RIP Harpal Singh Bedi:  భారత క్రీడా రంగాన్ని గత నాలుగు దశాబ్దాలుగా అత్యంత దగ్గరి నుంచి చూసి... ప్రతీ మలుపుకు ప్రత్యక్ష సాక్షంగా నిలిచిన ప్రముఖ స్పోర్ట్స్ జర్నలిస్ట్( sports journalist ) హర్పాల్ సింగ్ బేడీ(Harpal Singh Bedi) కన్నుమూశారు. నాలుగు దశాబ్దాల తన జర్నలిస్ట్‌ కెరీర్‌లో హర్పాల్‌ సింగ్ బేడీ భారత క్రీడారంగ ఉన్నతులను పతనాన్ని చాలా దగ్గరగా పరిశీలించారు. 72 ఏళ్ల వయసులో హర్పాల్ కన్నుమూశారు. ఆయను భార్య, ఒక కుమార్తె ఉన్నారు. గత ఏడాది  బేడీ ఆరోగ్యం బాగా క్షీణించింది. అప్పటినుంచి ఆయన బయట ప్రపంచానికి చాలా తక్కువగా కనపడ్డారు. "స్పోర్ట్స్ జర్నలిజంలో ఒక ట్రేడ్‌ మార్క్ సృష్టించిన హర్పాల్ సింగ్ బేడీ ఇక మన మధ్య లేరని 2008 ఒలింపిక్ కాంస్య విజేత బాక్సర్ విజేందర్ సింగ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌తో హర్పాల్‌ మరణించారన్న వార్త అందరికీ తెలిసింది. 





 

దశాబ్దాల అనుభవం

యునైటెడ్ న్యూస్ ఆఫ్ ఇండియా ఎడిటర్‌గా తొలుత పనిచేసిన హర్పాల్‌... ఇండియా స్పోర్ట్స్ జర్నలిజంలో అత్యున్నత వ్యక్తులలో ఒకరిగా ఖ్యాతి గడించారు. గత రెండేళ్లుగా స్టేట్స్‌మన్ వార్తాపత్రికకు కన్సల్టింగ్ ఎడిటర్‌గా పనిచేశారు. ఎనిమిది ఒలింపిక్ క్రీడలు, ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలకు సంబంధించిన వార్తలను ఆయన పాఠకాలోకానికి అందించారు. క్రికెట్, హాకీ ప్రపంచ కప్‌లు, అథ్లెటిక్స్ ఇలా ఎన్నో మెగా ఈవెంట్లను ఆయన కవర్‌ చేశారు. యువ జర్నలిస్టులకు ఆయన మార్గదర్శిగా వ్యవహరించారు. కామెంట్రీలో తన ట్రేడ్‌ మార్క్‌ హాస్యంతో ఆయన ఆకట్టుకునేవారు. "హర్పాల్ సింగ్ బేడీ అద్భుతమైన జర్నలిస్ట్‌. ఎందరికో ఆయన స్ఫూర్తిగా నిలిచారు. వేలమంది ఆయనకు అభిమానులుగా మారారు." అని ప్రముఖ పాత్రికేయుడు రాజారామన్... హర్పాల్‌ సింగ్‌కు నివాళులు అర్పించారు. రాబోయే పారిస్ ఒలింపిక్స్‌లో భారత ప్రెస్ అటాచ్‌గా రాజారామన్ విధులు నిర్వహించనున్నారు. 

 

జేఎన్‌యూ పూర్వ విద్యార్థి

ప్రతిష్టాత్మక జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థి అయిన హర్పాల్‌ సింగ్‌... అక్కడ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ నుంచి మాస్టర్స్ చేశారు. తర్వాత ఎం. ఫిల్ కూడా చేశారు. హర్పాల్‌  సింగ్‌ బేడీని... అతని సహచరులు చాలామంది  స్పోర్ట్స్ జర్నలిజంలో గాడ్‌ఫాదర్‌గా భావిస్తారు. 

 

కళ్లకు కట్టేలా చేశాడు

1984 లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పీటీ ఉష నాల్గవ స్థానంలో నిలిచి ప్రపంచం దృష్టిని ఆకర్షించిన దగ్గరి నుంచి  2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా బంగారు పతకం గెలిచే వరకూ ప్రతీ మలుపును హర్పాల్‌ సింగ్‌ బేడీ ప్రత్యక్షంగా చూశారు. 2004, 2005లో భారత క్రికెట్ జట్లతో కలిసి విదేశాల్లో పర్యటించినప్పుడు అతని ఖ్యాతి విదేశాలకు పాకింది. ఇండో-పాక్ సంబంధాలపై హర్పాల్‌ అవగాహన అత్యుత్తమ విదేశీ వ్యవహారాల నిపుణులతో సమానంగా ఉండేదని ఆయన సహచరుడు రాజారామ్ గుర్తు చేసుకున్నారు. హర్పాల్‌ వార్తలకు, హాస్యానికి ఒక నిధి లాంటి వారని ప్రముఖ పాకిస్థాన్ స్పోర్ట్స్ జర్నలిస్ట్ రషీద్ షకూర్ అన్నారు.