Travis Head: ట్రావిస్ హెడ్‌..ఈ పేరు ఈ ప్రపంచకప్ లో వినపడుతుందని ఎవ్వరూ అనుకుని ఉండరు. ఎందుకంటే అసలు ఈ  ప్రపంచకప్‌కు అందుబాటులోనే ఉండడనుకున్న ఆటగాడు తను. ఇప్పుడు అతనే ఆస్ట్రేలియాను సగర్వంగా ఫైనల్‌కు తీసుకెళ్లాడు. గాయం కారణంగా ప్రాబబుల్స్ లో ఉన్నా ట్రావిస్ హెడ్ ఈ ప్రపంచకప్‌కు దూరంగా ఉన్నాడు. మిగిలిన ఆస్ట్రేలియా జట్టుతో పాటు ఇండియాకు కూడా రాలేదు.


సగం లీగ్ దశ పూర్తయ్యాక...
లీగ్‌ స్టేజ్ లో సగం మ్యాచ్ లు పూర్తి అయిన తర్వాత ట్రావిస్ హెడ్ కోలుకుని టీమ్‌తో వచ్చి కలిశాడు. లీగ్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. గాయం నుంచి కోలుకుని ఆడిన ఫస్ట్ మ్యాచ్‌లోనే అద్భుతమైన సెంచరీ బాదాడు. కానీ తర్వాతి మూడు మ్యాచ్‌ల్లో పూర్తిగా ఫెయిలయ్యాడు. కానీ ఆస్ట్రేలియా మేనేజ్‌మెంట్ మాత్రం హెడ్ పై నమ్మకం ఉంచింది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న ట్రావిస్ హెడ్ సెమీస్‌లో నిలబెట్టుకున్నాడు. ఇటు బంతితోనూ, అటు బ్యాటుతోనూ అదరగొట్టి ఆస్ట్రేలియా టీమ్ ను ఫైనల్ కు తీసుకెళ్లాడు.


ఆరంభంలో తడబడినా మళ్లీ పుంజుకుంటున్న టైమ్ లో సౌతాఫ్రికాను తన బౌలింగ్ తో దెబ్బ తీశాడు హెడ్. దక్షిణాఫ్రికా మంచి స్థితికి చేరుతున్న టైమ్ లో డేంజరస్ ఆటగాళ్లు హెన్రిచ్  క్లాసెన్‌, మార్కో జాన్సెన్‌లను ఒకే ఓవర్లో ఔట్‌ చేశాడు. ఐదు ఓవర్లు వేసి కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన ఈ రెండు వికెట్లు సాధించాడు ట్రావిస్ హెడ్.


చివరికి రిజల్ట్ ఏంటంటే తక్కువలో తక్కువ 250 పరుగులు చేస్తుందనుకున్న సౌత్ ఆఫ్రికా... కేవలం 212 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత బ్యాటింగ్‌ కు దిగిన ఆస్ట్రేలియా తరఫున ట్రావిస్ హెడ్ స్టార్టింగ్ నుంచే రెచ్చిపోయాడు. కఠినమైన పిచ్‌పై కేవలం 48 బంతుల్లోనే తొమ్మిది ఫోర్లు, రెండు సిక్సర్లతో 62 పరుగులు చేసి సౌతాఫ్రికాకు విజయాన్ని దూరం చేశాడు. టాప్ స్కోరర్ గా నిలబడి ఆస్ట్రేలియాను ఫైనల్ కు తీసుకెళ్లాడు. మరి ఫైనల్లో భారత్... హెడ్‌ను నిలువరిస్తుందా? లేదా అన్నది రేపు (ఆదివారం) మధ్యాహ్నం తెలిసిపోతుంది.