Suryakumar Yadav On Yuzvendra Chahal: సూర్యకుమార్ యాదవ్ 2022లో అద్భుతమైన ప్రదర్శనను కనబరిచాడు. ప్రత్యేకించి అంతర్జాతీయ టీ20ల్లో నంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నాడు. గతేడాది, టీ20లో అత్యధికంగా 1,164 పరుగులు చేశాడు. 2022లో రెండు సెంచరీలు, తొమ్మిది హాఫ్ సెంచరీలు చేశాడు.
అతని అద్భుతమైన ప్రదర్శనకు పురుషుల టీ20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కూడా అందుకున్నాడు. ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో సూర్యకుమార్ యాదవ్ అగ్రస్థానంలో ఉన్నాడు. ఈ ఏడాది కూడా టీ20లో మెరుపులు మెరిపిస్తున్నాడు. జనవరి 29వ తేదీన లక్నోలో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియాను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో 26 పరుగులతో అజేయంగా ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ యాదవ్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు.
లక్నోలో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో విజయం సాధించిన అనంతరం కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్‌లతో సూర్యకుమార్ యాదవ్ మాట్లాడాడు. ఈ సమయంలో అతను తన బ్యాటింగ్ క్రెడిట్‌ను యుజ్వేంద్ర చాహల్‌కు ఇచ్చాడు. తన బ్యాటింగ్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యావ్ కదా అని సూర్యకుమార్ యాదవ్‌ను చాహల్ అడిగినప్పుడు దానికి అతను ఫన్నీ ఆన్సర్ ఇచ్చాడు.
‘నిజానికి మీరు గత సిరీస్‌లో నాకు నేర్పించినట్లుగానే, గత టీ20 సిరీస్‌లో కూడా ప్రయత్నం చేశాను. మీరు నాకు మరింత బ్యాటింగ్ నేర్పించాలని కోరుకుంటున్నాను. నేను నా బ్యాటింగ్‌ను ఎలా మెరుగుపరుచుకోగలను? దీన్ని జోక్‌గా తీసుకోకండి. యుజ్వేంద్ర చాహల్ బ్యాటింగ్ కోచ్, అతను ప్రతిదీ నేర్పిస్తాడు.’ అని తెలిపాడు
ఆ రికార్డును నిలబెట్టుకోవాలి
న్యూజిలాండ్‌పై తన రికార్డును కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. నిజానికి 2017 నుండి న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో టీమ్ ఇండియా అజేయంగా ఉంది. 2017 సంవత్సరంలో టీ20 సిరీస్‌లో భారత్ 2-1తో కివీస్‌ను ఓడించింది. ఇక 2021లో టీమ్ ఇండియా 3-0తో న్యూజిలాండ్‌ను ఓడించింది. 2012లో భారత గడ్డపై కివీస్ చివరిసారిగా సిరీస్‌ను గెలుచుకుంది. ఆ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్ 1-0తో భారత్‌ను ఓడించింది.
ఇక ఆదివారం న్యూజిలాండ్‌తో జరిగిన రెండో థ్రిల్లింగ్ టీ20లో టీమిండియా విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 99 పరుగులు చేసింది. అనంతరం టీమిండియా 19.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ తరఫున సూర్యకుమార్ యాదవ్ (26: 31 బంతుల్లో, ఒక ఫోర్) చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్ గెలిపించాడు. దీంతో సిరీస్ 1-1తో సమం అయింది. మూడో టీ20లో గెలిచిన జట్టు సిరీస్‌ను గెలుచుకోనుంది.
100 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా ఆరంభంలోనే శుభ్‌మన్ గిల్ వికెట్‌ను కోల్పోయింది. క్రీజులో ఉన్నంత సేపు ఇబ్బంది పడ్డ ఇషాన్ కిషన్ కూడా తొమ్మిదో ఓవర్లో అవుటయ్యాడు. అయితే కొట్టాల్సిన లక్ష్యం తక్కువే కావడంతో భారత బ్యాటర్లు ఎక్కడా కంగారు పడలేదు.
దీనికి తోడు న్యూజిలాండ్ బౌలర్లు కూడా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ కెప్టెన్ మిషెల్ శాంట్నర్ ఏకంగా ఎనిమిది బౌలింగ్ ఆప్షన్లను ఉపయోగించాడు. అందరూ పొదుపుగానే బౌలింగ్ వేశారు కానీ వికెట్లు తీయడంలో విఫలం అయ్యారు. సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా చివరి వరకు క్రీజులో ఉండి మ్యాచ్‌ను గెలిపించారు. ఇష్ సోధి, మైకేల్ బ్రేస్‌వెల్‌లకు చెరో వికెట్ దక్కింది.