే భారత్ తన నంబర్ టూ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు ఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. ఆస్ట్రేలియా ఇప్పటికే ఫైనల్స్‌కు చేరుకుంది. ఇప్పుడు టీం ఇండియా కూడా టైటిల్ మ్యాచ్‌కు చేరుకోవడం ఖాయం.


ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ తాజా పాయింట్ల పట్టికను పరిశీలిస్తే భారత్ 64.06 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. 66.67 పాయింట్లతో ఆస్ట్రేలియా జట్టు నంబర్‌వన్‌గా కొనసాగుతోంది. ఈ జట్లతో పాటు శ్రీలంక 53.33 పాయింట్లతో మూడో స్థానంలో, దక్షిణాఫ్రికా 48.72 పాయింట్లతో నాలుగో స్థానంలో, వెస్టిండీస్ 40.91 పాయింట్లతో ఆరో స్థానంలో, పాకిస్థాన్ 38.1 పాయింట్లతో ఏడో స్థానంలో, న్యూజిలాండ్ 27.27 పాయింట్లతో ఎనిమిదో స్థానంలో, బంగ్లాదేశ్ 11.11 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాయి.
 
WTC ఫైనల్ భారత్ సిద్ధం
ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్ ఈ ఏడాది జూన్ 7వ తేదీ నుంచి లండన్‌లోని ఓవల్ మైదానంలో జరగనుంది. ఈ పోటీల్లో ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే ఫైనల్‌కు చేరుకుంది. అయితే టైటిల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఎదుర్కొనే మరో జట్టు ఎవరన్నది ఇంకా అధికారికంగా ఖరారు కాలేదు. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత్ ఫైనల్ ఆడడం ఖాయం.


ప్రస్తుతం భారత జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరాలంటే, ప్రస్తుత సిరీస్‌లో భారత జట్టు ఆస్ట్రేలియాను 2-0 లేదా 3-1 తేడాతో ఓడించాలి. ఆస్ట్రేలియాపై భారత్ 2-0 ఆధిక్యంలో ఉంది. అయితే ఇప్పుడు టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో ఫైనల్‌కు చేరుకోవాలంటే మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోనూ అయితే విజయం సాధించాలి, లేదా డ్రా చేసుకోవాలి.  ఇలాంటి పరిస్థితుల్లో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో భారత జట్టు ఫైనల్ చేరడం దాదాపు ఖాయం.


బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టులో ఆస్ట్రేలియాపై భారత్ ఘనవిజయం సాధించింది. రవీంద్ర జడేజా సూపర్ స్పెల్ కు రోహిత్, పుజారా, కోహ్లీ, శ్రీకర్ భరత్ ల సమయోచిత బ్యాటింగ్ తోడైన వేళ టీమిండియా కంగూరూలను మట్టికరిపించింది. 


రెండోరోజు ఆధిపత్యం ప్రదర్శించిన ఆస్ట్రేలియాను మూడోరోజు లంచ్ లోపే ఆలౌట్ చేయడం దగ్గరే భారత్ విజయానికి పునాది పడింది. రెండో రోజు చివరి సెషన్ లో దూకుడుగా ఆడి భారత్ ను ఆత్మరక్షణలో పడేసిన ఆసీస్ బ్యాటర్లు.. మూడో రోజుకొచ్చేసరికి తేలిపోయారు. అశ్విన్, జడేజాల ధాటికి ఒక్క సెషన్ కూడా పూర్తిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. ముఖ్యంగా జడ్డూ తన బౌలింగ్ తో కంగారూలకు కంగారు పుట్టించాడు. క్రీజులో బ్యాటర్లను నిలవనీయకుండా చేశాడు. మరోవైపు అశ్విన్ చక్కని సహకారం అందించాడు. వీరి స్పిన్ మాయాజాలానికి 52 పరుగులకే ఆసీస్ చివరి 9 వికెట్లను కోల్పోయింది.