భారత్ X ఇంగ్లాండ్ మధ్య మరో ఆసక్తికరమైన పోరుకు రంగం సిద్ధమైంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఇరు జట్ల మధ్య బుధవారం మూడో టెస్టు ప్రారంభంకానుంది. హెడింగ్లీలోని లీడ్స్ మైదానంలో ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ప్రతిష్టాత్మక లార్డ్స్ టెస్టులో విజయం సాధించిన టీమిండియా అదే జోరును మూడో టెస్టులోనూ కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు ఆతిథ్య ఇంగ్లాండ్ జట్టు రెండో టెస్టులో ఒకానొక సమయంలో ఆధిపత్యం చెలాయించినప్పటికీ అనూహ్యంగా ఓడింది. దీంతో మూడో టెస్టులో ఎలాగైనా విజయం సాధించాలని కసిగా ఉంది. ఈ క్రమంలోనే మూడో టెస్టు ఆసక్తికరంగా సాగుతుందని అభిమానులు భావిస్తున్నారు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ తప్ప జట్టులోని మిగతా సభ్యులందరూ తమ తమ విభాగాల్లో రాణిస్తున్నారు. రెండో టెస్టులో బ్యాట్, బంతితో షమి రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో సిరాజ్ బౌలింగ్ మాయకి ఇంగ్లాండ్ చేతులెత్తేసింది. రోహిత్ శర్మ - కేఎల్ రాహుల్ మంచి ఓపెనింగ్ ఇస్తారనే అనుకుంటున్నారు. మొదటి రెండు టెస్టుల్లో ఆశించిన స్థాయిలో రాణించని విరాట్ కోహ్లీ నుంచి మూడో టెస్టులో అభిమానులు భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు. ఒకవేళ కోహ్లీ మంచి ఇన్నింగ్స్ ఆడితే ఆతిథ్య జట్టుకు కష్టాలే.
జడేజా స్థానంలో అశ్విన్ ?
మూడో టెస్టులో జడేజాను కాదని రవిచంద్రన్ అశ్విన్ ఆడిస్తారని సమాచారం. మరి, అదే జరిగితే అశ్విన్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. మొదటి రెండు టస్టుల్లోనైతే మిడిల్ ఆర్డర్‌లో పంత్, జడేజా పరుగులు సాధించారు. బౌలింగ్లో మన వాళ్లు బాగానే రాణిస్తున్నారు.
ఇక టెయిలెండర్లలో బుమ్రా, షమి ఎలాంటి పరుగులు చేశారో అందరికీ తెలిసిందే. బౌలింగ్‌లోనూ ప్రతి ఒక్కరు వికెట్లు తీస్తుండటంతో భారత్ మెరుగైన స్థితిలో కొనసాగుతోంది.
జట్టులో మార్పులుండవు: కోహ్లీ
లార్డ్స్ టెస్టులో ఆడిన భారత జట్టుతోనే టీమిండియా మూడో టెస్టుకు బరిలోకి దిగుతోందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ చెప్పాడు. విజయం సాధించిన జట్టును డిస్టర్బ్ చేయాలని అనుకోవట్లేదని అన్నాడు. ఇదే జరిగితే మూడో టెస్టులో కూడా అశ్విన్ ఆడే అవకాశం కనిపించడం లేదు. మరోపక్క రెండో టెస్టులో 8 వికెట్లతో రాణించిన మహ్మద్ సిరాజ్ పై కోహ్లీ ప్రశంసల వర్షం కురిపించాడు.
ఇక ఇంగ్లాండ్ జట్టు విషయానికొస్తే... ఆ జట్టులో కెప్టెన్ రూట్ తప్ప ఎవరూ ఇప్పటి వరకు ఆశించిన ప్రదర్శన చేయలేదు. ఓపెనర్లు డోమ్ సిబ్లీ, రోరీ బర్న్స్ జోడీపై రూట్ నిరాశగా ఉన్నాడు. ఈ క్రమంలోనే మూడో టెస్టుకు సిబ్లీని తొలగించి డేవిడ్ మలన్‌ను జట్టులోకి తీసుకుంది. నిలకడగా పరుగులు చేస్తున్న రూట్‌ని ఎంత త్వరగా ఔట్ చేస్తే మన పని అంత సులువైనట్లే. మిడిల్ ఆర్డర్‌లో అనుభవజ్ఞులైన జానీ బెయిర్‌స్టో, జోస్‌బట్లర్ భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోతున్నారు. ఇక ఆల్‌రౌండర్లుగా మంచి పేరున్న మొయిన్ అలీ, రాబిన్‌సన్ సైతం విఫలమవుతున్నారు. వీరు బౌలింగ్లో రాణిస్తున్నా బ్యాట్‌తో పరుగులు చేయలేకపోతున్నారు. రెండో టెస్టులో ఐదు వికెట్లతో ఆకట్టుకున్న మార్క్‌వుడ్ గాయం కారణంగా మూడో టెస్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో ఇంగ్లాండ్ సకీబ్ మహ్మూద్‌ను ఎంపికచేసింది. చివరగా ప్రధాన పేసర్ జేమ్స్ అండర్సన్ ఒక్కడే టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతున్నాడు.