IND vs AUS World Cup 2023 Final : ప్రతిష్టాత్మక లార్డ్స్ స్టేడియంలో 1983లో కపిల్ దేవ్ కప్పును ఎత్తిన క్షణాలను, 2011లో ధోని సిక్సు కొట్టి గెలిపించిన అనుభూతులను మరోసారి కళ్లారా వీక్షించాలని క్రికెట్ అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. స్వదేశంలో జరుగుతున్న ప్రపంచకప్(World Cup) తుది పోరులో ఆస్ట్రేలియాను(Australia) ఓడించి టీమిండియా(Team India) విజయం సాధించాలని కోట్ల మంది క్రికెట్ అభిమానులు ఆశిస్తున్నారు. కోట్ల మంది అభిమానుల ఆకాంక్షలను మోస్తున్న రోహిత్‌సేన కీలక మ్యాచ్‌కు సిద్ధమైంది. అసలే ఆదివారం, అందులోనూ ఇండియాలో జరుగుతున్న క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్స్, ఇండియా కప్ గెలవటానికి ఎక్కువ అవకాశాలు ఉన్న రోజు... ఇలాంటి రోజు కోసం ఫ్యాన్సే కాదు బెట్టింగ్(Betting) రాయుళ్లు కూడా ఎదురుచూస్తున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ ఆన్‌లైన్ బెట్టింగ్‌లో చెలరేగిపోతున్నారు. రేపు ఒక్కరోజే అక్షరాల 70 వేల కోట్ల రూపాయలు చేతులు మారనున్నాయి. మాములు మ్యాచులు ఉంటేనే కోట్లల్లో బెట్టింగులు కాసే వాళ్లు ప్రపంచ కప్ ఫైనల్ అంటే ఊ అనకుండా.. ఊహూ అంటారా.
ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడుతుంటేనే కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. ఐపీఎల్‌లో కూడా వేల కోట్ల బెట్టింగ్ జరుగుతుంటుంది. అలాంటింది ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ అంటే మాములుగా ఉంటుందా మరి. అందులోనూ టీమిండియా ఫైనల్ చేరింది. ప్రత్యర్థి కూడా ఆస్ట్రేలియా కావడంతో బెట్టింగ్ రాయుళ్ల పంట పండింది. ఇలాంటి హైఓల్టేజ్ మ్యాచ్‌ల కోసమే కళ్లల్లో ఫ్లడ్ లైట్లు వేసుకుని మరీ ఎదురుచూసే బెట్టింగ్ బాబులు వేల కోట్ల రూపాయల బెట్టింగులు సిద్ధమైపోయారు.
భారత్- ఆస్ట్రేలియా మధ్య జరిగే ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌పై.. సుమారు 70 వేల కోట్ల రూపాయలు చేతులు మారనున్నట్లు బెట్టింగ్ వర్గాల ద్వారా తెలుస్తోంది. టీమిండియా ప్రపంచకప్ విజేతగా నిలుస్తుందని ఎక్కువ మంది పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే ప్రపంచకప్‌లో ఇండియా, పాకిస్థాన్ లీగ్ మ్యాచ్‍పై సైతం 40 వేల కోట్ల వరకూ బెట్టింగ్ జరగగా.... ఇప్పుడు ఇది 70 వేల కోట్లకు చేరింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 500లకు పైగా బెట్టింగ్ వెబ్‌సైట్లు ప్రపంచకప్ ఫైనల్ మీద బెట్టింగ్ నిర్వహిస్తున్నాయి. ఫైనల్ మ్యాచ్‌పై బెట్టింగ్ కాస్తున్న వారిలో ఎక్కువ మంది భారత్ టాస్ గెలుస్తుందని, రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకుంటాడని పందేలు కాస్తున్నారు. సూపర్ ఫామ్‌లో ఉన్న విరాట్ కోహ్లి,శుభ్‌మన్ గిల్ వంటి ప్లేయర్లను కాదని రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్‌వైపు గ్యాంబ్లర్స్ మొగ్గుచూపుతున్నారు. ఈ ప్రపంచకప్‌లో అద్భుతమైన బౌలింగ్‌తో అదరకొడుడుతున్నా షమీ వైపు కాకుండా సిరాజ్, బుమ్రా మీద ఎక్కువగా బెట్టింగ్ కాస్తున్నారట బెట్టింగ్ బంగార్రాజులు.
జట్టు స్కోరు మీద కూడా పందేలు జరుగుతున్నాయి. అయితే భారీస్కోర్లు నమోదవుతాయని మాత్రం పందెం రాయుళ్లు భావించడం లేదు. ఏ జట్టు బ్యాటింగ్ చేసినా కూడా 250 నుంచి300 లోపు పరుగులు చేస్తుందని అంచనా వేస్తున్నారు. చాలా తక్కువమంది మాత్రమే స్కోరు 300 నుంచి 400 మధ్యలో ఉంటుందని పందెం కడుతున్నారు. మరోవైపు మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా కూడా.. బెట్టింగ్ వర్గాల్లో ఈ ఫైనల్ పోరు సరికొత్త రికార్డులకు తెరతీయడం ఖాయమని సమాచారం.
భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ తుది అంకానికి చేరుకుంది. రేపు( ఆదివారం) జరిగే ఫైనల్‌తో ఈ మహా సంగ్రామం ముగియనుంది. అప్రతిహాత విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చిన టీమిండియా... అయిదుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో అమీ తుమీ తేల్చుకోనుంది. బ్యాటింగ్, బౌలింగ్‌లో బలంగా ఉన్న టీమ్ ఇండియా చివరి అడుగు వేసి ఆస్ట్రేలియాను ఓడించి ప్రపంచకప్‌ను కైవసం చేసుకునేందుకు సిద్ధంగా ఉంది.