WFI Row: ప్రముఖ మహిళా రెజ్లర్ వినేష్ షోగట్ తన అవార్డులను న్యూఢిల్లీలోని ప్రధాన మంత్రి కార్యాలయం ఎదుట వదిలేయడానికి ప్రయత్నించారు. అయితే ఆమెను కర్తవ్య పథ్ వద్ద పోలీసులు అడ్డగించారు. దీంతో వినేష్ ఫోగట్ తన అవార్డులను కర్తవ్య పథ్ వద్ద పేవ్‌మెంట్‌పై వదిలేశారు.


దేశంలో మహిళా రెజ్లర్లకు న్యాయం జరగడం లేదని తన నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తూ అర్జున, ఖేల్‌రత్న అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని వినేష్ ఫోగట్ గతంలోనే లేఖ ద్వారా తెలిపారు. రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ చీఫ్‌ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై భారత టాప్ రెజ్లర్లు వినేష్ ఫోగట్, సాక్షి మలిక్, బజ్‌రంగ్ పూనియా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు.


‘నేను మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున అవార్డులను పొందాను. కానీ వాటిని నా జీవితంలో ఉంచుకోవడంలో ఏమాత్రం అర్థం లేదు. ప్రతి మహిళ తన జీవితాన్ని గౌరవంగా జీవించాలని అనుకుంటుంది. కాబట్టి ప్రధాన మంత్రి గారూ... నేను నా మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వెనక్కి ఇచ్చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఇకమై మేం గౌరవంగా జీవించాలనుకునే జీవితంలో ఈ అవార్డులు నాకు భారం కాబోవు.’ అని వినేష్ ఫోగట్ ప్రధాన మంత్రికి లేఖ రాశారు.


ఈ నెల ప్రారంభంలో బజ్‌రంగ్ పూనియా కూడా నిరసనలో భాగంగా తన పద్మశ్రీ అవార్డును కర్తవ్య పథ్ పేవ్‌మెంట్‌పై వదిలేశారు. మరోవైపు సాక్షి మాలిక్ కూడా నిరసనలో భాగంగా కెరీర్‌కే రిటైర్మెంట్ ప్రకటించారు. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో చెమర్చిన కళ్లతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘ఇటువంటి రోజు ఏ క్రీడాకారుడి జీవితంలోనూ రాకూడదు. దేశంలోని మహిళా రెజ్లర్లు ప్రస్తుతం వరస్ట్ ఫేజ్‌లో ఉన్నారు.’ అని బజ్‌రంగ్ పూనియా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలో పేర్కొన్నారు.


భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ సన్నిహితుడు సంజయ్ సింగ్ ఎన్నికవడంతో వివాదం కొనసాగుతోంది. రెజ్లింగ్ సమాఖ్య కొత్త అధ్యక్షుడిగా సంజ‌య్ సింగ్ ఎన్నిక ‌కావ‌డాన్ని ప‌లువురు రెజ్లర్లు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఫలితాలపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇప్పటికే రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించారు. మరో దిగ్గజ రెజ్లర్ బజ్‌రంగ్ పునియా పద్మశ్రీ పురస్కారాన్ని వెనక్కి ఇచ్చేశారు. పద్మశ్రీ పురస్కారాన్ని ప్రధాని కార్యాలయం ఎదుట ఉన్న ఫుట్ పాత్ పై పెట్టి బజ్‌రంగ్ పునియా నిరసన వ్యక్తం చేశారు. గతంలో 40 రోజుల పాటు తీవ్రంగా ఉద్యమం చేశామని దాన్ని బ్రిజ్ భూషణ్ తన పలుకుబడితో అణిచివేశారని ప్రధానిని ఉద్దేశిస్తూ బజ్ రంగ్ పునియా లేఖను షేర్ చేశారు. ప్రస్తుతం రెజ్లర్లకు మద్దతు క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే రెజ్లర్లకు దిగ్గజ బాక్సర్‌ విజేందర్‌ సింగ్‌ మద్దతుగా నిలిచారు. సాక్షి మాలిక్‌కు మ‌ద్దతు తెలిపిన మరో రెజ్లర్ వీరేంద్ర సింగ్‌ తాను కూడా ప‌ద్మశ్రీ అవార్డును వెన‌క్కి ఇవ్వనున్నట్లు ప్రక‌టించారు.