Ricky Ponting As A ODI Captain: ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ వన్డే క్రికెట్ చరిత్రలోని గొప్ప కెప్టెన్లలో ఒకరు. అతను కెప్టెన్‌గా, ఆటగాడిగా చాలా విజయవంతమయ్యాడు. కంగారూ జట్టుకు వరుసగా రెండు ప్రపంచకప్‌లు అందించిన తొలి ఆస్ట్రేలియా కెప్టెన్‌గా నిలిచాడు.
వన్డే క్రికెట్ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసిన మూడో బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. 2012లో వన్డేల నుంచి రిటైరైన పాంటింగ్ పేరిట ఎన్నో రికార్డులు ఉన్నాయి. కెప్టెన్‌గా, వన్డేల్లో అత్యధిక విజయాలు నమోదు చేసిన ఆటగాడిగా అతని పేరు ఇప్పటికీ ఉంది. వన్డేల్లో అతను అత్యధిక మ్యాచ్‌లు గెలిచిన రికార్డు ఎప్పుడు బద్దలవుతుంది?
అత్యధిక వన్డే విజయాలు రికీవే
ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ తన జట్టుకు కెప్టెన్‌గా ఉన్నప్పుడు అత్యధికంగా 165 మ్యాచ్‌లు గెలిచాడు. వన్డేల నుంచి రిటైర్ అయి ఇప్పటికి పదేళ్లకు పైగా గడిచింది. అయితే ఈ రికార్డు ఇప్పటికీ అతని పేరు మీదనే ఉంది.
ఈ జాబితాలో రికీ పాంటింగ్‌తో తర్వాతి స్థానంలో మహేంద్ర సింగ్ ధోని (110 విజయాలు), అలన్ బోర్డర్ (107 విజయాలు), స్టీఫెన్ ఫ్లెమింగ్ (98 విజయాలు), హాన్సీ క్రోనే (99 విజయాలు), గ్రేమ్ స్మిత్ (92 విజయాలు), మహ్మద్ అజారుద్దీన్ (90 విజయాలు), అర్జున్ రణతుంగ (89 విజయాలు) ఉన్నారు.
కొట్టడం కష్టమే
రికార్డులు బద్దలు కొట్టడానికే అని అందరూ అంటూ ఉంటారు. అయితే పాంటింగ్ రికార్డును బద్దలు కొట్టడం ఈ తరంలో సాధ్యం కాదు. దీన్ని కొట్టాలంటే ఇంకా చాలా సంవత్సరాలు పడుతుంది. పాంటింగ్ రికార్డు ఇలా ఉంది మరి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్డే కెప్టెన్లను పరిశీలిస్తే పాంటింగ్ రికార్డు దరిదాపుల్లో కూడా మరో కెప్టెన్ లేడు.
అతని రికార్డును చేరుకునే అవకాశం ఉన్న వన్డే కెప్టెన్లందరూ రిటైరయ్యారు. మహేంద్ర సింగ్ ధోనీ, గ్రేమ్ స్మిత్, ఇయాన్ మోర్గాన్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికారు. ప్రస్తుతం, న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ 44 మ్యాచ్‌లు గెలిచాడు. అతను పాంటింగ్ రికార్డుకు చాలా దూరంగా ఉన్నాడు. దీన్ని బట్టి సమీప భవిష్యత్తులో రికీ పాంటింగ్ రికార్డుకు ఎలాంటి ముప్పు లేదని చెప్పవచ్చు.
ప్రస్తుత భారత కెప్టెన్ రోహిత్ శర్మ రికార్డును పరిశీలిస్తే తన ఖాతాలో ప్రస్తుతానికి కేవలం 19 విజయాలు మాత్రమే ఉన్నాయి. రోహిత్ కెరీర్ కూడా దాదాపు చివరి దశలో ఉంది కాబట్టి తను రికీ పాంటింగ్ కెప్టెన్సీ రికార్డును కొట్టడం కష్టమే. భారత కెప్టెన్ల జాబితాను చూస్తే అజరుద్దీన్ 90 విజయాలు, సౌరవ్ గంగూలీ 76 విజయాలు, విరాట్ కోహ్లీ 65 విజయాలు, రాహుల్ ద్రవిడ్ 42 విజయాలతో రెండు నుంచి ఐదు విజయాలతో ఉన్నారు. ఇక మొదటి స్థానంలో మహేంద్ర సింగ్ ధోని ఏకంగా 110 విజయాలతో ఉన్నారు.