ఆతిథ్య ఇంగ్లాండ్‌‌తో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ రికార్డును బద్దలుకొట్టాడు. ఓవల్ వేదికగా భారత్ X ఇంగ్లాండ్ మధ్య జరుగుతోన్న నాలుగో టెస్టులో కోహ్లీ ఈ మైలురాయిని అందుకున్నాడు. 






అండర్సన్ వేసిన 18వ ఓవర్ చివరి బంతిని బౌండరీకి తరలించిన కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్​లో అత్యంత వేగంగా 23,000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాట్స్​మెన్​గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో ఈ రికార్డు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ పేరిట ఉండేది. సచిన్‌ 522 ఇన్నింగ్స్‌లలో ఈ మార్కును చేరుకోగా, కోహ్లీ కేవలం 440 మ్యాచ్‌ల్లో 490 ఇన్నింగ్స్‌లలో 55.28 సగటుతో ఈ మైలరాయిని క్రాస్‌ చేశాడు. ఇందులో 70 శతకాలు, 116 అర్ధ శతకాలు ఉన్నాయి. 


Also Read: IND vs ENG, 1st Innings Highlights: భారత్ తొలి ఇన్నింగ్స్ 191 ఆలౌట్... శార్దూల్ ఠాకూర్ 57, కోహ్లీ 50... క్రిస్ వోక్స్‌కి 4 వికెట్లు


నాలుగో టెస్టులో దూకుడుగా ఆడుతున్న విరాట్ కోహ్లీ (50) ఫోర్‌తో ఈ మ్యాచ్‌లో తన పరుగుల ఖాతాను తెరిచాడు. జేమ్స్ అండర్సన్ విసిరిన ఫుల్ లెంగ్త్ డెలివరీని మిడాన్ దిశగా కళ్లు చెదిరే రీతిలో కోహ్లీ బౌండరీకి తరలించాడు. ఈ ఫోర్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో 23,000 పరుగులు పూర్తి చేసిన ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ స్థానం దక్కించుకున్నాడు. 

ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 23,000 పరుగుల మార్క్‌ని అందుకున్న క్రికెటర్‌గా ఇప్పటి వరకూ సచిన్ టెండూల్కర్ (522 ఇన్నింగ్స్‌లతో) నెం.1 స్థానంలో ఉన్నాడు. కానీ విరాట్ కోహ్లీ 490 ఇన్నింగ్స్‌ల్లోనే ఆ మార్క్‌ని అందుకుని సచిన్ టెండూల్కర్ రికార్డ్‌ని బ్రేక్ చేసి ఏకంగా అగ్రస్థానానికే ఎగబాకాడు. కోహ్లీ, సచిన్ తర్వాత రిక్కీ పాంటింగ్ (544), జాక్వెస్ కలిస్ (551), కుమార సంగక్కర (568), రాహుల్ ద్రవిడ్ (576), మహేల జయవర్దనె (645) ఈ జాబితాలో ఉన్నారు.