టోక్యోలో పారాలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకలకు జపాన్‌ చక్రవర్తి నరుహిటో, ప్రధాని సుగా హాజరయ్యారు. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్‌ 5 వరకు 13 రోజుల పాటు ఈ పోటీలు జరగనున్నాయి. ఈ విశ్వక్రీడల్లో 163 దేశాలకు చెందిన సుమారు 4500 మంది పారా అథ్లెట్లు పాల్గొన్నారు. 






ఈసారి పారాలింపిక్స్‌లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన చోటు చేసుకుంది. అఫ్గానిస్థాన్‌లో విపత్కర పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఆ దేశానికి సంబంధించిన అథ్లెట్లు ఈ సారి టోక్యో పారాలింపిక్స్‌లో పాల్గొనడం లేదు. అయినప్పటికీ ఆ దేశ పతాకం ఆరంభోత్సవంలో ఎగిరింది. ఆ దేశంలో అనిశ్చితికి తోడు విమాన ప్రయాణాల రద్దు కావడంతో అఫ్గానిస్థాన్ అథ్లెట్లు టోక్యోకు రాలేకపోయిన సంగతి తెలిసిందే. 






అయితే అఫ్గాన్‌కు సంఘీభావం తెలుపుతూ ఆ దేశ పతాకాన్ని ఆరంభోత్సవ కార్యక్రమంలో ప్రదర్శించాలని అంతర్జాతీయ పారాలింపిక్‌ కమిటీ నిర్ణయించింది. ఈ మేరకు పారాలింపిక్ వాలంటీర్ ఒకరు ఆ దేశ పతాకాన్ని ప్రదర్శించారు. అంతర్జాతీయ పారాలింపిక్ కమిటీ నిర్ణయం పట్ల పలువురు సంతోషం వ్యక్తం చేశారు. 






22 క్రీడలకు సంబంధించి 540 ఈవెంట్లలో పోటీలు జరగనున్నాయి. పతకాలే లక్ష్యంగా భారత్​ నుంచి 54 మంది పారా అథ్లెట్లు బరిలోకి దిగుతున్నారు. వీరిలో 14 మంది మహిళలు, 40 మంది పురుషులు ఉన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత త్రివర్ణ పతాకాన్ని జావెలిన్ త్రోయర్ టెక్ చంద్ చేతబూని మన దేశ బృందాన్ని నడిపించాడు.


Also Read: Paralympics Opening Ceremony: అట్టహాసంగా పారాలింపిక్స్ ఆరంభ వేడుకలు... భారత పతాకధారిగా టెక్ చంద్