జపాన్ రాజధాని టోక్యోలో 16వ పారాలింపిక్స్ ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రపంచం నలుమూలల నుంచి 4500 మంది పారా అథ్లెట్లు ఈ విశ్వ క్రీడల్లో సత్తా చాటడానికి సిద్ధమయ్యారు. భారత్ నుంచి గతంలో ఎన్నడూ లేని విధంగా పెద్ద జట్టుతో బరిలోకి దిగుతోంది. 54 మంది భారత అథ్లెట్లు ఈ క్రీడల్లో పాల్గొన్నారు. ఇప్పటి వరకు భారత్ పారాలింపిక్స్‌లో 12 పతకాలు గెలిచింది. ఈ సారి టోక్యో ఒలింపిక్స్‌లో రెండంకెల సంఖ్యలో పతకాలు సాధిస్తారని అంచనాలున్నాయి. సెప్టెంబరు 5 వరకు ఈ పోటీలు జరుగుతాయి.
పతాకధారిగా టెక్ చంద్
పారాలింపిక్స్ ఆరంభ వేడుకల్లో మువ్వెన్నల పతాకాన్ని టెక్ చంద్ చేతపట్టి భారత జట్టును ముందుండి నడిపించాడు. ముందుగా భారత పతాకధారిగా రియో పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన మరియప్పన్ తంగవేలును ఎంచుకున్నారు. మరియప్పన్ టోక్యోకు వెళ్లేటప్పుడు అతడు ప్రయాణించిన విమానంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతడితో సన్నిహితంగా మెలిగిన మరియప్పన్ తో పాటు మరో నలుగురు భారత అథ్లెట్లను క్వారంటైన్‌కి పంపారు. దీంతో పతాకధారి అవకాశం టెక్ చంద్‌కి దక్కింది.
ప్రారంభ వేడుకలను వీక్షించిన మోదీ
టోక్యో పారాలింపిక్స్ ప్రత్యక్ష ప్రసార వేడుకలను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వీక్షించారు. భారత జట్టు వచ్చినప్పుడు మోదీ నిలబడి చప్పట్లు కొడుతూ ప్రోత్సహించారు. ఈ వీడియోను మోదీ ట్విటర్ ద్వారా పంచుకున్నారు.