Wrestlers Protest: ఆసియా క్రీడలలో ఎలాంటి ట్రయల్స్ లేకుండానే నేరుగా అర్హత సాధించిన వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజాగా ఈ ఇద్దరూ ఆ అంశంపై స్పందించారు. ఆసియా క్రీడల కోసం విదేశాలలో ప్రిపేర్ అవుతున్న వినేశ్, భజరంగ్‌లు ఫేస్‌బుక్ లైవ్ ద్వారా వివరణ ఇచ్చారు. తామేం ట్రయల్స్ నుంచి పారిపోలేదని, తమకు మరింత సమయం కోరితే కేంద్రం అందుకు అంగీకరించలేదని తెలిపారు. అంతిమ్ పంగల్ తనపై చేసిన ఆరోపణలపై కూడా వినేశ్ ఘాటుగా స్పందించింది.
వినేశ్ స్పందిస్తూ...‘మేం ట్రయల్స్‌కు వ్యతిరేకం కాదు. నేను అంతిమ్‌ను నిందించదలుచుకోలేదు. ఆమెది తప్పు కాదు. ఆమె తన హక్కుల కోసం పోరాడుతోంది. మేం కూడా మా హక్కుల కోసమే ఇన్నాళ్లు పోరాటం చేశాం. ఆమె చాలా చిన్నది. ఇప్పుడు ఆమెకు అర్థం (ట్రయల్స్ లేకుండా నేరుగా పంపడంపై) కాదు. కానీ అదే సమయంలో మేం ఏ తప్పూ చేయలేదు..’అని తెలిపింది.
లాఠీ దెబ్బలు తిన్నాం..
‘మేం ఈ సిస్టమ్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాం. శక్తివంతులైన నాయకుల (బ్రిజ్ భూషణ్‌ను ఉద్దేశిస్తూ) తో పోరాడుతున్నాం. ఈ క్రమంలో మేం లాఠీ దెబ్బలు తిన్నాం. ఇప్పుడు అన్యాయం జరిగిందని మాట్లాడుతున్నవారెవరూ అప్పుడు మాకోసం రాలేదు. ఆమె (అంతిమ్) తాను మోసపోయానని చెబుతోంది. కామన్వెల్త్ గేమ్స్‌లో తనకు అన్యాయం జరిగిందని అంటోంది. ఆమె పేర్కొన్నట్టు అన్యాయం జరిగిఉంటే దానికి కారణంగా నాటి డబ్ల్యూఎఫ్ఐ చీఫ్‌ను నిందించాలి. నన్ను కాదు..’ అని ఆవేదన వ్యక్తం చేసింది.
ఇప్పటికైనా మాట్లాడుతున్నారు..
రెజ్లర్ల ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడ్డా ముందుకురాని చాలా మంది ఇప్పుడు తమ హక్కుల కోసం ముందుకు వచ్చి మాట్లాడుతుండటం సంతోషంగా ఉందని ఫొగాట్ తెలిపింది. ‘వీళ్లు ఇప్పటికైనా నోరు తెరిచి మాట్లాడుతున్నారు. ఇది రెజ్లింగ్‌కు శుభపరిణామం. ఇప్పుడు వారికి మాట్లాడానికి ధైర్యం వచ్చింది. రెజ్లింగ్‌లో నేను 20 ఏండ్ల నుంచి ఉన్నా. అంతిమ్ నేను ప్రాక్టీస్ చేయలేదని, నిరసనలో పాల్గొన్నానని చెబుతోంది. మేం ఇప్పటికీ విజయాల కోసం ఆకలిమీదే ఉన్నాం. బరిలోకి దిగితే మా లక్ష్యం పతకం గెలవడం మీదే ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుతున్నవాళ్లంతా ట్రయల్స్‌లో పెట్టిన ఎఫర్ట్‌లో సగం మేం నిరసన చేసిన సమయంలో పెట్టి ఉంటే ఈపాటికి బ్రిజ్ భూషణ్ బయటతిరిగేవాడు కాదు. మనందరం రెజ్లింగ్ ప్రాక్టీస్‌లో ఉండేవాళ్లం. మేం ట్రయల్స్ నుంచి పారిపోలేదు. మేం ట్రైన్ కావడానికి మరికొంత టైమ్ కావాలని కోరాం. మేం దేశం నుంచి పారిపోలేదు. ఆటలో గెలుపోటములు సహజం’అని వ్యాఖ్యానించింది.
ఆమె ఇప్పటికీ గెలవగలదు..
వినేశ్ బరిలో ఉంటే తాను ఓడించి ఆసియా క్రీడల్లో ఆడేదానినని అంతిమ్ చేసిన వ్యాఖ్యలపై భజరంగ్ స్పందిస్తూ.. ‘ట్రయల్స్‌లో పాల్గొన్నవారిలో ముగ్గురు నలుగురు ఆటగాళ్లు వినేశ్‌ను ఓడించేవాళ్లని అంటున్నారు. కానీ అంతిమ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే.. వినేశ్ ఓడిపోలేదు. ఆమె ఫైటర్. తాను అండర్ -20 ఛాంపియన్‌షిప్ గెలిచానని చెబుతోంది. కానీ వినేశ్ రెండు వరల్డ్ ఛాంపియన్స్‌లో విజేతగా నిలిచింది. ఆ విషయాన్ని ఆమె గుర్తుంచుకోవాలి. మీరు మాకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసి మమ్మల్ని కోర్టుకు లాగారు..’అని అన్నాడు. ఈ విషయంలో ట్రయల్స్ ముగించేదాకా తాము ఏం మాట్లాడకూడదనుకున్నామని, అందుకే ఇప్పుడు స్పందిస్తున్నామని స్పష్టత ఇచ్చాడు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial