యుద్ధం ప్రారంభించిన నీతులు, నియమాలు ఏమీ పెట్టుకోకూడదని రష్యా అధ్యక్షుడు పుతిన్ డిసైడయినట్లుగా ఉన్నారు. ఆయన ఉక్రెయిన్‌పై వాక్యూమ్ బాంబు ప్రయోగించారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఉక్రెయిన్ ఈ విషయాన్ని అంతర్జాతీయంగాప్రకటించింది. ఉక్రెయిన్‌లో రష్యా పెను విధ్వంసం చేయాలనుకుంటోందని ఐక్యరాజ్య సమితిలో ఆ దేశ ప్రతినిధి ఆరోపించారు. ఉక్రెయిన్ సరిహద్దుకు సమీపంలో రష్యా థర్మోబారిక్ బహుళ రాకెట్ లాంచర్‌ను గుర్తించినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థలు ప్రకటించాయి.
అసలేంటి వాక్యూమ్ బాంబు !?
బాంబుల్లో అత్యంత శక్తివంతమైనవి కొన్ని ఉంటాయి. అవి మనుషులకే కాదు పర్యావరణానికి హాని చేస్తాయి. అలాంటి వాటిలో అత్యంత ప్రమాదకమైనది వాక్యూమ్ బాంబు. ఈ బాంబు అధిక-ఉష్ణోగ్రతతో పేలుడును సృష్టించడానికి చుట్టుపక్కల గాలి నుంచి ఆక్సిజన్‌ను ఉపయోగించుకుంటుంది. ఆ ఒత్తిడి కారణంగా భారీ పేలుడు సంభవించి.. ఆ ప్రాంతమంతా విచ్ఛిన్నం అయిపోతుంది. ఈ బాంబులు ‘థర్మోబారిక్’ వర్గానికి చెందినవి. ఈ బాంబుల్లో మొత్తంగా పేలుడు పదార్థాలనే వినియోగిస్తారు. బాంబును ప్రయోగించాక టార్గెట్‌ను చేరే క్రమంలో గాలిలోని ఆక్సిజన్ ను వాడుకుని టార్గెట్‌కు అతి చేరువలో గాల్లోనే పేలుతుంది. ఆక్సిజన్ మొత్తాన్ని పీల్చేసి గాలిలో వాక్యూమ్ ను ఏర్పరుస్తుంది.అందుకే వీటిని ‘వాక్యూమ్ బాంబ్స్’ అని పిలుస్తారు. ఫలితంగా ఆ ప్రాంతం అంతా ధ్వంసం అవుతుంది. బాంబు పేలాక ఏర్పడే తరంగాల వల్ల దాని చుట్టుపక్కల కిలోమీటర్ పరిధిలోని జనాల ఊపిరితిత్తులు, మెదడులోని కణజాలాలు, కంటిచూపు దెబ్బతింటాయని నిపుణులు చెబుతున్నారు.
వాక్యూమ్ బాంబులపై నిషేధం !
థర్మోబారిక్ బాంబులను రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే ఉపయోగించారు. ఈ థర్మోబారిక్ బాంబుల వల్ల మనుషులపై పెద్దఎత్తున ప్రభావం పడే అవకాశం ఉన్నందున అప్పట్లోనే వీటిని ప్రపంచదేశాలన్నీ నిషేధించాలని నిర్ణయించారు. జెనీవా ఒప్పందంలో భాగంగా అన్ని అగ్రదేశాలు ముఖ్యంగా వాక్యూమ్ బాంబులు కలిగి ఉన్న దేశాలు వాడబోమని సంతకాలు చేశాయి. అయితే అగ్రదేశాలు వీటిని వాడుతున్నాయన్న ఆరోపణలు తరచుగా వస్తున్నాయి. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఇరాక్‌లో దీన్ని ఉపయోగించాలని ఆదేశించారని వార్తలు వచ్చాయి. కానీ ఉపయోగించినట్లుగా నిర్ధారణ కాలేదు.
రష్యా ప్రయోగించి ఉంటే యుద్ధ నేరమే !
వాక్యూమ్ బాంబును రష్యా నిజంగా ఉక్రెయిన్ ప్రయోగించి ఉంటే నిపుణులు నిర్ధారించడం పెద్ద విషయం కాదు. అయితే ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. నిర్ధారణ అయితే మాత్రం యుద్ధ నేరం అవుతుందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అమెరికా కూడా అధికారికంగా అదే చెబుతోంది. రష్యా వాక్యూమ్ బాంబును ప్రయోగించినట్లుగా సమాచారంలేదని... ఒక వేళ ప్రయోగించి ఉంటే యుద్ధ నేరమేనని చెబుతున్నారు. అణుబాంబులనే పుతిన్ రెడీ చేస్తున్నారని వాక్యూమ్ బాంబుల ప్రయోగం ఓ లెక్క కాదని కొంత మంది అనుమానిస్తున్నారు.