ప్రపంచ జూనియర్ అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో మరో పతకం భారత్ ఖాతాలో చేరింది. ఉమెన్స్ లాంగ్ జంప్ విభాగంలో భారత్‌కు చెందిన శైలి సింగ్ రజత పతకాన్ని కైవసం చేసుకుంది. 0.01 మీటర్ల దూరంతో త్రుటిలో బంగారు పతాకాన్ని మిస్ చేసుకుంది. 6.59 మీటర్ల దూరం లాంగ్ జంప్ చేసి పతకాన్ని సాధించింది. స్వీడన్‌కు చెందిన మజా అస్కాగ్ 6.60 మీటర్ల దూరంతో బంగారు పతకం సాధించింది. ఉక్రెయిన్‌కు చెందిన మారియా హెరీలోవా కాంస్య పతకం దక్కించుకుంది.






17 ఏళ్ల శైలి.. మొదటి రెండు రౌండ్‌లను 6.34 మీటర్ల దూరంతో పూర్తి చేసింది. ఇక మూడో రౌండ్‌లో 6.59 మీటర్ల దూరం వరకు జంప్ చేసింది. అస్కాజ్ తన నాలుగో ప్రయత్నంలో 6.60 దూరం జంప్ చేయడంతో బంగారు పతకం దక్కించుకుంది. ఇక ఈరోజు జరిగిన పురుషుల ట్రిపుల్ జంప్‌లో డోనాల్డ్ మకిమైరాజ్ నాల్గవ స్థానంలో నిలవగా.. అంకిత మహిళల 5000 మీటర్ల రన్నింగ్‌లో ఆరో స్థానంలో నిలిచింది. 






మొత్తం మూడు పతకాలు..


అండర్‌-20 అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌లో ఇప్పటివరకు భారత్ రెండు రజత పతకాలు గెలుచుకోగా.. ఇది మూడోవది. శనివారం జరిగిన 10 వేల మీటర్ల నడకలో భారత అథ్లెట్‌ అమిత్‌ ఖత్రి రజత పతకం కైవసం చేసుకున్నాడు. ఇండియాకు చెందిన మిక్స్‌డ్ 4x400 మీటర్ల రిలే జట్టు కాంస్య పతకాన్ని గెలుచుకుంది.