విరాట్ కోహ్లీ అభిమానులకు బీసీసీఐ గుడ్‌న్యూస్ చెప్పింది. టీమ్‌ఇండియా మాజీ సారథి ఆడే వందో టెస్టు మ్యాచుకు అభిమానులను అనుమతిస్తామని వెల్లడించింది. ఈ మేరకు పంజాబ్ క్రికెట్ సంఘానికి బోర్డు సమాచారం పంపించింది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫ్యాన్స్‌కు అనుమతించాలని స్పష్టం చేసింది.
'అవును, బీసీసీఐ ఆదేశాల మేరకు టెస్టు మ్యాచుకు సంబంధించిన వారిని తప్ప సాధారణ అభిమానులను స్టేడియంలోకి అనుమతించడం లేదు' అని పంజాబ్ క్రికెట్ సంఘం ట్రెజరర్ ఆర్పీ సింగ్లా రెండు రోజుల క్రితం మీడియాకు చెప్పారు. 'ఇప్పటికీ మొహాలి చుట్టుపక్కల కొవిడ్ కేసులు పెరుగుతున్నాయి. అందుకే భద్రతా నియమాలు పాటించడం ముఖ్యం. మొహలిలో మూడేళ్ల తర్వాత జరుగుతున్న అంతర్జాతీయ మ్యాచ్‌ను అభిమానులు మిస్సవుతారన్నది నిజమే' అని ఆయన వెల్లడించారు. బెంగళూరులో జరిగే టెస్టు మ్యాచుకు మాత్రం ఫ్యాన్స్‌ను అలో చేస్తారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
ఏమైందో తెలియదు కానీ హఠాత్తుగా బీసీసీఐ ఆ నిర్ణయం మార్చుకుంది. విరాట్ కోహ్లీ ఆడే వందో టెస్టుకు అభిమానులకు అనుమతించాలని పంజాబ్ క్రికెట్ సంఘానికి చెప్పింది. కొన్నాళ్లుగా విరాట్ వందో టెస్టుకు స్టేడియాల్లోకి అభిమానులను అనుమతించకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. ఈ రోజు ఉదయం నుంచీ సోషల్ మీడియాలోనూ ఇదే విషయాన్ని ఎత్తి చూపుతున్నారు.
'మనం ఆడే ప్రతి ఆటకూ అభిమానులు ఉండాలనే కోరుకుంటాం. ఈ మధ్యన టీమ్‌ఇండియా ఫ్యాన్స్ లేకుండానే ఆడింది. నటుడు కానీ, క్రికెటర్ కానీ ఇంకెవరైనా సరే ప్రజల ముందే తమ నైపుణ్యాలను ప్రదర్శించాలని కోరుకుంటారు. వందో టెస్టు చాలా ప్రత్యేకం. ఈ మ్యాచుకు అభిమానులు లేకపోవడం దురదృష్టకరం. కానీ ప్రజల ప్రయోజనం ఆశించే ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు. మొహాలిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి' అని సునిల్ గావస్కర్ కొన్ని రోజుల ముందే అన్నారు.
వందో టెస్టుకు ప్రజలకు అనుమతిస్తామని తాజాగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ అన్నారు. 'విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచుకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. ప్రభుత్వాల మార్గనిర్దేశాల ప్రకారం స్టేడియాలను తెరవాలని రాష్ట్ర సంఘాలకు సూచించాం. ఇదంతా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే జరుగుతుంది' అని బీసీసీఔ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఏఎన్‌ఐకి తెలిపారు.