టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌ ప్రస్థానం బుధవారం పతకం లేకుండానే ముగిసింది. టోక్యో పారాలింపిక్స్‌లో తొలి స్వర్ణం అందించిన షూటర్‌ అవనీ లేఖరా ఈ రోజు ఆ జోరును కొనసాగించలేకపోయింది. దీంతో పది మీటర్ల మిక్స్‌డ్‌ ఎయిర్‌ రైఫిల్‌ ప్రోన్‌ ఎస్‌హెచ్‌ 1 పోటీల్లో ఆమె విఫలమైంది. ఆమెతో పాటు సిద్ధార్థ బాబు, దీపక్‌ కుమార్‌ సైతం అంచనాలు అందుకోలేకపోయారు. దాంతో బుధవారం భారత్‌కు ఒక్క పతకమైనా దక్కలేదు.






రెండు రోజుల క్రితం మహిళల ఆర్‌2 పది మీటర్ల ఎయిర్‌ రైఫిల్‌ స్టాడింగ్‌ ఎస్‌హెచ్‌1 పోటీల్లో అవని స్వర్ణం సాధించింది. 249.6 స్కోరు సాధించి ప్రపంచ రికార్డును సమం చేసింది. సరికొత్త ఒలింపిక్‌ రికార్డు సృష్టించింది. పారాలింపిక్స్‌లో తొలి పసిడి అందించిన క్రీడాకారిణిగా ఘనత అందుకుంది. ఆమె మరో పతకం సాధిస్తుందని అంచనా వేస్తే ఊహకి అతీతంగా నిరాశపరిచింది. రైఫిల్‌ ప్రోన్‌ పోటీల్లో అవని 27వ స్థానంలో నిలిచింది. కేవలం 629.7 స్కోరు సాధించి మూడో రౌండ్లో వెనుదిరిగింది. జర్మనీకి చెందిన నటాషా హిల్‌ట్రాప్‌ స్వర్ణం, కొరియా అథ్లెట్‌ పార్క్‌ జిన్హో రజతం, ఉక్రెయిన్‌ షూటర్‌ ఇరినా షెట్నిక్‌ కాంస్యం గెలుచుకున్నారు.


మిగిలిన పారా షూటర్లు సిద్ధార్థ్‌ బాబు, దీపక్‌ కుమార్‌ పురుషుల ఈవెంట్లో ఘోర ప్రదర్శన చేశారు. 625.5 స్కోరుతో సిద్ధార్థ్‌ 40, 624.9 స్కోరుతో దీపక్‌ 43వ స్థానంలో నిలిచారు. ఫలితంగా భారత్‌ మిక్స్‌డ్‌ టీం ఈవెంట్లో పతకం లేదు. 


బ్యాడ్మింటన్ మిక్స్‌‌డ్ ఈవెంట్లో భారత జోడీ పరాజయం పాలైంది. ఓపెనింగ్ మ్యాచ్లో ప్రమోద్ భగత్ - పాలక్ కోహ్లీ జోడీ 21-9, 15-21, 21-19 తేడాతో ఓడిపోయారు. 


డిస్ క్వాలిఫై అయిన స్విమ్మర్ సుయాష్ జాదవ్ 


భారత స్విమ్మర్ సుయాష్ జాదవ్ డిస్ క్వాలిఫై అయ్యాడు.  100 మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్ SB7 ఫైనల్ పోటీల్లో అతడు టర్న్ అయ్యే సమయంలో ఒక ఫ్లై కిక్ ఎక్కువ ఇవ్వడంతో అతడు డిస్ క్వాలిఫై అవ్వాల్సి వచ్చింది. శుక్రవారం 50 మీటర్ల బటర్ ఫ్లై S7 ఈవెంట్లో జాదవ్ పోటీ పడాల్సి ఉంది.