US Open 2023: కెరీర్‌లో 24వ గ్రాండ్‌స్లామ్ దిశగా సాగుతున్న సెర్బియా సూపర్ స్టార్ నొవాక్ జకోవిచ్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. భారత కాలమానం ప్రకారం శనివారం ఉదయం ముగిసిన పురుషుల సింగిల్స్ తొలి సెమీస్ పోరులో జకోవిచ్.. 6-3, 6-2, 7-6 (7-4) తేడాతో అమెరికాకే చెందిన బెన్ షెల్టన్‌ను ఓడించాడు. తద్వారా జకో.. పదోసారి ఈ టోర్నీలో ఫైనల్ చేరాడు. డానియల్ మెద్వదెవ్ - కార్లోస్ అల్కరాజ్‌ల మధ్య జరుగుతున్న రెండో సెమీస్‌లో విజేతతో జకో ఫైనల్‌లో తలపడతాడు.
న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియం వేదికగా ముగిసిన పోరులో జకో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. ఈ మ్యాచ్‌కు ముందు యూఎస్ ఓపెన్‌లో అమెరికా ఆటగాళ్ల మీద సూపర్ రికార్డు (12-0) ఉన్న జకో దానిని మరింత (13-0) మెరుగుపరుచుకున్నాడు. 2007లో తొలిసారి యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన జకోకు ఇది పదో యూఎస్ ఫైనల్. ఇందులో 2011, 2015, 2018లలో అతడు టైటిల్‌లు గెలిచాడు. ఇక ఓవరాల్‌గా జకోవిచ్‌కు ఇది 36వ గ్రాండ్‌స్లామ్ ఫైనల్ కావడం విశేషం.
సబలెంక వర్సెస్ కోకో గాఫ్
మహిళల సింగిల్స్ లో ఫైనల్ బెర్త్‌లు ఖాయమయ్యాయి. అమెరికాకే చెందిన యువ సంచలనం కోకో గాఫ్ ఇదివరకే ఫైనల్ పోరుకు అర్హత సాధించగా శుక్రవారం ముగిసిన రెండో సెమీస్‌లో అరీనా సబలెంక 0-6, 7-6 (7-1), 7-6, (10-5) తేడాతో కీస్ మాడిసన్ ఓడించింది. ఇరువురి మధ్య హోరాహోరిగా సాగిన పోరులో బెలారస్ భామ సబలెంక తొలి సెట్‌తో పాటు గేమ్ కూడా కోల్పోయింది. రెండో సెట్‌లో నాలుగో గేమ్ నుంచి పుంజుకున్న సబలెంకకు మాడిసన్ గట్టిపోటీనిచ్చింది. ఇరువురి మధ్య హోరాహోరిగా సాగిన పోరులో సబలెంకనే విజయం వరించడంతో ఆమె తొలిసారి యూఎస్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఫైనల్ పోరులో సబలెంక - కోకో గాఫ్‌లు తలపడనున్నారు.
ఫైనల్‌లో బోపన్న ధ్వయం బోల్తా..
43 ఏండ్ల ఆరు నెలల వయసులో యూఎస్ ఓపెన్ ఫైనల్ ఆడిన భారత వెటరన్ ఆటగాడు రోహన్ బోపన్నకు తుదిపోరులో నిరాశే మిగిలింది. ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్‌తో కలిసి బరిలోకి దిగిన బోపన్న జోడీ.. 6-2, 3-6, 4-6 తేడాతో రాజీవ్ రామ్ (యూకే)- జోయ్ సలిస్‌బురిల చేతిలో ఓడింది. తొలి గేమ్ గెలిచిన బోపన్న జోడీ తర్వాత తడబడింది. ఫస్ట్ గేమ్‌లో వెనుకబడ్డ రాజీవ్ రామ్ ధ్వయం రెండో రౌండ్‌ను సొంతం చేసుకుంది. ఇక డిసైడైర్ అయిన మూడో గేమ్ ను కూడా ఈ జోడీ గెలుచుకుని యూఎస్ ఓపెన్ డబుల్స్ ఫైనల్స్‌ను సొంతం చేసుకుంది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial