Commonwealth Games 2022: కామన్ వెల్త్ గేమ్స్ 2022లో భారత్‌కు ఈ ఏడాది అదిరిపోయే ఆరంభం దక్కింది. అంత మంచి ఓపెనింగ్ ను దేశానికి అందించడంలో సక్సెస్ పుల్ అయ్యారు మన వెయిట్ లిఫ్టర్లు. మీరాబాయి చాను మరోసారి స్వర్ణంతో సత్తా చాటగా, వేర్వేరు విభాగాల్లో మరో 2 రజతాలు, ఓ కాంస్యం కూడా శనివారం భారత్ సొంతమైంది. వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్‌లలో భారత్‌కు పతకాలు రావడం సాధారణంగా చూస్తుంటాం. అయితే మనలో చాలా మందికి ఆ పోటీలు ఎలా నిర్వహిస్తారో సరిగ్గా తెలియదు. 


వెయిట్ లిఫ్టింగ్‌లో భారత్‌కు పతకాలు.. 
ప్రస్తుతం భారత్ శనివారం ఒక్కరోజు 4 పతకాలు సాధించిన వెయిట్ లిఫ్టింగ్‌లో చాలా మందికి బేసిక్ ఐడియా ఉండదు. అందరికీ తెలిసింది.. ఎవరు ఎక్కువ బరువు ఎత్తితే వారే విజేత. కాదనలేం. కానీ, అందులో విభాగాలు ఉంటాయని ఇంకా కాస్త పరిశీలిస్తే అర్థమవుతుంది. వెయిట్ లిఫ్టింగ్ పోటీలు గమనిస్తే... ఆటగాళ్ల వెయిట్స్ ఆధారంగా వేర్వేరు కేటగిరీల్లో పోటీలు నిర్వహిస్తారు. అయితే ప్రతి విభాగంలోనూ రెండు రకాల పోటీలు ఉంటాయి. ఒకటి స్నాచ్ విభాగం, రెండోది క్లీన్ అండ్ జర్క్. వెయిట్‌లిఫర్లు కచ్చితంగా ఈ రెండింట్లో పాల్గొన్నాక విజేతల్ని ప్రకటిస్తారు. ఆ విభాగాల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం..






1. స్నాచ్
వెయిట్ లిఫ్టర్ ముందు బార్ బెల్ ఉంటుంది. దానికి వెయిట్స్ యాడ్ చేసి ఉంటాయి. ఆ బార్ బెల్ ను వెయిట్ లిఫ్టర్ పట్టుకుని, ఒకటే ఫ్లోలో ఓవర్ హెడ్... అంటే తల మీదకు ఎత్తాల్సి ఉంటుంది. అలా ఎత్తిన తర్వాత కొన్ని సెకన్ల పాటు పొజిషన్ ను హోల్డ్ చేయాలి. అప్పుడే సక్సెస్ ఫుల్ గా స్నాచ్ కంప్లీట్ చేసినట్టు. స్నాచ్ ను ఒకటేసారి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి క్లీన్ అండ్ జర్క్ తో పోలిస్తే దీంట్లో లిఫ్ట్ చేసే బరువులు తక్కువ. 





2. క్లీన్ అండ్ జర్క్
క్లీన్ అండ్ జర్క్ అంటే ఏంటంటే.... బార్ బెల్ కు వెయిట్స్ యాడ్ చేసి ఉంటాయి. దాన్ని ప్లేయర్ లిఫ్ట్ చేసి..... షోల్డర్ లెవల్ దగ్గర ఒకట్రెండు సెకన్లు ఆగుతారు. ఇక్కడవరకు క్లీన్ పూర్తైనట్టు. అప్పుడు షోల్డర్ లెవల్ నుంచి ఒక్కసారిగా ఓవర్ హెడ్ వరకు (తల మీదకు) లిఫ్ట్ చేయాలి. అలా తలపైకి ఎత్తాక అక్కడ ఆ పొజిషన్ ను కొన్ని సెకన్లు హోల్డ్ చేయాలి. అప్పుడే సక్సెస్ ఫుల్ గా క్లీన్ అండ్ జర్క్ పూర్తైనట్టు. స్నాచ్ తో పోలిస్తే.... ఇందులో సెకన్ల పాటు ఆగే వీలుంటుంది కనుక, కంపారేటివ్ గా ఈ విభాగంలో ఎక్కువ బరువు ఎత్తుతారు. 



వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ముందుగా స్నాచ్ ను నిర్వహిస్తారు. ప్రతి ప్లేయర్ కు మూడు స్నాచ్ అటెంప్ట్స్ ఇస్తారు. అందరి ఆటగాళ్ల స్నాచ్ పూర్తయ్యాక... అందరికో మరో మూడేసి అటెంప్ట్స్ ఇచ్చి క్లీన్ అండ్ జర్క్ ఆడిస్తారు. రెండింట్లోనూ ప్లేయర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ నోట్ చేసుకుంటారు. రెండింటి మొత్తం కలిపి ప్లేయర్ ఎన్ని కిలోల బరువు ఎత్తారో నిర్ధారిస్తారు. అంటే ఉదాహరణకు ఓ ఆటగాడు స్నాచ్ లో 90 కిలోలు, క్లీన్ అండ్ జర్క్ లో 120 కిలోల బరువు ఎత్తితే... ఆ ప్లేయర్ మొత్తం మీద 210 కిలోల బరువు ఎత్తినట్టు. ఇలా ఎవరైతే ఎక్కువ బరువు ఎత్తుతారో వారే విజేత. ఆ తర్వాత రెండు, మూడు స్థానాలు నిర్ధరిస్తారు. సో, వెయిట్ లిఫ్టింగ్ పోటీలు జరిగే తీరు ఇదన్నమాట.