Virat Kohli Reply Babar Azam: పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ ఆజామ్‌కు టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ బదులిచ్చాడు. అతడు చేసిన ట్వీట్‌కు స్పందించాడు. తనకు అండగా నిలిచినందుకు ధన్యవాదాలు తెలిపాడు. అంతర్జాతీయ క్రికెట్లో వెలుగుతూనే ఉండాలని కోరుకున్నాడు.
రెండు రోజుల క్రితం బాబర్ ఆజామ్ (Babar Azam) క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. విరాట్ కోహ్లీపై సోదర భావాన్ని చూపించాడు. పేలవ ఫామ్‌తో ఇబ్బంది పడుతున్న రన్ మెషిన్‌కు అండగా నిలిచాడు. ఈ గడ్డు కాలం కచ్చితంగా పోతుందని ఊరట కల్పించాడు. కోహ్లీకి మద్దతుగా అతడు చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది.
'ఇదీ గడిచిపోతుంది. ధైర్యంగా నిలబడాలి విరాట్ కోహ్లీ' అని పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ ట్వీట్ చేశాడు. లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచులో విరాట్ కోహ్లీ కేవలం 16 పరుగులే చేశాడు. అతడు పెవిలియన్‌కు చేరుకున్న వెంటనే ఆజామ్ ఇలా ట్వీట్ చేయడం గమనార్హం. దీనికి విరాట్ బదులిచ్చాడు. 'ధన్యవాదాలు. నువ్విలాగే ఎదుగుతూ మెరవాలి. ఆల్ ది బెస్ట్' అని కామెంట్ పెట్టాడు. ఇప్పడీ ట్వీట్ వైరల్‌గా మారింది. వేల సంఖ్యలో రీట్వీట్లు, లైకులు, కామెంట్లు వస్తున్నాయి.
బాబర్ ఆజామ్ ట్వీట్‌పై మాజీ క్రికెటర్లు సైతం స్పందించారు. 'నువ్వీ పని చేసినందుకు చరిత్రలో గుర్తిండిపోతావు' అని ఇర్ఫాన్ పఠాన్ ట్వీట్ చేశాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ సైతం అతడిని ప్రశంసించాడు. అయితే విరాట్‌కు మద్దతుగా ఎందుకు ట్వీట్ చేశాడో గాలె టెస్టుకు ముందు బాబర్ ఆజామ్ మీడియాకు వివరించాడు.
Also Read: 1000 రోజులుగా 100 కరవు! ఆడుతోంది నిజంగా కోహ్లీయేనా అని డౌటు!!
'కచ్చితంగా విరాట్‌కు అండగా ఉంటాను. ఒక ఆటగాడిగా నాకూ అలాంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఆ గడ్డు పరిస్థితుల్లో క్రికెటర్ల ఇబ్బందులపై నాకు అవగాహన ఉంది. ఫామ్ అందుకొనేందుకు ఎంత కష్టపడతారో తెలుసు. అందుకే ఇలాంటి టైమ్‌లో మద్దతు అవసరం. విరాట్ గొప్ప ఆటగాడు. అతడు చాలా క్రికెట్ ఆడుతున్నాడు. ఒడుదొడుకుల నుంచి ఎలా బయటపడాలో అతడికి తెలుసు. కాకపోతే కాస్త సమయం పడుతుంది. అందుకే క్రికెటర్లకు మద్దతివ్వడం అవసరం' అని బాబర్ పేర్కొన్నాడు.