US Open 2022: యూఎస్ ఓపెన్ లో బుధవారం ఓ రికార్డు నమోదైంది. కార్లోస్ ఆల్కరెజ్, జనిక్ సిన్నర్ మధ్య జరిగిన మ్యాచ్ రికార్డు సాధించింది. యూఎస్ ఓపెన్ చరిత్రలోనే అత్యధిక సమయంపాటు సాగిన రెండో మ్యాచ్ గా నిలిచిపోయింది. 


యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ చరిత్రలో 5 గంటల 15 నిమిషాల పాటు సుదీర్ఘంగా సాగిన రెండో మ్యాచ్ గా.. ఆల్కరెజ్, సిన్నర్ మధ్య జరిగిన మ్యాచ్ రికార్డు సాధించింది. ఆర్థర్ ఆషే మైదానం దీనికి వేదికైంది. 5 సెట్ల పాటు జరిగిన ఈ మ్యాచ్ లో ఆల్కరెజ్ విజయం సాధించి తన తొలి గ్రాండ్ స్లామ్ సెమీఫైనల్లో అడుగుపెట్టాడు. సెమీస్ లో లోకల్ బోయ్  ఫ్రాన్సిస్‌ టియాఫోతో తలపడనున్నాడు.


ఈ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో 6-3, 6-7, 6-7, 7-5, 6-3 తేడాతో సిన్నర్‌పై 19 ఏళ్ల ఆల్కరెజ్ విజయం సాధించాడు. తొలి సెట్ ను 6-3 తో గెలిచిన అతనికి.. తర్వాత రెండు సెట్లలో సిన్నర్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. సిన్నర్ 2, 3 సెట్లను 7-6, 7-6 తేడాతో గెలుచుకున్నాడు. ఈ రెండు సెట్లను సిన్నర్ టై బ్రేక్ లోనే గెలుచుకున్నాడు. రెండో సెట్ లో 5-6తో వెనుకబడిన సిన్నర్ 4 సెట్ పాయింట్లను కాచుకుని మరీ విజయం సాధించాడు.  మూడో సెట్లో ఇద్దరూ హోరాహోరీగా తలపడగా.. అదీ టై బ్రేక్ కు దారితీసింది. అక్కడ ఆల్కరెజ్ నుంచి సిన్నర్ కు పెద్దగా ప్రతిఘటన ఎదురుకాలేదు. దాంతో సెట్ ను తేలికగా గెలిచాడు.


అయితే తర్వాతి సెట్లలో ఆల్కరెజ్ అద్భుతంగా పుంజుకున్నాడు. నాలుగో సెట్ లో సిన్నర్ 2-1 లీడ్ లో ఉన్నప్పటికీ.. ఆల్కరెజ్ పుంజుకుని 7-5తో సెట్ గెలుచుకున్నాడు. ఐదో సెట్ లోనూ అదే జోరు చూపించిన ఆల్కరెజ్ 6-3 తో సెట్ తో పాటు మ్యాచ్ ను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్ 5 గంటల 15 నిమిషాలపాటు సాగింది. యూఎస్‌ ఓపెన్‌ చరిత్రలో అత్యధిక సమయం పాటు సాగిన రెండో మ్యాచ్‌ ఇది. 1992లో స్వీడన్‌కు చెందిన స్టెఫాన్‌ ఎడ్‌బర్గ్‌, అమెరికా ఆటగాడు మైఖెల్‌ చాంగ్‌ మధ్య జరిగిన మ్యాచ్‌ 5 గంటల 26 నిమిషాల పాటు సాగింది. ఇప్పటికీ యూఎస్‌ ఓపెన్‌లో అదే రికార్డు.


రఫెల్ నాదల్ తర్వాత ఓ గ్రాండ్ స్లామ్ టోర్నమెంట్ సెమీఫైనల్స్ కు వెళ్లిన అతిపిన్న వయస్కుడిగా ఆల్కరెజ్ చరిత్ర సృష్టించాడు. 2005లో నాదల్ అతిచిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్ ను గెలుచుకున్నాడు.