Vinesh Phogat Accuses Sexual Harassment: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌కు వ్యతిరేకంగా రెజ్లర్ల బృందం తిరుగుబాటు చేసింది. గురువారం (జనవరి 19) జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టింది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌పై ప్రపంచ ఛాంపియన్షిప్ పతక విజేత, ఒలింపియన్ వినేశ్ ఫోగట్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. లక్నోలోని నేషనల్ క్యాంప్ లో పలువురు కోచ్ లు మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించారని వినేశ్ ఫొగాట్ ఆరోపించారు.
బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. వినేశ్ ఫొగాట్‌తో పాటు బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ సహా 30 మంది రెజ్లర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. వీరంతా ప్రధాని నరేంద్ర మోడీని కలవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ ఆరోపణలను డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ ఖండించారు.
రెజ్లర్లు ఢిల్లీలో ఎందుకు ధర్నా చేస్తున్నారు?
రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని వినేశ్ ఫొగాట్ సహా రెజ్లర్లు ఆరోపించారు. ఈ ఆరోపణలపై చర్యలు తీసుకునే వరకు జంతర్ మంతర్ వద్ద ధర్నా కొనసాగించాలని రెజ్లర్లు నిర్ణయించారు. బజరంగ్ పూనియా, సాక్షి మాలిక్ వంటి ప్రముఖులతో కూడిన 30 మంది రెజ్లర్లు ఈ ఆందోళనలో పాల్గొంటున్నారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ సింగ్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ ఇస్తే కలిసి ఆధారాలు సమర్పిస్తామని విజ్ఞప్తి చేశారు.
డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ వివరణ ఏంటి?
తనపై వచ్చిన ఆరోపణలను బీజేపీ ఎంపీ, డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఖండించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ నిరాధారమైనవని, ఏ అథ్లెట్‌ను తను వేధించలేదన్నారు. ఆరోపణలు రుజువైతే తాను ఉరి వేసుకుంటానని చెప్పారు. తనపై కుట్ర జరుగుతోందని, అయితే తాను విచారణకు సిద్ధమన్నారు. తాము పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేశామని, ఒలింపిక్ విజేత రెజ్లర్లు ట్రయల్స్ ను కోరుకోవడం లేదన్నారు. 97 శాతం మంది క్రీడాకారులు ఫెడరేషన్ వద్దే ఉన్నారన్నారు. హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీ వేస్తామని అన్నారు. ప్రభుత్వం అనుకుంటే ఎలాంటి విచారణకు అయినా సిద్ధమని ప్రకటించారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ పై ఉన్న అభియోగాలేంటి?
బ్రిజ్ భూషణ్ రెజ్లర్లను మానసికంగా, శారీరకంగా హింసిస్తున్నారని ఒలింపియన్ వినేశ్ ఫోగట్ ఆరోపించారు. లక్నోలో జరిగిన జాతీయ శిబిరంలో బ్రిజ్ భూషణ్ శరణ్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వాడుకున్నారని ఆరోపించారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడి ఆదేశాల మేరకు మహిళలా రెజ్లర్లను కొందరు ఆశ్రయిస్తున్నారు. బ్రిజ్ భూషణ్ కు లక్నోలో ఇల్లు ఉందని, అందుకే ఆయన అక్కడ శిబిరాలు ఏర్పాటు చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. తద్వారా అమ్మాయిలను సులభంగా లోబరుచుకోవచ్చని వారి ప్లాన్ అని ఆరోపించారు. మహిళా రెజ్లర్ల వ్యక్తిగత జీవితంలో డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు జోక్యం చేసుకుంటున్నారని వినేశ్ ఆరోపించారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ఎవరు?
యూపీలోని కైజర్ గంజ్ బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిగా ఉన్నారు. బ్రిజ్ భూషణ్ 6 సార్లు లోక్ సభకు ఎన్నికయ్యారు. బ్రిజ్ భూషణ్ శరణ్ 2011 నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్నారు.
రెజ్లింగ్ ఫెడరేషన్ వివాదం ఏమిటి?
రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. దీనికి నిరసనగా జంతర్ మంతర్ వద్ద ధర్నా కొనసాగుతోంది. ప్రధాని మోదీని కలిసి ఆరోపణలకు సంబంధించిన అన్ని ఆధారాలను అందజేస్తామని క్రీడాకారులు చెబుతున్నారు. ఈ ఆరోపణలు వెలుగులోకి రావడంతో క్రీడా మంత్రిత్వ శాఖ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుపై 72 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశించింది. అంతే కాదు సమాధానం రాకపోతే కఠిన చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించింది. ఈ వివాదం కారణంగా యూపీలో మహిళల రెజ్లింగ్ శిబిరం రద్దైంది.