Under-19 World Cup : దక్షిణాప్రిక వేదికగా జరుగుతున్న అండర్-19 వరల్డ్ కప్‌లో నేపాల్ జట్టు చివరి దశలో విజయాన్ని నమోదు చేసింది. పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఒక వికెట్ తేడాతో నేపాల్ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన అప్ఘనిస్తాన్ జట్టు 40.1 ఓవర్లలో పది వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు తుది వరకు పోరాడి విజయాన్ని దక్కించుకుంది. 44.5 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన నేపాల్ 149 పరుగులు సాధించడం ద్వారా విజయం సాధించింది. నేపాల్ జట్టులో కెప్టెన్ దేవ్ ఖానల్ 58(89) బాధ్యతాయుత ఇన్సింగ్ ఆడడంతో జట్టు విజయాన్ని నమోదు చేయగలిగింది. చివరిలో దీపక్ బోహరా 42 బంతుల్లో 27 పరుగులు చేయడంతో నేపాల్ జట్టు తుది వరకు పోరాడి విజయాన్ని దక్కించుకోగలిగింది.
నేపాల్ బౌలర్ల విజృంభణ
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆప్ఘనిస్థాన్ జట్టు స్వల్ప స్కోర్‌కు పరిమితమైంది. 40.1 ఓవర్లలో పది వికెట్లు నష్టపోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. నేపాల్ బౌలర్లు విజృంభించడంతో అప్ఘనిస్థాన్ బ్యాటర్లకు స్కోర్ చేయడం కష్టమైంది. అప్ఘనిస్థాన్ మొదటి ముగ్గురు బ్యాటర్లలో ఇద్దరు డకౌట్ కాగా, ఓపెనర్ జంషెద్ జర్దాన్ 14 బంతులు ఆడి మూడు పరుగులు చేశాడు. వికెట్ కీపర్ నుమాన్ షా ఎదుర్కొన్న తొలి బంతికే ఔట్ కాగా, వన్ డౌన్‌లో వచ్చిన ఖైద్ తాన్విల్ నాలుగు బంతులాడి డకౌట్‌గా వెనుదిరిడు. ఆ తరువాత వచ్చిన హసన్ ఎషకిల్ 20(35), షోహైల్ ఖాన్ జుమాతి 4(7), ఆలి అహ్మద్ డకౌట్ 0(1)గా వెనుదిరిగాడు. కెప్టెన్ నాసీర్ ఖాన్ మార్ఫిఖిల్ కెప్టెన్ ఇన్సింగ్ ఆడడం ద్వారా జట్టు నామమాత్రపు స్కోరు సాధించేలా చేశాడు. 83 బంతులు ఆడిన నాసీర్ ఖాన్ మూడు ఫోర్ల సహాయంతో 31 పరుగులు చేశాడు. అల్లా ఘజాన్‌ఫర్ కూడా మెరుగైన ఇన్సింగ్ ఆడాడు. 21 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లు సహాయంతో 37 పరుగులు సాధించాడు. ఆ తరువాత వచ్చిన అరబ్ గుల్ మోమద్ నాలుగు బంతులు ఆడి డకౌట్‌గా వెనుతిరగ్గా, ఫారిడాన్ దావోద్జాయ్ 65 బంతులు ఆడి 29 పరుగులు సాధించాడు. ఖలీల్ అహ్మద్ ఏడు బంతులాడి ఒక్క పరుగు చేయకుండా వెనుతిరిగాడు. మొత్తంగా ఆప్ఘానిస్థాన్ బ్యాటర్లలో ఐదుగురు డకౌట్ కాగా, నలుగురు మాత్రమే 20కుపైగా పరుగులు సాధించారు. నేపాల్ బౌలర్లలో అకాశ్ చాంద్ ఐదు వికెట్లతో ఆప్ఘనిస్థాన్ వెన్ను విరిచాడు. దీపేష్ కాందేల్ రెండు, తిలక్ బండారి, సుభాష్ బండారి, గుల్సా జా ఒక్కో వికెట్ పడగొట్టారు.
కెప్టెన్ ఇన్సింగ్‌తో విజయం
స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ జట్టు విజయం కోసం తుది వరకు పోరాడాల్సి వచ్చింది. అప్ఘనిస్థాన్ బౌలర్లు కట్టుదిట్టగా బౌలింగ్ చేయడంతోపాటు వరుసగా వికెట్లు పడగొట్టడంతో నేపాల్ జట్టు ఒత్తిడికి లోనైంది. ఒకానొక దశలో ఆప్ఘానిస్థాన్ జట్టు విజయాన్ని నమోదు చేస్తుందనిపించింది. కానీ, ఆ జట్టు కెప్టెన్ దేవ్ ఖానల్ బాధ్యాతాయుతమైన ఇన్సింగ్ ఆడడంతో నేపాల్ జట్టు చివరి దశలో విజయాన్ని నమోదు చేసింది. నేపాల్ జటట్టులో ఓపెనర్లు విఫలమయ్యారు. అర్జున్ కుమాల్ 10(14), వికెట్ కీపర్ బిపిన్ రావాల్ 2(19), వన్ డౌన్ బ్యాటర్ గుల్సా జా 1(12) వికెట్లను త్వరగా కోల్పోవడంతో నేపాల్‌పై ఒత్తిడి పెరిగింది. ఆ తరువాత వచ్చిన కెప్టెన్ దేవ్ ఖానల్ 89 బంతుల్లో ఏడు ఫోర్లు సహాయంతో 58 పరుగులు చేశాడు. ఆకాష్ త్రిపాఠి 16(39) సహాయంతో మరో వికెట్ పడకుండా స్కోరు బోర్డుపై పరుగులు వచ్చేలా చేయడం ద్వారా నేపాల్‌పై ఒత్తిడి తగ్గించే ప్రయత్నం చేయడంతోపాటు నేపాల్‌ను విజయం దిశగా తీసుకెళ్లాడు. ఈ క్రమంలోనే వరుసగా మళ్లీ వికెట్లను కోల్పోవడంతో నేపాల్ జట్టు కష్టాల్లో పడినట్టు అయింది. చివరలో వచ్చిన దీపక్ బోహరా 42 బంతుల్లో 27 పరుగులు చేసి జట్టును విజయ తీరాలవైపు తీసుకెళ్లాడు. చివరిలో సుభాష్ బండారి ఫోర్ కొట్టడం ద్వారా జట్టుకు అపురూప విజయాన్ని అందించిపెట్టాడు. ఆప్ఘనిస్థాన్ బౌలర్లలో ఫరిదాన్ దావూద్జాయ్ మూడు, ఖలీల్ అహ్మద్ రెండు, నాసీర్ ఖాన్ మార్ఫుఖిల్ రెండు వికెట్లు పడగొట్టారు. అల్లాహ్ గంజాఫర్, అరబ్ గగుల్ మొమ్మద్ ఒక్కో వికెట్ తీశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఐదు వికెట్లు పడగొట్టిన ఆకాశ్ చంద్ అందుకున్నాడు.