US Open Final 2022: యూఎస్ ఓపెన్ లో పెద్దగా అంచనాలు లేని ఇద్దరు యువ ఆటగాళ్లు తుది పోరుకు చేరుకున్నారు. స్పెయిన్ టీనేజ్ సంచలనం అల్కరాజ్, 23 ఏళ్ల నార్వే ఆటగాడు రూడ్ ఫైనల్లో తలపడనున్నారు. ఆదివారం అర్థరాత్రి దాటిన తర్వాత 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ ఇద్దరిలో ఎవరు గెలిచినా అది వారికి మొదటి గ్రాండ్ స్లామ్ టైటిల్ అవుతుంది. అలాగే టైటిల్ అందుకున్న వారిని నెంబర్ వన్ ర్యాంకు వరిస్తుంది.
తుది పోరుకు 19 ఏళ్ల యువ సంచలనం అల్కరెజ్..
యూఎస్ ఓపెన్ చరిత్రలోనే సుదీర్ఘంగా సాగిన రెండో మ్యాచ్ గా నిలిచిన క్వార్టర్స్ లో అద్భుత విజయం సాధించిన 19 ఏళ్ల అల్కరెజ్.. సెమీస్ లోనూ అలాగే పోరాడాడు. 4 గంటల 19 నిమిషాలు సాగిన ఈ మ్యాచ్ లో మూడో సీడ్ ఆటగాడు తియోఫోపై 6-7, 6-3. 6-1, 6-7, 6-3 తేడాతో గెలిచాడు. ప్రిక్వార్టర్స్‌లో నాదల్‌కు షాకిచ్చి.. ఆపై రుబ్లెవ్‌ను ఓడించి సెమీస్ చేరిన తియోఫో జోరుకు అల్కరాజ్ కళ్లెం వేశాడు. మ్యాచ్‌లో తొలి సర్వీస్‌లను గెలుచుకోవడంలో, నెట్ దగ్గర పాయింట్లను నెగ్గడంలో అతనిదే ఆధిపత్యం. తొలి సెట్లో ఇద్దరు క్రీడాకారులు హోరాహోరీగా తలపడడంతో టైబ్రేకర్ తప్పలేదు. అందులో ఓటమితో ప్రపంచ నాలుగో ర్యాంకర్ అల్కరాజ్ తొలి సెట్ చేజార్చుకున్నాడు. ఆ తర్వాత పుంజుకున్న అల్కరెజ్ విన్నర్లతో చెలరేగాడు.
రెండో సెట్ ఆరో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి 4-2తో ఆధిక్యంలో నిలిచాడు. అదే జోరు కొనసాగించి ఆ సెట్ దక్కించుకున్నాడు. ఇక మూడో సెట్లో మరింతగా రెచ్చిపోయాడు. కేవలం ఒక్క గేమ్ మాత్రమే కోల్పోయాడు. అల్కరెజ్ బలమైన సర్వీస్‌లు, షాట్ల ముందు ప్రత్యర్థి తేలిపోయాడు. నాలుగో సెట్లో 3-1తో దూకుడు ప్రదర్శించిన అతను మ్యాచ్ ముగించేలా కనిపించాడు. కానీ అయిదో గేమ్‌లో బ్రేక్ సాధించిన తియోఫో గట్టి పోటీనిచ్చాడు. విన్నర్‌తో 12వ గేమ్ నెగ్గి 6-6తో స్కోరు సమం చేసి సెట్‌ను టైబ్రేకర్‌కు మళ్లించాడు. అందులో మరోసారి పైచేయి సాధించాడు. దీంతో నిర్ణయాత్మక అయిదో సెట్ ఆసక్తి రేపింది.
ఓ దశలో 2-2తో స్కోరు సమమై ఉత్కంఠ పెరిగింది. కానీ తీవ్ర ఒత్తిడిని చిత్తుచేస్తూ అల్కరాజ్ ఒక్క పాయింట్ కూడా కోల్పోకుండా వరుసగా రెండు గేమ్‌లు నెగ్గాడు. తొమ్మిదో గేమ్‌లో ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేసి విజేతగా నిలిచాడు. మ్యాచ్‌లో అతను 6 ఏస్‌లు, 59 విన్నర్లు కొట్టాడు. తియోఫో 52 అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. నాదల్ (2005) తర్వాత ఓ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ చేరిన అతి పిన్న వయస్కుడిగా 19 ఏళ్ల అల్కరాజ్ నిలిచాడు.
తుదిపోరుకు రూడ్..
మంచి ఫామ్‌లో ఉన్న ప్రపంచ ఏడో ర్యాంకర్ రూడ్ ఈ ఏడాది రెండో గ్రాండ్‌స్లామ్ టోర్నీలో తుదిపోరుకు అర్హత సాధించాడు. ఇప్పటికే ఫ్రెంచ్ ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన అతను.. ఇప్పుడు యూఎస్ ఓపెన్‌లో టైటిల్‌కు అడుగు దూరంలో ఉన్నాడు. సెమీస్‌లో అయిదో సీడ్ రూడ్ (నార్వే) 7-6 (7-5), 6-2, 5-7, 6-2తో కచనోవ్ (రష్యా)ను ఓడించాడు.